మా ప్రతిస్పందన భూకంపాన్ని గుర్తు చేస్తుంది : ఇరాన్ హెచ్చరిక
టెహ్రాన్ : తమపై అమెరికా సాగిస్తున్న ‘ఆర్థిక యుద్ధం’లో భాగస్వాములయ్యే దేశాలను శత్రువులుగానే చూస్తామని ఇరాన్ హెచ్చరించింది. ‘అమెరికా చేస్తున్న ఆర్థిక యుద్ధంలో చేరవద్దని మేము అన్ని దేశాలనూ కోరుతున్నాం. మాపై ఆర్థిక ఆంక్షలు విధించడంలో భాగస్వామి అయ్యే ఏ దేశాన్ని అయినా శత్రువుగానే పరిగణిస్తాం’ అని ఇరాన్ జాతీయ భద్రతా మండలి అధిపతి మొహసేన్ రెజాయ్ ప్రభుత్వ టీవీకి తెలిపారు. అమెరికా నుంచి దూరం కావడానికి నిరాకరించే దేశాల ప్రయోజనాలకు హాని కలిగిస్తామని ఆయన స్పష్టం చేశారు. తాము ఇప్పటి వరకూ అమెరికా ఆర్థిక ప్రయోజనాలపై దాడి చేయలేదని గుర్తు చేశారు. ఇప్పటి వరకూ సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని, అయితే వారు తమపై ఆర్థిక ఆంక్షలు విధించాలని కోరుకుంటే మాత్రం ఇరాన్ చుట్టూ ఉన్న అమెరికా చమురు, ఆర్థిక కంపెనీలపై దాడి చేస్తామని చెప్పారు. తమపై అమెరికా చర్యకు దిగితే ప్రతిస్పందన భూకంపాన్ని తలపిస్తుందని రెజాయ్ అన్నారు.
ఇరాన్ మరింత శక్తివంతమైంది : పెజెష్కియాన్
తీవ్రమైన ఒత్తిడి తెస్తే వెనిజులా మాదిరిగా తాము కూడా కుప్పకూలిపోతామని శత్రువులు అంచనా వేస్తున్నారని, అయితే అలాంటిదేమీ జరగదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చెప్పారు. వారి అంచనాలు తప్పని ఇప్పటికే రుజువైందని ఆయన అన్నారు. శత్రువు ఊహించింది జరగలేదు సరికదా ఇరాన్ మరింత శక్తివంతమైందని, ఆర్థిక, సైనిక, భద్రతాపరమైన ఆంక్షలు ఎదురైనప్పటికీ సంఘటితంగా నిలిచి శత్రువును ప్రతిఘటించిందని తెలిపారు. ఇరాన్ వ్యవస్థాపకుడు అయతొల్లా రహొల్లా ఖమేనీ సమాధి వద్ద ఆదివారం జరిగిన కార్యక్రమంలో పెజెష్కియాన్ ప్రసంగిస్తూ తాము తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న మాట నిజమేనని, అయితే శత్రువుల నుంచి ఎన్ని ఒత్తిడులు వచ్చినప్పటికీ సామర్ధ్యాన్ని నిరూపించుకున్నామని చెప్పారు.
నేడు ఇరాన్‌లో పాక్ ఆర్మీ చీఫ్ పర్యటన
పాకిస్తాన్ సైనిక దళాల అధిపతి అశిమ్ మునీర్ సోమవారం ఇరాన్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చిస్తారని ఇరాన్ విదేశాంగ శాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. నిలిచిపోయిన అమెరికా – ఇరాన్ చర్చల్లో తన మధ్యవర్తిత్వ ప్రయత్నాలను పునరుద్ధరించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న సమయంలో ఈ పర్యటన జరుగుతోంది. అమెరికా – ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందంలో హామీదారుగా పాకిస్తాన్ సంతకం చేసిన విషయం తెలిసిందే.
ఆర్థిక యుద్ధంలో చేరితే శత్రువుగానే చూస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



