నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్ దాడుల వల్ల గడచిన 24 గంటల్లో లెబనాన్‌లో ఇద్దరు వైద్య సిబ్బందితో సహా 51 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇజ్రాయిల్ సైన్యం అంతర్జాతీయ చట్టాలు, మానవతా ప్రమాణాలను ఉల్లంఘిస్తూనే ఉంది. పారామెడిక్స్‌పై మరిన్ని నేరాలకు పాల్పడుతోంది. బింట్ జ్బెయిల్ జిల్లాలోని ఖలావియా, టిబ్నిన్‌లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని రెండుసార్లు దాడులకు పాల్పడగా… ఈ దాడుల్లో ఇద్దరు వైద్య సిబ్బంది మృతి చెందారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
కాగా, లెబనాన్- ఇజ్రాయిల్ మధ్య మూడు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా వెల్లడించింది. ఇది మూడో వారం. అయినప్పటికీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయిల్ లెబనాన్‌పై దాడులకు పాల్పడుతూనే ఉంది. ఈ ఏడాది మార్చి 2న ప్రారంభమైన ఇజ్రాయిల్ దాడుల వల్ల ఇప్పటివరకు 2,846 మంది మృతి చెందారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మార్చి నుంచి ఇప్పటివరకు ఇజ్రాయిల్ 130కి పైగా దాడులు జరిపింది. ఈ దాడుల్లో 103 మంది మెడికల్ వర్కర్క్స్ చనిపోయారు. 230 మంది గాయాలపాలయ్యారని ఐక్యరాజ్య సమితి తెలిపింది.
“మేము ప్రతి క్షణం, ప్రతి రోజూ ఇజ్రాయిల్ ముప్పును ఎదుర్కొంటున్నాము” అని దక్షిణ లెబనాన్‌లోని టైర్‌లో ఉన్న లెబనీస్ సివిల్ డిఫెన్స్ అధిపతి అలీ సఫియుద్దీన్ మీడియాకు వెల్లడించారు. మేము ఈ దాడుల వల్ల బ్రతుకుతామా లేక చనిపోతామా అని మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటాం. కానీ ఇక్కడ పని చేయడం ద్వారా మా జీవితాలను ఇప్పటికే కోల్పోయామని మాకు తెలుసు. మేము ఎంతో మందిని కోల్పోయాము. మేము కూడా ఇకలేనట్లే అనిపిస్తోది అని అలీ తెలిపారు.



