ఈ నెల 25 నుండి జూన్ 3 వరకు ఇంటర్  సప్లిమెంటరి పరీక్షలు

– పరీక్షలు సజావుగా నిర్వహించాలి: జిల్లా రెవెన్యూ అధికారి డి.రాజ్యలక్ష్మి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ఈనెల 24 నుండి జూన్ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా రెవెన్యూ అధికారి డి. రాజ్యలక్ష్మి సూచించారు.శుక్రవారం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై డిఆర్ఓ ఛాంబర్ లో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పరీక్షల సందర్భంగా ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను, గట్టి పోలీస్ బందోబస్తు తో పాటు, 144 సెక్షన్ ను విధించాలని పోలీస్ అధికారులను, జవాబు పత్రాలను డి ఆర్ సి  కేంద్రానికి పంపించడంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోస్టల్ అధికారులను, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా ఏఎన్ఎం లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అలాగే ఓఆర్ఎస్ పాకెట్లను సైతం సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఉదయం 8 గంటల నుండి అన్ని పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా తగినన్ని బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను, పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ తో పాటు, జిరాక్స్ కేంద్రాలను మూసి ఉంచేలా ఉత్తర్వులు జారీ చేయాలని రెవెన్యూ అధికారులను,అన్ని పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా నిర్వహించేలా సహకారం అందించాలని కోరారు. కాగా ఈనెల 24 నుండి జూన్ 3 వరకు ఇంటర్మీడియట్  సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనుండగా, మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ సమావేశానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఆర్ దశ్రు, అడిషనల్ ఎస్పి రాములు నాయక్, ట్రాన్స్కో డివిజనల్ ఇంజనీర్ సుధీర్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రఫీ అహ్మద్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్  శంకర్ నాయక్, డిప్యూటీ ఆర్ ఎం మాధవి, ఇతర అధికారులు హాజరయ్యారు.
Spread the love