గాజా: గాజాకు అందించే మానవతా సహాయాన్ని కూడా అక్కడి ప్రజలకు చేరకుండా వివిధ రూపాల్లో ఇజ్రాయిల్ అడ్డుకుంటోందని జో బైడెన్ పాలనా యంత్రాంగం ఆరోపిస్తోంది. నిజానికి ఈ విమర్శ అత్యంత అరుదైనదిగా భావించవచ్చు. ఇజ్రాయిలీ వైమానిక దాడుల్లో పాలస్తీనా పోలీసులు చనిపోవటంతో సహాయ సామాగ్రిని తీసుకువచ్చే వాహనాలకు రక్షణ కరువైందని, అవి క్రిమినల్ గుంపుల పాలవుతున్నాయని మానవతా సమస్యల పైన మధ్యప్రాచ్చంలో ప్రత్యేక దౌత్యవేత్తగా వ్యవహరిస్తున్న డేవిడ్ షట్టర్‌ఫీల్డ్ అన్నాడు. ఇదే కాకుండా సరిహద్దు దాటి గాజాలోకి ప్రవేసిస్తున్నప్పుడు ఇజ్రాయిలీలు చేస్తున్న నిరసనలు కూడా గాజా ప్రజలకు సహాయాన్ని అందించటానికి అడ్డంకిగా ఉన్నాయి.
ఇటీవల కాలంలో ఇజ్రాయిల్ పాలస్తీనా పోలీస్ ఉద్యోగుల పైన, వాహనాలకు భద్రతను అందించే మిలిటరీ కమాండర్ పైన కూడా దాడులు చేయటంవలన గాజా ప్రజలకు సహాయాన్ని అందించే ఐక్యరాజ్య సమితి, ఇతర సంస్థలు తమతమ సహాయ కార్యక్రమాలను నిర్వహించటంలో ఇబ్బందుల్లో పడుతున్నాయని షట్టర్‌ఫీల్డ్ తన విచారాన్ని వెలిబుచ్చాడు. ఇప్పటికే గాజాలో ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో 35వేల మంది పాలస్తీనా ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. కనీసం ఒక లక్ష మంది గాయపడ్డారు. ఇజ్రాయిల్, హమస్ యుద్ధం పర్యవసానంగా గాజాలో నివసిస్తున్న ప్రజల్లో 85శాతం మంది స్థానభ్రంశం చెందారు. దాదాపు ఆరు లక్షల మంది ఆహారం అందక అలమటిస్తున్నారు.
సహాయ సామాగ్రిని తెచ్చే వాహనాలను దారి మరల్చి హమస్ మిలిటెంట్లు తమ అవసరాలకు వాడుకుంటున్నారని ఇజ్రాయిల్ చేస్తున్న విమర్శకు సాక్ష్యం ఏమీ లేదని ఐక్యరాజ్య సమితి ఏజన్సీలతోపాటు షట్టర్‌ఫీల్డ్ కూడా అన్నాడు. ఇజ్రాయిల్ బాంబు దాడలవల్ల గాజాలో నివసిస్తున్న 14లక్షలమంది పాలస్తీనా ప్రజలు కాందిశీకులుగా మారి అత్యంత ఘోరమైన పరిస్థితులలో దక్షిణ సరిహద్దులోని రఫా నగరంలో నివసిస్తున్నారు. రఫా నగర జనాభా మూడు లక్షలకు లోపే ఉంటుంది. దీనినిబట్టి కాందిశీకులుగా మారిన గాజా ప్రజలు ఎటువంటి జీవన పరిస్థితులలో జీవిస్తున్నారో ఊహించుకోవచ్చు.