ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ హెచ్చరిక
వాషింగ్టన్ నిర్ణయాన్ని ప్రభావితం చేసేందుకేనని అనుమానాలు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ఇరాన్ ఇటీవల కొత్తగా కుట్ర పన్నిందని ఇజ్రాయిల్ నిఘా వ్యవస్థ వాషింగ్టన్‌కు తెలియజేసింది. ఇరాన్ – అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అనిశ్చితిలో పడిన నేపథ్యంలో ఈ సమాచారం మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం… ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ నుంచి ఈ వారంలోనే హెచ్చరిక సందేశం వచ్చింది. ట్రంప్‌ను ఎలా హతమార్చాలన్న విషయంపై ఇరాన్ రూపొందిస్తున్న ప్రణాళికలకు సంబంధించిన సమాచారం అమెరికాకు గత కొన్ని వారాలుగా నిరంతరం అందుతూనే ఉంది. అయితే ఇజ్రాయిల్ నుంచి వచ్చిన హెచ్చరిక తాజాది. ఇది ఓ నిర్దిష్ట కుట్రకు సంబంధించింది.
నివేదికపై అనుమానాలు
ఇరాన్‌పై సైనిక చర్యను తీవ్రతరం చేయాలా వద్దా అనే విషయంపై ట్రంప్ ఆలోచిస్తున్న తరుణంలో ఆయన నిర్ణయాన్ని ప్రభావితం చేసేందుకే ఇజ్రాయిల్ ఈ నివేదికను అందించి ఉండవచ్చునని అమెరికా అధికారులు కొందరు అనుమానిస్తున్నారు. ఇజ్రాయిల్ బయటపెట్టిన కుట్రకు సంబంధించిన వివరాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇరాన్ ప్రయత్నాలను ట్రంప్ తొలుత పెద్దగా పట్టించుకోలేదు. వాటిపై నిఘా కూడా పెట్టలేదు. అయితే 2020లో ట్రంప్ ఆదేశాల మేరకు జరిగిన డ్రోన్ దాడిలో ఇరాన్ అగ్రశ్రేణి జనరల్ ఖాసిమ్ సోలైమనీ మరణించినందుకు ప్రతీకారంగా ట్రంప్‌ను చంపడానికి టెహ్రాన్ ప్రయత్నించవచ్చునని అమెరికా ప్రభుత్వం అనుమానించింది. తనను చంపాలని భావిస్తున్న ఇరాన్‌పై ట్రంప్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలను అధ్యక్షభవనం ప్రస్తావించింది. ‘వారు అమెరికా నేతను…అంటే నన్ను అంతం చేయాలని అనుకుంటున్నారు’ అని ట్రంప్ చెప్పారు. తాను ఇరాన్ హిట్‌లిస్టులో ఉన్నానని తెలిపారు. తన హత్యే లక్ష్యంగా ఇరాన్ రూపొందించిన ఓ జాబితా గురించి ఇటీవలే తనకు తెలిసిందని అన్నారు. అయితే ఆ సమాచారం ఎలా వచ్చిందనేది వెల్లడించలేదు. అయితే ట్రంప్ నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ఇజ్రాయిల్ ఈ నివేదికను తెర పైకి తెచ్చిందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. అమెరికా నిఘా వర్గాల్లో కొందరు ఇజ్రాయిల్ నివేదికలను ఎప్పుడూ అనుమానంగా చూస్తూనే ఉంటారు. ఇరాన్‌తో దౌత్యం కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ బహిరంగంగానే నిప్పులు చెరుగుతున్నారు. లెబనాన్‌లో సైనిక చర్య విషయంలో ఆయన ట్రంప్‌తో విభేదించారు.
దౌత్యం వైపే మొగ్గు ?
ఇరాన్ మాజీ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన అశేష ప్రజానీకం ట్రంప్‌కు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఇటీవలి కాలంలో ఉద్రిక్తతలు పెరిగాయి. దాడులు, ప్రతి దాడులతో మధ్యప్రాచ్యం మార్మోగిపోతోంది. పలువురు మాజీ, ప్రస్తుత ఉన్నతాధికారులను ఇరాన్ లక్ష్యంగా చేసుకోబోతోందని అమెరికా నిఘా వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇరాన్‌తో చర్చలకు తలుపులు మూసుకు పోయాయని ట్రంప్ చెబుతున్నప్పటికీ తెర వెనుక దౌత్యయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. వచ్చే నెల మధ్య నాటికి ఓ ఒప్పందం కుదిర్చేలా ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవసరమైతే గురువారం రాత్రి కూడా దాడులు చేసేందుకు సన్నాహాలు జరిగాయని, అయితే దౌత్యానికి ప్రాధాన్యత ఇస్తూ వాటిని నిలిపివేశారని తెలుస్తోంది.


