Saturday, July 11, 2026
E-PAPER
Homeజాతీయంప్రణాళికలేని పట్టణీకరణ వరదల్లో భారత నగరాలు

ప్రణాళికలేని పట్టణీకరణ వరదల్లో భారత నగరాలు

- Advertisement -

వర్షాన్ని విపత్తుగా మార్చిన అభివృద్ధి మోడల్
కాంక్రీట్‌ ‌జంగిల్‌‌గా పట్టణాలు వర్షపు నీరు భూమిలోకి ఇంకని పరిస్థితి
చెరువులు, కుంటలు, కాలువలు, చిత్తడినేలలు మాయం
పర్యావరణ విధ్వంసం, బలహీన పట్టణ ప్రణాళిక, డ్రయినేజీ వ్యవస్థలే కారణాలు
స్పష్టంగా కనబడుతున్న ప్రభుత్వాల వైఫల్యం

​న్యూఢిల్లీ : ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, గురుగ్రామ్‌.. ఇలా ఏ నగరాన్నీ తీసుకున్నా భారీ వర్షం పడితే రోడ్లు నదులుగా మారడం, వాహనాలు నీటిలో కొట్టుకుపోవడం, గంటల తరబడి ట్రాఫిక్‌, ఇండ్లు, కార్యాలయాలు నీట మునగడం ఇప్పుడు ప్రతి ఏడాదీ కనిపిస్తున్న దృశ్యంగా మారింది. ప్రభుత్వాలు మాత్రం ప్రతిసారి ‘రికార్డు స్థాయి వర్షపాతం’, ‘శతాబ్దంలో ఒకసారి వచ్చే వర్షం’ అంటూ కారణాలు చెప్తున్నా యి. కానీ అసలు సమస్య వర్షం కాదనీ, నగరాలను నిర్మించిన విధానమే ప్రతి వర్షాన్నీ మానవ సృష్టి విపత్తుగా మార్చు తోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వాల వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.

‘రియల్‌’ ‌విస్తరణ.. జలవ్యవస్థలు మాయం
వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా నగరాలన్నీ కాంక్రీటుతో కప్పివేయబడి ఉన్నాయి. దీంతో వర్షపు నీరు నేరుగా రోడ్లపైకి చేరి వరదలుగా మారుతోంది. ప్రకృతిలో నీటిని పీల్చుకునే సామర్థ్యం తగ్గింది. భారత పట్టణాల్లో ఎక్కువగా కనిపించేవి ‘ప్లూవియల్ ఫ్లడ్స్’. అంటే నదులు పొంగకుండానే కురిసిన వర్షపు నీరు నగరాల్లో నిలిచిపోవడం. నగరాల్లో చెరువులు, కాలువలు, పచ్చని ప్రదేశాలు లేకపోవడం, డ్రయినేజీ వ్యవస్థలు విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని నిపుణులు చెప్తున్నారు. ఒకప్పుడు భారత నగరాల్లో చెరువులు, కుంటలు, చిత్తడినేలలు, కాలువలు, వరద మైదానాలు పరస్పరం అనుసంధానమై ఉండేవి. ఇవన్నీ భారీ వర్షం పడినప్పుడు నీటిని నిల్వ చేసేవి. తర్వాత నెమ్మదిగా భూగర్భ జలాల్లోకి చేరేలా చేసేవి. కానీ వేగంగా పెరిగిన రియల్ ఎస్టేట్ అభివృద్ధి పేరుతో ఈ సహజ జలవ్యవస్థలను పూడ్చి భవనాలు, రోడ్లు నిర్మించారు. ఫలితంగా వర్షపు నీటికి నిల్వ ఉండే స్థలం లేకుండా పోయింది.

​దేశవ్యాప్తంగా ఒకే తరహా పరిస్థితి
భారత నగరాల్లో జరిగిన మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. బెంగళూరులో 1973 నుంచి 2010 మధ్య నిర్మాణాలు 632 శాతం పెరిగాయి. కానీ జలవనరులు 79 శాతం తగ్గిపోయాయి. చెన్నైలోని సహజ చిత్తడి నేల పల్లికరణై మార్ష్ 2011 నాటికి తన అసలు విస్తీర్ణంలో కేవలం 12 శాతం మాత్రమే మిగిలింది. ముంబయిలో తీర ప్రాంత చిత్తడినేలలు, మడ అడవులు ఆక్రమించడంతో సముద్రంలోకి నీరు వెళ్లే మార్గాలు తగ్గిపోయాయి. ఇక హైదరాబాద్‌లో చెరువులు, సహజ కాలువల ఆక్రమణ కారణంగా ప్రతి భారీ వర్షంలో నీరు నిలిచిపోతోంది. కాలనీలు మునిగిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. కోల్‌కతాలో తూర్పు తడిబీడులు (వెట్‌‌ల్యాండ్స్‌), చారిత్రక కాలువలపై రియల్ ఎస్టేట్ ఒత్తిడి పెరిగింది. ‌దీనిని బట్టి చూస్తే దేశంలోని ప్రతి నగరంలోనూ ఒకే ఫలితం కనిపిస్తోంది. నేలలోకి ఇంకాల్సిన నీరు కాంక్రీట్‌పై వేగంగా ప్రవహించి వరదలను సృష్టిస్తోంది.

