Monday, August 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆటోల నిరవధిక బంద్ విరమణ

ఆటోల నిరవధిక బంద్ విరమణ

- Advertisement -

మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చలు సఫలం
ఆటో చార్జీల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు అంగీకారం..
వచ్చేనెల 1వ తేదీన కీలక భేటీ..ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ‘రైడ్ యాప్’
ఈవీ రెట్రో ఫిట్‌మెంట్‌కు రూ. 1.50 లక్షల సాయం

నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ వ్యాప్తంగా ఆటో కార్మిక సంఘాల జేఏసీ తలపెట్టిన నిరవధిక సమ్మె విరమించింది. నేటి రాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌‌లు, స్కూల్‌ ‌వ్యాన్ల నిరవధిక బంద్‌ ‌చేపట్టాలని కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌ ఖైరతాబాద్‌‌లోని రవాణాశాఖ కేంద్ర కార్యాలయంలో పి.శ్రీకాంత్‌, అజయ్‌‌బాబు(సీఐటీయూ), ఆర్‌‌డీ చంద్రశేఖర్‌, జి.మల్లేష్‌ ‌గౌడ్‌ (ఐఎన్‌‌టీయూసీ), బి.వెంకటేశం(ఏఐటీయూసీ), మారయ్య (బీఆర్‌‌టీయూ), రవిశంకర్‌(‌బీఎంఎస్‌), ప్రవీణ్(టీయూసీఐ), రామిరెడ్డి (ఐఎఫ్‌‌టీయూ), ఎ. సత్తిరెడ్డి(టీఏడీఎస్‌), ఎంఎ.సలీమ్(టీఆర్‌‌టీయూ-టీఆర్‌ఎస్‌), గాజుల ముఖేష్‌ గౌడ్‌, మందారవి(‌ఆటో జేఏసీ), ఆజాద్‌ ఆటో యూనియన్‌(‌మజీద్‌) నాయకులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆన్‌‌లైన్‌‌ చర్చల్లో పాల్గొనగా, రవాణా శాఖ కమిషనర్‌ ఇలాంబర్తి, అడిషనల్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సి.రమేష్, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, వెంకటరమణ చర్చలు జరిపారు. ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ విజ్ఞప్తిని మన్నించి సమ్మెను విరమించినందుకు ఆటో కార్మిక సంఘాల నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.​

​ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు..
కార్మికుల చిరకాల కోరికైన సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని విధివిధానాల ఖరారు కోసం సెప్టెంబర్ 1వ తేదీన కార్మిక శాఖ, రవాణా శాఖ అధికారులు, ఆటో యూనియన్ ప్రతినిధులతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. 2012 తర్వాత ఇప్పటివరకు ఆటో చార్జీలను సవరించకపోవడంతో, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఎంత మేరకు పెంచాలనే దానిపై నివేదిక తెప్పించుకుని, త్వరలోనే అధికారిక జీవో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

​ప్రభుత్వం తరపునే సొంత యాప్
ఓలా, ఉబర్ తరహాలోనే ప్రయాణికులు, డ్రైవర్లకు ఉపయోగపడేలా రాష్ట్ర ఐటీ శాఖ సహకారంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రారంభించే ప్రక్రియను చేపట్టనున్నారు. రాపిడో, ఓలా, ఉబర్ వంటి సంస్థల్లో నడిచే ద్విచక్ర వాహనాల్లో కేవలం కమర్షియల్ (ఎల్లో ప్లేట్) నంబర్ ఉన్న వాటికి మాత్రమే ప్రయాణికులను చేరవేసే అనుమతినిచ్చే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ పక్షాన ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేస్తోందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని మంత్రి తేల్చిచెప్పారు.

రూ. 1.50 లక్షల ఈవీ సబ్సిడీ
హైదరాబాద్ కోర్ ఏరియాలో కాలుష్యాన్ని తగ్గించేందుకు పాత డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ (ఈవీ) ఆటోలుగా మార్చుకోవడానికి (రెట్రోఫిట్‌మెంట్) ప్రభుత్వం తరఫున రూ. 1.50 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు. అలాగే కొత్త ఈవీ ఆటోల కొనుగోలుపై సబ్సిడీని అమలు చేస్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ. 12,000 వార్షిక సహాయం హామీపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు కేబినెట్‌తో చర్చించి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. కాగా, సమ్మె విరమణతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయా ణికులు, ఉద్యోగులు, ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు యథావిధిగా రోడ్లపై తిరగనున్నాయి. ఈ సమావేశంలో సీఐటీయూ నగర నాయకులు బి. లక్ష్మణ్‌, తదితరులు ‌పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -