Saturday, July 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌‌ స్వరం మారినా..

ట్రంప్‌‌ స్వరం మారినా..

- Advertisement -

కప్పిపుచ్చలేని నాటో కూటమి విభేదాలు : జిన్హువా
ఇస్తాంబుల్‌ : నాటో సదస్సు ప్రారంభానికి ముందుగా నాటో దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రంగా విమర్శలు చేసిన అధ్యక్షుడు ట్రంప్‌ ‌బుధవారం సదస్సు ముగిసే సమయానికి నాటో దేశాల ఐక్యతను ప్రశంసించారు. సదస్సు విజయవంతమైందంటూ మిత్ర దేశాల మధ్య ఐక్యత గురించి గొప్పగా చెప్పారు. అయితే ట్రంప్‌ ‌వైఖరి మారినంత మాత్రాన నాటో కూటమిలోని సభ్య దేశాల మధ్య నెలకొన్న విభేదాలను కప్పిపుచ్చలేవు అని ప్రముఖ మీడియా సంస్థ జిన్హువా వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది. దాని సారాంశం.. ఇరాన్‌పై సాగుతున్న యుద్ధ సమయంలో హర్మూజ్‌‌ను తిరిగి తెరిపించడానికి అమెరికాకు మద్దతుగా యుద్ధ నౌకలను పంపేందుకు యురోపియన్‌ ‌ప్రభుత్వాలు తిరస్కరించాయి. ఈ పరిస్థితిపై ట్రంప్‌‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కూటమి భద్రతా ప్రాధాన్యతలు, బల ప్రయోగంపై గల విభేదాలు బట్టబయలయ్యాయి. ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌‌లపై సదస్సులో తీవ్రంగా ఆగ్రహించిన ట్రంప్‌ ‌స్పెయిన్‌‌తో వాణిజ్య సంబంధాలు వుండవంటూ తెగతెంపులు చేసుకున్నారు. నాటో సభ్య దేశాలు రక్షణ వ్యయం పెంచాలంటూ ఒత్తిడిని కూడా పెంచుతూ వచ్చారు. ఈ తరుణంలో ట్రంప్‌‌ను ప్రసన్నం చేసుకునేందుకు పలు యూరప్‌ ‌దేశాలు కోట్లాది డాలర్ల విలువ చేసే సైనిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. చివరగా సమావేశం ముగిసేనాటికి 50 బిలియన్ల డాలర్లుకు పైగా విలువ చేసే కొత్త మిలటరీ ఒప్పందాలు ఖరారయ్యాయి. వీటిలో పలు ఒప్పందాలు అమెరికా రక్షణ తయారీ సంస్థలకు లబ్ది చేకూర్చేవే. యూరప్‌ ‌దేశాల నుండి పెరిగిన రక్షణ వ్యయం, ఫలితంగా తమ దేశానికి కలిగిన ఆర్థిక ప్రయోజనాలతో సంతుష్టుడైన ట్రంప్‌ తన స్వరాన్ని మార్చి నాటోను పొగడ్తల్లో ముంచెత్తారు. అంత మాత్రాన వారి మధ్య గల రాజకీయ విభేదాలన్నీ సమసిపోయినట్లు కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రక్షణ రంగ వ్యయాలను పెంచడం వల్ల అనేక యూరప్‌ ‌దేశాలు స్వదేశాల్లో తీవ్ర నిరసనలను, అసమ్మతిని ఎదుర్కొంటున్నాయి. ప్రజా సంక్షేమ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలంటూ టర్కీలో, ఇతర యూరప్‌ ‌దేశాల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.
నాటో సదస్సు అంతిమంగా సమైక్యతను ప్రదర్శించినట్లు బయటకు కనిపిస్తున్నప్పటికీ అమెరికా నేతృత్వంలోని సైనిక జోక్యాలు, భారాల పంపిణీ, యూరప్‌ ‌దేశాల వ్యూహాత్మక ప్రాధాన్యతలపై అంతర్లీనంగా గల విభేదాలు ఇవన్నీ పరిష్కారం కాకుండానే మిగిలిపోయాయని నిపుణులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -