కర్నాటకలో 90శాతం హామీలు అమలు

కర్నాటకలో 90శాతం హామీలు అమలు– విద్యుత్‌శాఖమంత్రి కేసీ.జార్జ్‌ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కర్నాటకలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల్లో 90శాతం అమలు చేసినట్టు ఆ రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి కేసీ జార్జ్‌ వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చిన అన్ని విజ్ఞప్తులను తమ మ్యానిఫెస్టోలో పొందుపరిచినట్టు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు అజరు కుమార్‌, జెడి శీలం, సామ రామ్మోహన్‌రెడ్డి, వచన్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. కర్నాటకలో ఐదు గ్యారంటీలిచ్చామనీ, వాటన్నింటినీ అమలు చేస్తామన్నారు. అన్న భాగ్య పథకం కింద 10 కిలోల బియ్యం హామీ ఇచ్చామనీ, కేంద్ర ప్రభుత్వం బియ్యం సరఫరా చేయకపోవడంతో పేదలకు బియ్యం డబ్బులు ఇస్తున్నట్టు తెలిపారు. కర్నాటకలో కరెంట్‌ లేదంటూ బీఆర్‌ఎస్‌ అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కొన్ని అవాంతరాలొచ్చినా కూడా వాటిని అధిగమించి రైతులకు అవసరమైన కరెంట్‌ అందిస్తున్నట్టు వివరించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇక్కడ 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామని చెవుతున్నారంటే, అది గత కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన కృషి ఫలితమేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఛత్తీస్‌గడ్‌ నుంచి పవర్‌ ఎందుకు కొంటుందని ప్రశ్నించారు. దాన్ని బట్టి ఇక్కడ పవర్‌ ఉత్పత్తి కావడం లేదనే కదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఛత్తీస్‌గడ్‌ డిస్కమ్స్‌ మూడువేల కోట్ల రూపాయల బకాయి ఉందన్నారు. వాటిని చెల్లించక పోవడంతో కరెంట్‌ సరఫరా ఆగిపోయిందని తెలిపారు. కర్నాటకలో కరెంట్‌ సరఫరాపై తాము చర్చకు సిద్ధమనీ, బీఆర్‌ఎస్‌ నేతలు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు.
రేపు రాష్ట్రంలో రాహుల్‌ పర్యటన
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ శనివారం ఎన్నికల ప్రచారానికి రానున్నారు. మూడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఆయన ప్రసంగించనున్నారు. నాందేడ్‌ నుంచి హెలికాప్టర్‌లో 12 గంటలకు బోధన్‌కు చేరుకుని అక్కడ మాట్లాడుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మద్యాహ్నం రెండు గంటలకు ఆదిలాబాద్‌ సభలో, ఆ తర్వాత వేములవాడ సభలో ఆయన ప్రసంగిస్తారు.

Spread the love