ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో రుణగ్రహీతలపై భారం
బీఓఎఫ్‌ఏ సెక్యూరిటీస్ రిపోర్ట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది చివరి కల్లా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని బీఓఎఫ్‌ఏ సెక్యూరిటీస్ అంచనా వేసింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగే నేపథ్యంలో 2026 డిసెంబర్ నుంచి మొత్తం 50 బేసిస్ పాయింట్ల (0.5 శాతం శాతం) మేర వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని పేర్కొంది. స్థూల ఆర్థిక వ్యవస్థపై ముప్పులు ఇప్పుడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నుంచి స్థానిక వాతావరణ పరిస్థితుల వైపు మళ్లాయని తెలిపింది. ముఖ్యంగా భవిష్యత్తు ద్రవ్య విధాన నిర్ణయాల్లో వాతావరణ పరిస్థితులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని పేర్కొంది. బీఓఎఫ్‌ఏ రిపోర్ట్ ప్రకారం.. సాధారణం కంటే తక్కువ వర్షపాతం, ఎల్‌నినో ప్రభావంతో ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటంతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మళ్లీ పెరగవచ్చని పేర్కొంది. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి జిడిపి వృద్ధి అంచనాను 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెంచడం విశేషం. ద్రవ్యోల్బణం 4.8 శాతం వద్ద ఉండొచ్చని అంచనా వేసినప్పటికీ.. తక్కువ వర్షాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. వడ్డీ రేట్లు పెరిగితే బ్యాంకులు ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల సమీకరణ వ్యయం పెరిగే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. అయినప్పటికీ రిటైల్ రుణాలు, వాహన రుణాలు, ఎంఎస్‌ఎంఈలకు రుణాల డిమాండ్ పెరగడం వల్ల ఎన్‌బీఎఫ్‌సీల వ్యాపారానికి మద్దతు లభిస్తుందని పేర్కొంది. అయితే రుణ రేట్ల నిర్ణయం, ఆస్తుల నాణ్యత, నిధుల నిర్వహణపై సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని బీఓఎఫ్‌ఏ సెక్యూరిటీస్ సూచించింది.



