– మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసుల నోటీసు
– ఆరోగ్యం బాగాలేక లింగయ్య గైర్హాజరు
– 14న హాజరు కావాలని జూబ్లీహిల్స్ ఏసీపీ ఆదేశం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో తొలిసారిగా ఒక రాజకీయ నాయకుడికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ కేసులో తమ ఎదుట హాజరు కావాలని ఈ కేసును పర్యవేక్షిస్తున్న ఏసీపీ వెంకటగిరి.. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను నోటీసులో కోరారు. ఈనెల 8న జారీ చేసిన ఈ నోటీసులో మూడ్రోజుల్లోగా తమ ఎదుట హాజరు కావాలని ఏసీపీ కోరారు. అయితే, సోమవారంతో నోటీసు గడువు ముగిసినప్పటికీ.. లింగయ్య దర్యాప్తు అధికారుల ఎదుట హాజరు కాలేదు. ఒకపక్క, అధికారులు ఎదురు చూస్తుండగా.. సాయంత్రం సమయంలో అనారోగ్య కారణం వల్ల తాను హాజరు కాలేకపోతున్నానంటూ లింగయ్య నుంచి ఏసీపీకి సమాచారమందింది. అయితే, ఈ నెల 14న తప్పకుండా హాజరు కావాలంటూ జూబ్లీహిల్స్ ఏసీపీ.. లింగయ్యకు నోటీసులు పంపించారు. గత ఎనిమిది నెలలుగా జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఫోన్‌ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుపుతున్న విషయం విదితమే. ఎన్నికలలో బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి లబ్ది చేకూర్చటానికి విపక్ష కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, ఇతర పార్టీల నాయకులు, చివరకు జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు దర్యాప్తు అధికారులు తేల్చారు. ముఖ్యంగా, అప్పటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు పర్యవేక్షణలో ఏర్పాటు కాబడ్డ ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఫోన్‌ట్యాపింగ్‌లకు పాల్పడినట్టు దర్యాప్తులో బయటపడింది. సంచలనం రేపిన ఈ కేసులో ఇప్పటి వరకు.. అప్పటి ఎస్‌ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు, నగర టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఎస్‌ఐబీకి చెందిన ఇద్దరు అదనపు ఎస్పీలు తిరుపతన్న, బుజంగరావులను స్పెషల్ టీం పోలీసులు అరెస్ట్ చేయటంతో ఈ నలుగురు నిందితులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసు దర్యాప్తును అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టకముందే.. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, మరో అనుమానితుడు ఐ న్యూస్ సీఈఓ శ్రవణ్ కుమార్‌లు దేశం విడిచి అమెరికాకు వెళ్లినట్టు పోలీసుల వద్ద సమాచారం ఉన్నది. ఈ కేసులో నిందితులుగా చేర్చిన వీరిని తీసుకురావటానికి దర్యాప్తు అధికారులు రెడ్‌కార్నర్ నోటీసును కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్‌రావుకు చెందిన పాస్‌పోర్ట్‌ను.. పాస్‌పోర్ట్ అధికారులు రద్దు చేసినట్టు తెలుస్తుండగా.. మరోపక్క, ప్రభాకర్‌రావు అమెరికాలోనే స్థిర పడటానికి గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు దర్యాప్తు అధికారులు స్వాధీనపర్చుకున్న ఫోన్‌ట్యాపింగ్ పరికరాలు, హార్డ్‌డిస్క్‌లు, ఇతర ధ్వంసమైన పరికరాలపై పరీక్షలు నిర్వహించిన ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు.. ఈ కేసుకు సంబంధించిన మరికొంత సమాచారాన్ని దర్యాప్తు అధికారులకు అందించినట్టు తెలుస్తున్నది. మరొకవైపు, ఇప్పటికే అరెస్టయిన అధికారుల నుంచి విచారణలో అనేక అంశాలను దర్యాప్తు అధికారులు సేకరించారు. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం వెనక పోలీసు అధికారులు మాత్రమే లేరనీ, అప్పటి రాజకీయ ప్రముఖుల హస్తం కూడా ఉన్నట్టు దర్యాప్తు అధికారులు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లభించిన కొన్ని ఆధారాలనుబట్టి తాజాగా ఈ కేసులో మొదటిసారిగా రాజకీయ నాయకుడు చిరుమర్తి లింగయ్యను విచారణకు పిలిచినట్టు తెలుస్తున్నది. ఈ కేసులో ఇప్పటి వరకు తేలిన నిందితుల్లో ఒకరితో లింగయ్యకు సన్నిహిత సంబంధాలున్నట్టు బయటపడటంతో ఆయనను విచారించాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించినట్టు సమాచారం.