– ప్రభుత్వ అనుమతి లేకుండా కన్సల్టెంట్ల నియామకం
– గతంలో ఎప్పుడూ లేని విధంగా చైర్మెన్‌కు ఓఎస్డీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉన్నత విద్యామండలిలో ఇష్టారాజ్యంగా కన్సల్టెంట్ల నియామకాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎలాంటి నియామకాలు చేపట్టడానికి వీల్లేదు. కానీ ఉన్నత విద్యామండలి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ఇష్టానుసారంగా కన్సల్టెంట్లను నియమి స్తోంది. ఉన్నత విద్యామండలిలో ఎప్పుడూ లేని విధంగా చైర్మెన్‌కు ఓఎస్డీని నియమించడం గమనార్హం. ఈ నిర్ణయం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, విశ్వవిద్యాలయాల వీసీలకు ఓఎస్డీలు ఉంటారు. కానీ ఉన్నత విద్యామండలి నూతన చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి మాత్రం ఓ ప్రయివేటు విశ్వవిద్యాలయంలో పనిచేసే వ్యక్తిని ఓఎస్డీగా నియమించుకోవడం విమర్శలకు తావిస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యామండలి చైర్మెన్, ఇద్దరు వైస్ చైర్మెన్లు, కార్యదర్శి పనిచేసే వారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కూడా చైర్మెన్, ఇద్దరు వైస్ చైర్మెన్లు, కార్యదర్శితో ఉన్నత విద్యామండలి కొనసాగుతున్నది. గతంలో ఎప్పుడూ లేని విధంగా చైర్మెన్, వైస్ చైర్మెన్లు, కార్యదర్శికి మధ్య ఓఎస్డీని నియమించడం పట్ల పలు అనుమానాలకు తావిస్తున్నది. అందులోనూ ఓఎస్డీ జీతం కూడా విశ్వ విద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఇచ్చే వేతనాన్నే నిర్ణయించినట్టు తెలిసింది. అంటే సుమారు రూ. లక్ష వరకు ఇచ్చే అవకాశమున్నట్టు సమాచారం. పరిశోధన కోసం ఒక కన్సల్టెంట్, పరిశ్రమలతో సమన్వయం కోసం మరో కన్సల్టెంట్‌ను నియమించారు. మరో ఇద్దరు కన్సల్టెంట్లను నియమించే అవకాశమున్నట్టు తెలిసింది. కన్సల్టెంట్ల జీతం రూ.55 వేలు నిర్ణయించినట్టు సమాచారం.
ప్రభుత్వ ఉద్యోగులను నియమించకుండా…
ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ (ఎస్‌సీఈఆర్టీ), తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) వంటి ప్రభుత్వ సంస్థల్లో సర్కారు ఉద్యోగులను డిప్యూటేషన్ కింద నియమిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులనే ఓఎస్డీలుగా నియామకం చేస్తారు. కానీ ఉన్నత విద్యామండలిలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులను నియమించకుండా ప్రయివేటు విశ్వవిద్యాలయంలో పని చేసే వారిని ఓఎస్డీగా నియమించడం విమర్శలకు తావిస్తోంది. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా బుర్రా వెంకటేశం ఉన్నపుడు ఎన్‌ఎస్‌ఎస్ రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా ఓ మహిళను ఉన్నత విద్యామండలిలో కన్సల్టెంట్‌గా నియమించారు. ఆమెకూ నెలకు రూ.55 వేల వేతనం ఇస్తున్నారు. ఉన్నత విద్యామండలికి ఎన్‌ఎస్‌ఎస్‌కు సంబంధమే లేదనీ, ఆ పోస్టు అవసరం లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. కళాశాల విద్యాశాఖ, ఇంటర్ విద్యాశాఖ, పాఠశాల విద్యాశాఖ, విశ్వవిద్యాలయాల్లో కన్సల్టెంట్‌గా ఉండి పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులకు ఎన్‌ఎస్‌ఎస్‌పై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ర్యాగింగ్‌కు పాల్పడడం, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించాలి. కానీ విద్యార్థులతో నేరుగా సంబంధం లేని ఉన్నత విద్యామండలిలో ఎన్‌ఎస్‌ఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ నియామకం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే ఆమె డ్రగ్స్ నివారణ, బ్యాడ్ టచ్, గుడ్ టచ్, అమ్మాయిల భద్రత వంటి అంశాలపై కాలేజీలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు చెప్పారు. అయితే ఆమె ఉన్నత విద్యామండలికి ప్రతిరోజూ రావడం లేదనీ, నెలకు రెండూ మూడు సార్లు మాత్రమే వస్తున్నట్టు మరొకరు వివరించారు. అవసరం లేని పోస్టులో ఆమెను నియమించడంపై విమర్శలొస్తున్నాయి.