కేంద్రం ఇచ్చిన హామీల అమలుపై నేడు సమీక్ష
ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణ, పరిహారం అంశాల్లో పురోగతి లేదు : సీజేపీ
ముంబయి: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)మరోసారి ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతోంది. జులై 25న దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనను విరమించినప్పటికీ… కేంద్రం నుంచి హామీల అమలుపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో సోమవారం జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించింది. జులై 25న ఆందోళన విరమించే సమయంలో కేంద్రం తమకు పలు హామీలు ఇచ్చిందని సీజేపీ తెలిపింది. వాటి అమలు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధికారికంగా తమకు తెలియజేయలేదని పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చిన మాటను నమ్మి ఉద్యమాన్ని విరమించామనీ, తమ విశ్వాసాన్ని బలహీనతగా భావించొద్దని సీజేపీ హెచ్చరించింది. హామీల అమలుకు అవసరమైన అన్ని చర్యలనూ పరిశీలిస్తామనీ, అందులో మరోసారి శాంతియుత మరోసారి శాంతియుత దేశవ్యాప్త ఆందోళన చేపట్టే అవకాశమూ ఉందని స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన హామీలను ఆలస్యం చేయడం, వేరే అర్థం చెప్పడం లేదా విస్మరించడం వంటి చర్యలను సహించబోమని హెచ్చరించింది. అలా జరిగితే దేశ యువతకు చేసిన వాగ్దానానికి ద్రోహంగా భావిస్తామని స్పష్టం చేసింది.
ఎఫ్‌ఐఆర్‌లపై సుప్రీంకోర్టులో విచారణ
ఇటీవల ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం కూడా కీలకంగా మారింది. ఆగస్టు 18న దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఆందోళనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్‌ల సమగ్ర జాబితాను సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరినట్టు సీజేపీ తెలిపింది. సుప్రీంకోర్టు ఈ జాబితాను మూడుసార్లు కోరిందనీ, కేసులను కొట్టివేసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తన అధికారాలను వినియోగించే అంశాన్ని పరిశీలించేందుకు ఈ వివరాలు అవసరమని వివరించింది. అయితే కోర్టు పదేపదే కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ జాబితాను అందజేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వలేదని ఆరోపించింది.
’యువతను మోసం చేస్తున్నారా?’
సుప్రీంకోర్టు విచారణ అనంతరం సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్, న్యాయ వ్యవహారాల విభాగం బాధ్యురాలు రత్నా సింగ్ ప్రభుత్వ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేసినట్టు పార్టీ తెలిపింది. కేంద్రంతో చర్చల సందర్భంగా ఇచ్చిన హామీల ఆధారంగానే ఉద్యమాన్ని విరమించామని, ఇప్పుడు వాటి అమలులో జాప్యం జరుగుతుండటం యువతను మోసం చేసినట్లేనని వారు అభిప్రాయపడినట్టు పేర్కొంది. ముఖ్యంగా నిరసనలకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించడం, విద్యార్థులు లేదా శాంతియుత ఆందోళనకారులపై భవిష్యత్తులో శిక్షాత్మక చర్యలు తీసుకోకుండా హామీ ఇవ్వడం వంటి అంశాలపై స్పష్టత కావాలని సీజేపీ కోరుతోంది.
నీట్ బాధిత కుటుంబాలకు పరిహారం
సీజేపీ డిమాండ్లలో మరో కీలక అంశం నీట్ యూజీ వివాదం. పేపర్ లీక్ కారణంగా మేలో పరీక్ష రద్దు కావడం, దాని తర్వాత కొందరు అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని పార్టీ డిమాండ్ చేసింది. ఈ అంశంపైనా కేంద్రం హామీ ఇచ్చిందని చెప్తోంది. అయితే పరిహారం, ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణ సహా లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం తమను అధికారికంగా సంప్రదించలేదని ఆరోపించింది. ఇక ఇటీవల నిరసనల సందర్భంగా పోలీసుల చర్యపై విచారణ జరిపేందుకు హైపవర్డ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ రోజు జరిగిన మార్చ్ ఫుటేజీని కమిటీ పరిశీలిస్తుందని తెలిపింది. అలాగే మహిళా ఆందోళనకారుల్ని లక్ష్యంగా చేసుకున్నారంటూ వచ్చిన ఆరోపణలపై కూడా దర్యాప్తు జరుగుతుందని వెల్లడించింది. ఈ ప్యానెల్‌లో మాజీ న్యాయమూర్తులు, సీబీఐ మాజీ డైరెక్టర్, రాష్ట్ర మాజీ డీజీపీ సభ్యులుగా ఉంటారని చెప్పింది.



