మహిళలపై పెరుగుతున్న నేరాలు

Increasing crime against women– చిన్నారులపై కూడా…
–  ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో మహిళలు, చిన్నారులపై నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2021తో పోలిస్తే గత సంవత్సరం ఈ తరహా నేరాల సంఖ్య 2.13% పెరిగింది. 2017లో మహిళ లపై జరిగిన నేరాలకు సంబంధించి 3,15,215 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడా సంఖ్య 3,65,300కి చేరింది.
గత ఆరు సంవత్సరాల కాలంలో మహిళలపై జరిగిన నేరాల సంఖ్యలో 15.88% పెరుగుదల కన్పించింది. 2017తో పోలిస్తే 2018లో నేరాల సంఖ్య 2.57% ఎక్కువ. కోవిడ్‌, లాక్‌డౌన్‌ సమయంలో మాత్రం ఈ తరహా నేరాలు తగ్గాయి. 2019తో పోలిస్తే 2020లో నేరాల సంఖ్య 10.22% తగ్గింది.
అయితే 2021లో నేరాలు రికార్డు స్థాయిలో 14.87% పెరగడం గమనార్హం. మహిళ లపై జరుగుతున్న నేరాలకు సంబంధించిన కేసుల్లో ఎక్కువ గా భర్త, అతని బంధువులే నిందితులుగా ఉంటున్నారు. మహిళల కిడ్నాప్‌లు కూడా గణనీయంగానే జరుగుతు న్నాయి. గత సంవత్సరం జరిగిన నేరాల్లో 89% నేరాలకు భర్త, అతని బంధువుల దాష్టీకాలు, అపహరణలే కారణం.
మహిళలపై నేరాలు అత్యధికంగా జరిగిన రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉంది. 2017 నుండి 2022 వరకూ వరుసగా ఆరు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికే అగ్రస్థానం. 2019 నుండి 2022 వరకూ రాజస్థాన్‌ రెండో స్థానంలో ఉంది. 2017లో ఆ రాష్ట్రం ఐదో స్థానంలోనూ, 2018లో నాలుగో స్థానంలోనూ నిలిచింది. మహిళలపై నేరాల రేటుకు సంబంధించి మాత్రం గత సంవత్సరం ఢిల్లీ, రాజస్థాన్‌, హర్యానా రాష్ట్రాలు మొదటి మూడు స్థానాలలో ఉన్నాయి.

పెరిగిన పోక్సో నేరాలు
2017 తర్వాత చిన్నారులపై జరిగిన లైంగిక నేరాల సంఖ్య 94.47% పెరిగిందని ఎన్‌సీఆర్‌బీ నివేదిక తెలిపింది. ఈ తరహా నేరాలలో కూడా ఉత్తర ప్రదేశ్‌ దే మొదటి స్థానం. గత సంవత్సరం దేశంలో నమోదైన మొత్తం 63,414 కేసుల్లోనూ ఒక్క యూపీలోనే 8,136 కేసులు నమోదయ్యాయి. 2017లో పోక్సో చట్టం కింద 32, 608 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య 2022 నాటికి 94% పెరిగింది. పోక్సో కింద నేరాలకు పాల్పడిన వారిలో 96.8% మంది బాధితుల తో అంతకు ముందే పరిచయం ఉన్న దని నివేదిక పేర్కొంది.
బీజేపీ పాలిత రాష్ట్రాలలో అధిక ఉపా కేసులు
2017 నుండి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద దేశంలో నమోదైన కేసులలో 60% జమ్మూకాశ్మీర్‌, అసోం, మణిపూర్‌, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలలోనివే. 2017లో ఉపా కింద 901 కేసులు నమోదు కాగా వాటిలో 86% కేసులు ఈ రాష్ట్రాలలోనే నమోదయ్యాయి. 2019లో అత్యధికంగా 1,226 ఉపా కేసులు నమోదయ్యాయి. పైన తెలిపిన రాష్ట్రాలతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలోనూ చెప్పుకోదగిన సంఖ్యలోనే కేసులు వచ్చాయి. 2019లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు ఆందోళనకారులపై ఉపా కింద కేసులు పెట్టారు. 2019లో బీహార్‌, తమిళనాడు, కేరళ, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలలో కూడా ఉపా కేసులు ఎక్కువగానే వచ్చాయి. తమిళనాడులో అత్యధికంగా 270 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు ఆరు సంవత్సరాల కాలంలో ఈ చట్టం కింద ఆ రాష్ట్రంలో ఎన్నడూ ఐదు కేసులకు మించి నమోదు కాలేదు. ఉపా కేసులు నమోదైన రాష్ట్రాలన్నీ బీజేపీ ఏలుబడిలోనో లేదా ఆ పార్టీ సంకీర్ణ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వాల పాలనలోనో ఉన్నవే. జార్ఖండ్‌లో మాత్రం తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఉపా కేసులు నమోద య్యాయి. 2017 మార్చిలో ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపా కేసులు పెరగడం ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు. అంతకు ముందు 2017లో ఉపా కింద అక్కడ కేవలం పది కేసులు మాత్రమే నమోదయ్యాయి. a

Spread the love