​డ్రయినేజీ వ్యవస్థ ఫెయిల్‌
చాలా నగరాల్లో ఇప్పటికీ బ్రిటిష్ కాలంలో నిర్మించిన డ్రయినేజీ వ్యవస్థలనే ఉపయోగిస్తున్నారు. అప్పటి జనాభాకు సరిపోయేలా నిర్మించిన ఈ కాలువలు నేటి నగరాలకు సరిపోవడం లేదు. సకాలంలో పూడిక తీయకపోవడం, చెత్త, ప్లాస్టిక్, నిర్మా ణ వ్యర్థాలు కాలువల్లో పేరుకుపోవడంతో చిన్నపాటి వర్షానికే మురుగుకాలువలు పొంగిపొర్లి రోడ్లు జలమయమవుతు న్నాయి. ఫలితంగా ప్రజలు అనా రోగ్యాల పాలవుతున్నారు. దీనికి తోడు వాతావరణ మార్పుల కారణంగా తక్కువ సమయంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతోంది.

​పెద్ద డ్రైన్లు మాత్రమే పరిష్కారం కావు
మురుగునీరు కాలువలను వెడల్పు చేయడం, భారీ పంపులు ఏర్పాటు చేయడం మాత్రమే సరిపోవని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘స్పాంజ్ సిటీ’ విధానానికి ప్రాధాన్యం పెరుగుతోంది. అంటే వర్షపు నీటిని సహజ వనరుగా భావించి.. నీరు ఇంకే రహదారులు, పార్కులు, పచ్చని ప్రదేశాలు, చెరువులు, చిత్తడినేలల సంరక్షణ, సహజ జలమార్గాల పునరుద్ధరణ వంటి చర్యల ద్వారా నగరాలు నీటిని నిల్వ చేసి, నెమ్మదిగా విడుదల చేసే విధంగా రూపకల్పన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

​ఈ విధానాలు మారకపోతే కష్టమే
దేశంలో జనాభా ఏటికేడూ పెరిగిపోతోంది. దీంతో రాబోయే దశాబ్దాల్లో భారత నగరాల్లో కోట్లాది మంది కొత్తగా నివసించబోతున్నారు. ఈ నేపథ్యంలో చెరువులు, చిత్తడినేలలు, వరద ప్రాంతాలను రియల్ ఎస్టేట్ కోసం పూడ్చటం వంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలనీ, ప్రకృతితో కలిసి జీవించే నగరాలను నిర్మించాలని ప్రభుత్వాలకు నిపుణులు సూచిస్తున్నారు. పట్టణాల్లో వరదలు ప్రకృతి సృష్టించిన విపత్తులు కావనీ, పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేసిన అభివృద్ధి విధానాలు, బలహీన పట్టణ ప్రణాళిక, పాలనా వైఫల్యాల ఫలితమేనని అంటున్నారు. ఈ విధానాలు మారకపోతే వాతావరణ మార్పుల యుగంలో భారత నగరాలు ప్రతి ఏడాదీ ఇలాంటి వరదలతో మరింత తీవ్రంగా పోరాడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

పాలనలో లోపాలు.. పేద ప్రజలకు శాపం
వరదలు అందరినీ ప్రభావితం చేసినప్పటికీ.. అత్యంత నష్టపోయేది పేద ప్రజలే. అనధికార కాలనీలు, కాలువల పక్కన, తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో నివసించే కుటుంబాలు ప్రతి ఏడాది వరదలతో ఇండ్లు, వస్తువులు, ఉపాధిని కోల్పోతున్నాయి. అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నాయి. ధనిక ప్రాంతాల్లో సేవలు త్వరగా పునరుద్ధరిం చబడు తున్నప్పటికీ.. పేదవారి బస్తీలు మాత్రం చాలా కాలం వరద ప్రభావం నుంచి బయటపడలేకపోతున్నాయి. దీనంతటికి స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభు త్వాల వైఫల్యమే కారణంగా నిపుణులు చెప్తున్నారు. పట్టణ వరదలు సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల సంభవించడం లేదు. మున్సిపల్ కార్పొరేషన్లు, అభివృద్ధి సంస్థలు, జలమం డళ్లు, పబ్లిక్ వర్క్స్ శాఖలు, విపత్తు నిర్వహణ సంస్థలు విడివిడిగా పనిచేస్తుం డడంతో సమన్వయం లోపిస్తోంది. డ్రయినేజీ ప్రణాళికలు ఒకవైపు, నగర విస్తరణ మరోవైపు, పర్యావరణ పరిరక్షణ ఇంకోవైపు సాగుతోంది. చాలా నగరాలు ఫ్లైఓవర్లు, మెట్రోలు, ఎక్స్‌ప్రెస్‌వేలు వంటి ప్రజలకు కనిపించే ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేస్తున్నాయి. కానీ డ్రయినేజీ వ్యవస్థల నిర్వహణ, కాలువలను శుభ్రపరిచే పనులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. చాలా చోట్ల వరదలు వచ్చిన తర్వాతే కాలువలను శుభ్రం చేస్తున్నారు. ఇక చాలా నగరాలలో ఇప్పటికీ ప్రాంతాలవారీగా వరద ప్రమాద మ్యాపులు లేవు. స్థానిక వర్ష పాతం, డ్రయినేజీ నెట్‌వర్క్‌లపై సమగ్ర డిజిటల్ సమాచారం కూడా అందు బాటులో లేదు. దీంతో భవిష్యత్ ప్రమాదా లను ముందుగానే అంచనా వేయడం కష్టమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -