అమాయ‌కులే టార్గె‌ట్‌..!

– నకిలీ విత్తనాలు అంటగడుతున్న అక్రమార్కులు
– అధిక దిగుబడి ఆశ చూపుతూ విక్రయాలు
– గుట్టుచప్పుడు కాకుండా పల్లెలకు..రహస్య ప్రాంతాల్లో నిల్వ
– దుకాణాలు..డీలర్ల ద్వారా రైతులకు పంపిణీ
– తాజా తనిఖీల్లో పట్టుబడుతున్న అనుమతి లేని విత్తనాలు
ఖరీఫ్‌ సీజన్‌ రాగానే నకిలీ విత్తనాలు లభ్యం కావడం కలకలరం రేపుతోంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది సైతం అదే పరిస్థితి పురావృతమవుతోంది. నిరక్షరాస్యులు.. అమాయక రైతులే టార్గెట్‌గా నకిలీ విత్తన ముఠాలు చెలరేగిపోతున్నాయి. అనుమతి లేని విత్తనాలు అన్నదాతలకు అంటగడుతూ అందినకాడికి దండుకుంటున్నాయి. ఇప్పటికే దహెగాం మండలంలో నకిలీ విత్తనాలు పట్టుబడగా.. తాజాగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో రూ.19.35లక్షల విలువ గల అనుమతి లేని పత్తి విత్తనాలు పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజుల క్రితమే ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ గోదాంలో క్వింటాళ్ల కొద్దీ లూజ్‌ విత్తనాలు నిల్వ చేసి వాటిని వివిధ కంపెనీల పేరిట ఆకర్షణీయమైన ప్యాకెట్లలో నింపుతూ దుకాణాలకు సరఫరా చేయడం కలకలం రేపుతోంది. తాజాగా కచ్చితమైన సమాచారంతో సదరు గోదాంపై దాడిచేసిన అధికారులు ఇక్కడ విక్రయించేందుకు అనుమతిలేని పత్తి విత్తనాలు పట్టుకోవడంతో స్థానిక రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి వ్యవహారాలు ఇంకా ఎన్ని చోట్ల ఉన్నాయోననే భయాందోళన చెందుతున్నారు.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
అధిక విస్తీర్ణం..మారుమూల ప్రాంతాలు..అమాయక రైతులు అధికం కలిగిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నకిలీ విత్తనాలు లభ్యం కావడం సాధారణ విషయంగా మారుతోంది. ప్రతి ఏటా వీటిని పూర్తిగా నిర్మూలిస్తామని చెబుతున్న అధికారుల మాటలు ఆచరణలో సాధ్యం కావడం లేదు. రైతుల అమాయకత్వం..అధికారుల ఉదాసీనత వైఖరి కారణంగా నకిలీ విత్తన ముఠాలు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఆంధ్రా, మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాల నుంచి ఇక్కడకు క్వింటాళ్ల కొద్దీ అనుమతి లేని విత్తనాలను సరఫరా చేస్తున్నారు. స్థానిక డీలర్లను మధ్యవర్తులుగా నియమించుకొని వారి ద్వారా పల్లెలకు చేరవేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో ఆదివాసీ గ్రామాలు, మారుమూల పల్లెల్లోనే వీటిని అధికంగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల దుకాణాల ద్వారా రైతులకు వీటిని అంటగడుతున్నారు. వారు చెప్పిన విత్తనాలు వేస్తే బ్యాగుకు క్వింటాల్‌కు 15 నుంచి 20క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని..పురుగు మందులు కూడా అధికంగా వాడాల్సిన అవసరం ఉండదని.. కాత..పూత కూడా పుష్కలంగా వస్తుందని ఆకర్షనీయమైన ప్యాకెట్లలో నింపుతూ వీటిని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా కంపెనీల గురించి ఎక్కువగా తెలియని రైతులు వీరి మాటలను నమ్మి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా వాటిని పొలంలో వేసిన తర్వాత మొలకలు రాకపోవడం.. వచ్చినా పంట ఎదుగుదల లేకపోవడం..కాత, పూత లేకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం కాగానే తాము నష్టపోయాయని బాధపడుతుండటం సాధారణంగా మారుతోంది.
కేసులు సరే.. చర్యలు ఏవీ..?
అధికారుల తనిఖీల్లో ప్రతి ఏటా నకిలీ విత్తనాలు పట్టుబడుతున్నాయి. సీజన్‌ ముందుగానే ఆయా పల్లెలకు చేరడం.. డీలర్లు పల్లెలకు నేరుగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. నేరుగానే కాకుండా జిల్లా, మండల కేంద్రాల్లోని కొన్ని దుకాణాల ద్వారా వీటిని రైతులకు అంటగడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ విక్రయించేందుకు అనుమతి లేని కంపెనీల పేరిట విక్రయాలు చేపడుతూ రైతులను నట్టెటా ముంచుతున్నారు. అధికారులు గతంలో నార్నూర్‌, వాంకిడి, గాదిగూడ, ఉట్నూర్‌, ఇచ్చోడ, సిరికొండ తదితర మండలాల్లో అనుమతి లేని పత్తి విత్తనాలు పట్టుకున్నారు. వారిపై కేసులు నమోదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు పట్టుబడిన దుకాణాలను బ్లాక్‌ లిస్టులో పెడుతామని, లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కానీ కేసులు మాత్రమే నమోదు చేసిన అధికారులు ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదనే విమర్శలున్నాయి. ప్రతి ఏటా జరిగే ఈ వ్యవహారాన్ని మామూలుగా తీసుకుంటూ మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు అధికారులు దుకాణాల యజమానులు, డీలర్లతో కుమ్మక్కు కావడంతోనే చర్యలు లేకుండా పోయాయని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా సీజన్‌ ప్రారంభంలోనే చేపట్టాల్సిన తనిఖీలను అధికారులు పట్టించుకోకపోవడం కారణంగానూ ఈ ఏడాది సైతం ఈ నకిలీ విత్తనాల కలకలం రేపుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వారం రోజుల క్రితమే టాస్క్‌ఫోర్స్‌ టీం ఏర్పాటుచేసి తనిఖీలు చేపట్టగానే ఆదిలాబాద్‌ జిల్లాలో అనుమతి లేని విత్తనాలు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. ముందస్తుగానే తనిఖీలు చేపట్టి ఉంటే నకిలీల నివారణ కొంత వరకైనా సాధ్యమయ్యేదనే అభిప్రాయం రైతుల నుంచి వినిపిస్తోంది.
నిరంతరం తనిఖీలు చేపడుతున్నాం : పుల్లయ్య, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
జిల్లాలో నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపేందుకు నిరంతరం తనిఖీలు చేపడుతున్నాం. వీటిని నివారించేందుకు ఇప్పటికే టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఏర్పాటుచేశాం. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నాయి. జిల్లాలోని దుకాణాల్లోనూ తనిఖీలు చేపట్టి అనుమతి లేని విత్తనాలు విక్రయించకుండా చర్యలు తీసుకుంటాం.

Spread the love