నా దృష్టిలో ఉత్తమ ఎంపీ.. పొన్నం ప్రభాకర్

– ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పార్లమెంట్లో గళం విప్పుతా
– ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి..
– గౌడ సంఘం ఆత్మీయ సమావేశంలో వెలిచాల రాజేందర్
నవతెలంగాణ-భగత్ నగర్ : ఇప్పటివరకు కరీంనగర్లో ఎంతోమంది ఎంపీలను చూశానని, కానీ పొన్నం ప్రభాకర్ ఉత్తమ ఎంపీగా తన మదిలో ఎప్పుడు మెదులుతారని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ నగరంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో గౌడ సంఘం ఆత్మీయ సమావేశానికి మంత్రి పొన్నంతో కలిసి రాజేందర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అయితే.. పేపర్ స్ప్రే పోరాటం చేసి తెలంగాణ ఏర్పాటుకు నాంది పలికిన పొన్నం ప్రభాకర్ అంటే తనకు తీవ్రమైన అభిమానం అని ఉద్ధాటించారు. గతంలో ఏ ఎంపీ సాధించినన్ని పనులు సాధించిన ఘనుడు పొన్నం ప్రభాకర్ అని, పార్లమెంట్లో 850 ప్రశ్నలను సంధించి, కరీంనగర్కు ఎన్నో అభివృద్ధి పొలాలను తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని తాను ఎంపీగా గెలిచిన తర్వాత పొన్నం మాదిరిగా పార్లమెంట్ల వ్యవహరించినందుకు ప్రయత్నం చేస్తానని, కరీంనగర్ అభివృద్ధికి శక్తివంచన మేరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ పళ్ళ కరీంనగర్ కు ఒనగూరింది ఏమీ లేదని, సొంత ప్రయోజన మినహా ప్రజా సమస్యల పట్ల ఎలాంటి ఆలోచనలేని బండి సంజయ్ కు, కరీంనగర్ ఎంపీగా ఉండి వరంగల్ పై ప్రేమ చూపిన బోయినపల్లి వినోద్ కు తగిన బుద్ధి చెప్పి హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థి అయిన తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమాజంలో గౌడ సంఘ నేతలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love