– జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు మాజీ సీఎంలు పోటీ
– ఇండియా ఫోరంలో జమ్మూలో కాంగ్రెస్, కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ
– జమ్మూలో కాంగ్రెస్‌కు పీడీపీ మద్దతు
– కాశ్మీర్ లోయ నుంచి పారిపోయిన బీజేపీ
– ఆర్టికల్ 370 రద్దు తరువాత తొలి ఎన్నికలు
జె.జగదీష్, నవతెలంగాణ
జమ్ముకాశ్మీర్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఆర్టికల్ 370 రద్దు తరువాత జరిగే తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఐదు స్థానాలను ఐదు విడతల్లో నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 19 నుంచి మే 20 వరకు మొదటి ఐదు విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో ఉదంపూర్, రెండో విడతలో జమ్మూ, మూడో విడతలో అనంతనాగ్, నాలుగో విడతలో శ్రీనగర్, ఐదో విడతలో బారాముల్లా ఎన్నికలు జరగనున్నాయి. కాశ్మీర్ లోయలో ఉన్న మూడు స్థానాలకు పోటీ చేస్తున్న పీడీపీ, జమ్మూ, ఉదంపూర్ స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతిస్తుంది.
బరిలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు
జమ్మూకాశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు పోటీ చేస్తున్నారు. అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీపై మరో మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో ఆయన పోటీ నుంచి విరమించుకొని, ఆయన పార్టీ తరపున మహ్మద్ సలీమ్ పర్రేను బరిలోకి దింపారు. బారాముల్లా నుంచి మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బరిలో ఉన్నారు. ఉదంపూర్‌లో బీజేపీ తరపున కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఇండియా ఫోరంలో భాగంగా కాంగ్రెస్ తరపున చౌదర్ లాల్ సింగ్, డెమోక్రటిక్ ప్రోగ్రసీవ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) తరపున జీఎం సరూరి పోటీ చేస్తున్నారు. జమ్మూ నుంచి బీజేపీి తరపున జుగల్ కిషోర్ శర్మ, కాంగ్రెస్ నుంచి రామన్ భల్లాల పోటీ చేస్తున్నారు. అనంతనాగ్ స్థానానికి పీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, డీపీఏపీ నేత మెహబూబా ముఫ్తీ , నేషనల్ కాన్ఫరెన్స్ నేత మియాన్ అల్తాఫ్ అహ్మద్ పోటీ చేస్తున్నారు. అప్నీ పార్టీ తరపున జాఫర్ ఇక్బాల్ మన్హాస్ పోటీ చేస్తున్నారు. శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి పీడీపీ తరపున యూత్ ప్రెసిడెంట్ వహీద్ పారా, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి మాజీ మంత్రి అగా రుహుల్లా పోటీ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఈసారి పోటీ చేయటం లేదు. ఆయన స్థానంలో రుహుల్లా పోటీ చేస్తున్నారు. బారాముల్లా (ఉత్తర కాశ్మీర్) నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తున్నారు. పీడీపీ నుంచి మాజీ రాజ్యసభ సభ్యుడు మీర్ ఫయాజ్ పోటీ చేస్తున్నారు.
పోటీ చేసే పార్టీలు
గత ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్‌లోని ఐదు స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ మూడు, బీజేపీ రెండు స్థానాలను గెలుచుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఇండియా ఫోరంలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో ఐదు, లడఖ్‌లో ఒక ఎంపీ మొత్తం ఆరు ఎంపీ స్థానాల్లో కాశ్మీర్‌లో పరిధిలోని శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేయగా, జమ్మూ పరిధిలోని జమ్మూ, ఉదంపూర్‌లోనూ, కేంద్ర పాలిత ప్రాంతం లఢఖ్‌లోనూ కాంగ్రెస్ పోటీ చేస్తుంది. బీజేపీ, జమ్మూకాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (జేకేపీడీపీ), జమ్మూకాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ (జేకేపీసీ), డెమోక్రటిక్ ప్రోగ్రసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) ఒంటరిగా పోటీ చేస్తున్నాయి.
కాశ్మీర్ నుంచి పారిపోయిన బీజేపీ
370 ఆర్టికల్ రద్దు తరువాత అభివృద్ధి అంటూ డాంభికాలు పలుకుతున్న బీజేపీ కాశ్మీర్‌లో పోటీ నుంచి తప్పుకుంది. కాశ్మీర్ పరిధిలోని శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదు. దీనిపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆర్టికల్ 370 రద్దు ప్రభావం ఉంటే బీజేపీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. కాశ్మీర్ మొత్తాన్ని బహిరంగ జైలుగా మార్చారని, ఎన్నికలు ప్రకటించినప్పటి నుండి యువకులను అరెస్టు చేసే ప్రక్రియ ప్రారంభించారని మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.
జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హౌదా
జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హౌదా ఇవ్వాలనేదే అక్కడి ప్రజల ప్రధాన డిమాండ్. అలాగే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కూడా డిమాండ్ ఉంది. ఆర్టికల్ 370 రద్దు తరువాత ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పులు రాలేదు. కాకపోతే ప్రజలు అభద్రతా భావంలో ఉన్నారు. అక్కడ యాపిల్ పండించే రైతుల సమస్యలను పట్టించుకునే నాధుడే లేరు. దీంతో యాపిల్ రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గతంలో కేంద్ర హౌం మంత్రి అమిత్ షా కూడా సరైనా సమయంలో రాష్ట్ర హౌదా ఇస్తామని ప్రకటించారు. ఇటీవల ప్రధాని మోడీ కూడా త్వరలోనే జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హౌదా ఇస్తామని ప్రకటించారు. అయితే కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్న బీజేపీ నేతల మాటలపై ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. అయితే 370 ఆర్టికల్ రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్ జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికలు జరిగాయి. ప్రతిపక్ష పార్టీల గుప్కార్ కూటమి విజయం సాధించింది.
మొత్తం ఓట్లు : 86.93 లక్షలు
పురుషులు : 44.35 లక్షలు
మహిళలు : 42.58 లక్షలు
లోక్‌సభ స్థానాలు : 5
పోలింగ్ జరిగే దశలు : 5