ఇందిరమ్మ రాజ్యమంటే ఇష్టం లేని పెండ్లి చేసుడు…

ఇందిరమ్మ రాజ్యమంటే ఇష్టం లేని పెండ్లి చేసుడు...– కాదంటే కాల్చి చంపుడే….
– కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారా? : కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇందిరమ్మ రాజ్యమంటే ఇష్టం లేని పెళ్లి చేసుడు…కాదంటే కాల్చి చంపుడేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఒక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బలవంతంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన పాపం కాంగ్రెస్‌ పార్టీదేననీ, ఆ పార్టీ కారణంగానే తెలంగాణ అరిగోసలు పడ్డదని తెలిపారు. అలాంటి రాజ్యం మళ్లీ తెస్తామని ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే చెబుతున్నారనీ, అంత ఇష్టంగా ఉంటే కర్ణాటకలో అలాంటి పాలన చేసుకోవాలే తప్ప తెలంగాణకు అక్కర్లేదన్నారు. గురువారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం సాధించిన విజయాలపై ఆయన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 55 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ అంటే నెర్రలు వేసిన భూములు, విద్యుత్‌ కోతలు, రైతుల ఆత్మహత్యలు, మహబూబ్‌నగర్‌ అంటే వలసలు, నల్లగొండ అంటే ఫ్లోరోసిస్‌ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చాక బీఆర్‌ఎస్‌ తొమ్మిదిన్నరేండ్లలో కోవిడ్‌-19 కారణంగా రెండేండ్లు, ఎన్నికలకు మరో ఏడాది పోనూ నికరంగా పాలించిన ఆరున్నరేండ్లలో తెలంగాణ ముఖచిత్రం మారిందని తెలిపారు. మూడోసారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని భర్తీ చేశారు..? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ జనాభా 4 కోట్లుండగా, పదేండ్ల కాలంలో 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు కేటీఆర్‌ తెలిపారు. రాజస్థాన్‌లో ఎనిమిదిన్నర కోట్ల జనాభా, గుజరాత్‌లో ఆరు కోట్ల జనాభా ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. అలాంటి పార్టీల నాయకులకు బీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతో వెబ్‌ సైట్‌లో పెట్టామనీ, అవి వాస్తవాలు కాదని చెప్పే దమ్ముందా? … అని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు సవాల్‌ విసిరారు. ప్రయివేటు రంగంలో లక్షల ఉద్యోగాలు సృష్టించి, ఉపాధి కల్పించామని కేటీఆర్‌ తెలిపారు. తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెంచామనీ, పేదరికాన్ని తగ్గించామనీ, వేగంగా వికేంద్రీకరణ చేశామని కేటీఆర్‌ తెలిపారు. ధాన్యం దిగుబడి, పంటల విస్తీర్ణం పెరిగిందన్నారు. ఇంటింటికి తాగునీరు సరఫరా అవుతుందన్నారు. చెరువుల పునరుద్ధరణ, పల్లె ప్రగతితో గ్రామాల స్వరూపం మారిందని చెప్పారు. మత్య్ససంపద పెరిగిందన్నారు. కాళేశ్వరం పూర్తి చేశామనీ, మరో ఏడాదిలో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, దళిత బంధు వంటి పథకాలు మ్యానిఫెస్టోలో పెట్టకుండానే అమలు చేసినట్టు గుర్తుచేశారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆగమే
– తెలంగాణ గొంతు కేసీఆర్‌ను పీకేసే కుట్ర
– రూ.4వేల కోట్లతో హుజూర్‌నగర్‌ నియోజకవర్గం అభివృద్ధి : బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే ఆగమవుతామని, నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌తో ప్రజలు ఆగమయ్యారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణకున్న ఒకే ఒక గొంతు కేసీఆర్‌ అని, ఆయన్ను తెలంగాణ దాటి రాకుండా చూసుకోవాలన్నదే రాహుల్‌ గాంధీ, మోడీ కుట్ర అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌, నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్‌ షోల్లో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని అడుగుతుందని, ఒక్క ఛాన్స్‌ కాదు 11 ఛాన్సులు ఇచ్చిన జిల్లాలో ఫ్లోరోసిస్‌, సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించలేదన్నారు. తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రూ.12వేల కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం, జిల్లాలో ఫ్లోరోసిస్‌ నిర్మూలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. అసైన్డ్‌ భూమి పట్టాదారులకు హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, లిఫ్టులు పూర్తి కావాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
రూ.4వేల కోట్లతో హుజూర్‌నగర్‌ నియోజకవర్గం అభివద్ధి
హూజుర్‌నగర్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చేయలేని అభివృద్ధిని ఎమ్మెల్యే సైదిరెడ్డి చేశాడని కేటీఆర్‌ అన్నారు. నూతన ఆర్డీవో, ఈఎస్‌ఐ ఆస్పత్రి, నేరేడుచర్లను నూతన మున్సిపాలిటీగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆయకట్టు చివరి భూములకు నీరు అందాలనే ఆలోచనతో రూ.1770 కోట్లతో ముత్యాల బ్రాంచ్‌ జాన్‌పహాడ్‌ లిఫ్టులను నూతనంగా ఏర్పాటు చేశామన్నారు. ఉత్తంకుమార్‌ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏర్పాటుచేసిన లిఫ్టులు చాలావరకు మరమ్మతులకు నోచుకోకపోవడంతో తిరిగి ఆ లిఫ్టును మరమ్మతు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

Spread the love