కేరళలోని వయనాడ్ జిల్లాలో గతేడాది కొండ చరియలు విరిగిపడి భారీ విపత్తు బారినపడ్డ బాధితులను ఆదుకునేందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం టౌన్‌షిప్ నిర్మాణం చేపట్టడం బహు ప్రశంసనీయం. గతేడాది జులై 30న మండక్కై, చూరాల్‌మల సహా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. అనేకమంది గల్లంతయ్యారు. ఈ విలయానికి 402 కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. ఇళ్లు నిర్మించాలని కోరిన 242 కుటుంబాల్లో… 175 కుటుంబాలకు తొలి దశగా కాల్పెట్టలోని ఎల్‌స్టన్ ఎస్టేట్‌లో ప్రభుత్వం నిర్మించనున్న టౌన్‌షిప్‌నకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం శంకుస్థాపన చేశారు. రెండో దశలో మరో 70 మంది లబ్ధిదారులకు ఇళ్లను లేదా పరిహారాన్ని, మిగిలిన వారు కోరుకున్న విధంగా ఆర్థిక సాయాన్ని అందిస్తారు. ఒక్కో ప్లాటుకు ఏడు సెంట్లు చొప్పున వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంతో రెండు పడక గదులు, అటాచ్డ్ బాత్ రూం, లివింగ్ రూమ్, డైనింగ్ ఏరియా, వర్క్ ఏరియా, సిట్ అవుట్, స్టడీ రూమ్‌తో నిర్మించనున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం సుమారు రూ.20 లక్షలు కావచ్చునని అంచనా! కేంద్రం ఆదుకోకపోయినా ప్రజలంతా ఐక్యంగా మానవతతో అందిస్తున్న సహాయ, సహకారాలే పునరావాస చర్యలను కొనసాగిం చడంలో తమ ప్రభుత్వానికి స్ఫూర్తినిస్తున్నాయని విజయన్ తెలిపారు. నిరుపేదలు మొదలు సంపన్న వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని, చిన్నారులు సైతం తాము దాచుకున్న చిన్నచిన్న మొత్తాలను విపత్తు బాధితుల సహాయార్థం అందించి గొప్ప మానవత్వాన్ని ప్రదర్శించారని వివరించడం ద్వారా విపత్తు సమయంలోనూ, తదనంతరమూ బాధితులను ఆదుకోవడంలో ప్రజల పాత్రను విజయన్ విశదపరిచారు. మహా విపత్తులో బాధితుల కోసం పెద్ద ఎత్తున కొనసాగుతున్న పునరావాస పనులు కేరళ ప్రజల ఐక్యతకు గొప్ప ఉదాహరణ అని, ప్రజా చైతన్య స్ఫూర్తిని ఏ ప్రకతి విపత్తూ ఓడించజాలదన్న పినరయి మాటలు ప్రత్యక్షర సత్యాలు. ‘ప్రజలు మనతో ఉంటే అసాధ్యమంటూ ఏదీ ఉండదు. మనం మనుగడ సాగించగలం. ఇక్కడ కొనసాగుతున్న పునరా వాస పనులు ఇచ్చే సందేశమిదే’ అని విజయన్ అన్నారు. ‘ఏ ఒక్క బాధితుడు ఒంటరిననే బాధతో ఉండరాదని, ఆ దిశగా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేందుకు కషి చేస్తోందని, కోల్పోయిన ఆప్తులనైతే తిరిగి తీసుకురాలేం కానీ వారిని అన్ని విధాల ఆదుకుంటామ’ని ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కె రాజన్ చెప్పడం బాధితుల గుండె నిండా భరోసా నిలుపుతుంది.
ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు వివిధ రూపాల్లో సాయం అందించగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి స్పందించే హదయం లేకపోయింది. ఇప్పటివరకు చిల్లిగవ్వ సాయం కూడా అందించకపోవడం కమలనాథుల పాషాణ హదయానికి నిలువుటద్దం. పునరావాసం కోసం కేంద్రం తన మూలధన పెట్టుబడి పథకం నుంచి దాదాపు రూ.529.50 కోట్ల రుణం మాత్రమే మంజూరు చేసింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత వివక్షాపూరితంగా వ్యవహరిస్తుందో చెప్పడానికిది గొప్ప నిదర్శనం.
వరదలు, కోవిడ్ ఇలా ఒకదాని వెంబడి ఒకటి వరుసగా ఇబ్బందులు రావడంతో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు రాష్ట్రం పోరాడుతున్న సమయంలో సంభవించిన ఈ ప్రకతి విపత్తును తట్టుకొని, ధీరోదాత్తంగా నిలబడడం స్ఫూర్తి దాయకం. కేంద్రం మొండిచెయ్యి చూపించిన నేపథ్యంలో పునరావాస పనుల్లో ప్రజలు సహాయ సహకారాలు అందించేందుకు వీలుగా సీఎం ఒక స్పాన్సర్‌షిప్ పోర్టల్‌ను ప్రారంభించడం ముదావహం. స్పందించే ప్రజలు సహాయమందించడానికి, ఆ నిధుల నిర్వహణ పారదర్శకంగా ఉండడానికీ అది దోహదపడుతుంది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ), నేషనల్ సర్వీస్ స్కీమ్ కింద పాఠశాల, కళాశాల విద్యార్థులు సేకరించిన నిధుల వివరాలను ముఖ్యమంత్రి వెల్లడించడం మరింతమంది దాతలకు స్ఫూర్తినిస్తుంది. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ‘రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం భవితపై బాధితులందరికీ గొప్ప ఆశను కలిగిస్తోందని’ కొనియాడడం కొసమెరుపు!