అమ్మతనం ఆపదలో పడింది!
పడతి బతుకు పడిలేచే తరంగమైంది
‘ఆమె’ ను నాగరిక ప్రపంచమే
నవకీకారణ్యమై వేటాడుతోంది
కాంక్రీటు జనారణ్యంలో లేడీ
పులుల మధ్య లేడికూనై పరిగెడుతుంది
అతివ అంతరిక్షాన్నే దాటొస్తున్నా
కఠిన వాస్తవం మాత్రం
కనికరం లేకుండా మాటేసి కాటేస్తుంది
ఎదిగానని ఆమె అనుకొంటోంది
ఎదిగీ ఎదగని లోకాన్ని మరుస్తోంది!
దుశ్శాసనుడి సంతతి ఆమె నమ్మకాన్ని
నిత్యం తుంచేస్తూనే వుంది..
పురుషాధిక్య భావజాలమే
ఆమెను భోగం బొమ్మలా చూపి
మదాంధుల మెదళ్ళలో విషపు విత్తులు చల్లి
గజానికో అసురుడ్ని ఆయత్తం చేసే
మాయాజాలమై వెంటాడుతుంది
ప్రతి ఇల్లూ పాఠశాలై
ప్రతి తల్లిదండ్రీ ప్రథమ ఉపాధ్యాయులై
యువతకు స్త్రీ విలువ బోధించాలి..
‘ఆమె’ లోకవనంలో విహరించాలి తప్ప
కీకారణ్యంలో వేటలా భక్షింపబడరాదు!
(ప్రపంచ మహిళా దినోత్సవం )
– భీమవరపు పురుషోత్తమ్, 9949800253