మగవారు అత్యంత ధైర్య సాహసాలు చూపిస్తే ‘అబ్బా వాడురా అసలైన హీరో అంటే’ అంటారు. మరి మహిళలు అదే ధైర్యాన్ని చూపిస్తే… ఎంతో కాలం నుండి ఇదో పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. దీనికి సమాధానంగానే గత ఏడాది ‘షీరోస్’ పేరుతో 256 మంది ధీర వనితల స్ఫూర్తిదాయక జీవితాలను మన ముందుకు తీసుకొచ్చింది ఎనిమిదో తరగతి చదువుతున్న అహల. ఇంగ్లీష్‌లో ఉన్న ఈ పుస్తకాన్ని అనువదించి తెలుగు పాఠకులకు అందించారు వంగపల్లి పద్మ. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదర్భంగా షీరోస్‌లోని కొన్ని పాత్రలను బాలోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో నేటి తరానికి చూపించబోతున్నారు.
గత ఏడాది డిసెంబర్‌లో షీరోస్ పుస్తకం తెలుగులోకి తీసుకొచ్చారు. ఏబీసీడీ అనే సంస్థ దీన్ని తీసుకొచ్చింది. షీరోస్ అంటే ధీర వనితలు. పాత తరం నుండి నేటి వరకు ఎన్నో విజయాలు సాధించిన మహిళల గురించి ఇందులో ఉంది. స్ఫూర్తిదాయక జీవితాలు వీరివి. అందుకే వీటిని నేటి తరానికి కండ్లకు కట్టినట్టు చూపించాలనే ఉద్దేశంతో ఉమెన్స్‌డే రోజు బాలోత్సవ్ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. స్కూల్ టీచర్లు, నాట్య గురువులు ఇందులోని పాత్రలు చేయబోతున్నారు. సాధారణ మహిళలు కూడా కొందరు పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
స్ఫూర్తిని కొనసాగించాలి
సమాజంలో చాలామంది మార్చి 8 అంటే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఏదో ఆ ఒక్కరోజు జరిపి చేతులు దులుపుకుంటున్నారు. మహిళకు గిఫ్టులు ఇచ్చి, సన్మానాలు చేసి గొప్పగా ఏదో చేసేశాము అనుకుంటున్నారు. కానీ మహిళ సమస్యలు పరిష్కరించడంలో, వివక్షను రూపుమాపడంలో మాత్రం వెనకబడి పోతున్నారు. నిజమైన మహిళా దినోత్సవ స్ఫూర్తిని కొనసాగించడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించడం లేదు. ముఖ్యంగా మన దేశ పాలకులు మహిళా సమానత్వం కోసం కృషి చేయాల్సింది పోయి తిరిగి మహిళలను నాలుగ్గోడలకు పరిమితం చేయాలని చూస్తున్నారు. మహిళలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా ప్రయోజనం ఉండడం లేదు. అలాగే 33 శాతం రిజర్వేషన్ అని 25 ఏండ్ల నుండి చర్చ జరుగుతూనే ఉంది. కానీ అది ఆచరణ సాధ్యం కాలేదు. పాలకులు గానీ, ప్రజల్లో గానీ దీనిపై ఎలాంటి అవగాహన లేదు. మహిళలకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఈ సమాజం ఇవ్వడం లేదు. అందుకే మహిళల్లో చైతన్యం నింపేందుకు బాలోత్సవ్ షీరోస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
సముచిత స్థానం కల్పించాలి
మహిళకు స్వేచ్ఛ కావాలనే ఉద్దేశంతో మహిళ దినోత్సవం ఏర్పడింది. మహిళ ఇంటి బాధ్యతలతో సమానంగా వృత్తిలో కూడా అదే స్థాయిలో కృషి చేస్తుంది. అన్ని విధాలుగా సమాజంలో భాగం అవుతుంది. నేటి అమ్మాయిలే రేపటి మహిళలు కాబట్టి రేపటి తరాన్ని చైతన్య వంతం చేయాలి. ఆ ఉద్దేశంతోనే మా బాలోత్సవ్ కమిటీ ఈసారి మహిళా దినోత్సవానికి షీరోస్ అనే కార్యక్రమాలు నిర్వహించబోతుంది. పుస్తకంలోని కొంత మంది జీవితాలను తీసుకొని వాటి పాత్రలను చూపించబోతున్నాం. మహిళలకు సమాజం సముచిత స్థానం కల్పించాలి, అనేక రంగాలలో ముందుకు దూసుకుపోతున్న మహిళలను గౌరవించుకోవాలనేదే మా ఉద్దేశం.
– ఇందిరా పరాశరం, బాలోత్సవ్ కల్చరల్ కమిటీ కోఆర్డినేటర్
మహిళలంటే చిన్న చూపు
మహిళలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నా సమాజంలో చిన్న చూపు చూస్తున్నారు. ఆడవాళ్లు బయటకు రాని కాలంలోనే మహిళలు ఎన్నో విజయాలు సాధించారు. కవయిత్రి మొల్ల, ఝాన్సీ లక్ష్మీబారు, రుద్రమదేవి వంటి వాళ్లు ఈ కోవలోకే వస్తారు. అలాంటి వాళ్ల జీవితాను చూసి నేటి తరం స్ఫూర్తిపొందుతారు. అలాగే ఈ మధ్య కాలంలో అమ్మాయిలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. ఈ సమాజంలో మనం ఎలా ఉండాలి అనే విషయం నేటి ఆడపిల్లలకు తెలియడం లేదు. అది తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే ఉమెన్స్ డే రోజు మేము షీరోస్ కార్యక్రమం చేస్తున్నాము.
– మాఢభూషిణి రమణీ సిద్ధి, కమిటీ సభ్యురాలు
తర్వాతి తరాలకు స్ఫూర్తి
మేము మహిళా దినోత్సవం జరుపుతుంటే చాలా మంది బాలోత్సవ్‌కి మహిళలకు సబంధం ఏంటీ అని అనుకుంటున్నారు. పిల్లలు సామాజిక కార్యక్రమాల్లో భాగం పంచుకోవాలంటే ముందు వాళ్ల తల్లులు చైతన్యం కావాలి. అందు కోసమే మేము మహిళా దినోత్సవం సందర్భంగా షీరోస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. షీరోస్ అంటే మహిళా ధీరవనితలు. ఈ పుస్తకంలోని అట్టడుగు స్థాయి నుండి పైకి ఎదిగిన 70 నుండి 80 మంది పాత్రలు ఎంపిక చేశాము. వీళ్ళ జీవితాలు తర్వాతి తరానికి స్ఫూర్తిగా నిలబడతారు. ఉపాధ్యాయులు ఈ పాత్రలు చేస్తే వాళ్ల ద్వారా విద్యార్థులు కూడా స్ఫూర్తి పొందుతారు. అందుకే ఉపాధ్యాయులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాము.
– సుజావతి, బాలోత్సవ్ కమిటీ ఉపాధ్యక్షురాలు
మనలోని ధైర్యాన్ని గుర్తించాలి
నేను టీచర్‌గా వర్క్ చేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా షీరోస్ పుస్తకంలోని కొన్ని పాత్రలు ఎంపిక చేసుకున్నాము. టీచర్స్‌తో పాటు ఆసక్తి ఉన్న మహిళలతో ఈ పాత్రలు వేయించాలనుకున్నాం. దీని వల్ల పాత్రలు చేసిన వారు, అలాగే చూసిన వారు కూడా స్ఫూర్తి పొందే అవకాశం ఉంటుంది. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మహిళల కోసం ఏం చేస్తున్నది అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి మనకు మనమే స్ఫూర్తి పొందాలి. ఆ ఆలోచన నుండే ఈ కార్యక్రమం పుట్టుకొచ్చింది. మహిళ లేనిదే జీవనం లేదు, గమనం లేదు ఈ సృష్టే లేదు. కానీ అలాంటి మహిళ ఈ పురుషాధిక్య సమాజంలో నిత్యం వివక్షకు గురౌతూనే ఉంది. మనకంటూ ఓ రోజు ఉంది. మన హక్కులను, మనలోని ధైర్యాన్ని గుర్తించేలా చేసుకోవాలి. అందుకే ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహిళల్లోని శక్తిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
– అంకమ్మ, బాలోత్సవ్ కమిటీ సభ్యురాలు