అమెరికా ఆమోదంతో రఫాలో ఇజ్రాయిల్‌ మానవ హననం

Israeli human rights violations in Rafah with US approval– నెల్లూరు నరసింహారావు
గాజాకు దక్షిణాగ్రంలోవున్న రఫా నగరంపై ఇటీవల ఇజ్రాయిల్‌ పెద్ద ఎత్తున వైమానిక దాడులను ప్రారంభించింది. ఈ దాడుల్లో 100మందికిపైగా పాలస్తీనా ప్రజలు మృతిచెందారు. సోమవారం నాడు తెల్లవారగానే చెల్లాచెదురైన పసిపిల్లల దేహాలకు సంబంధించి హృదయ విదారకమైన దృశ్యాలను చూచిన ప్రపంచం నివ్వెరపోయింది. రానున్న రోజుల్లో మరోసారి ఇజ్రాయిల్‌ నరమేధం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.
రఫా నగరంమీద పూర్తి స్థాయి యుద్ధం చేయనున్నామని గత వారాంతంలో ఇజ్రాయిలీ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. గాజా భూ భాగంలో నివసించే ప్రజల్లో సగానికి పైగా అంటే 10లక్షల మందికి పైగా రఫా నగరంలో అత్యంత దుర్భర పరిస్థితుల్లో తలదాచుకుంటున్నారు. అక్కడ వారు నివసిస్తున్న చిరిగిపోయిన టెంట్లలో మంచినీటి సదుపాయంగానీ, కనీస ఆహారం అందుబాటులో ఉండటంగానీ, మురుగునీటి వ్యవస్థగానీ లేవు. ఇజ్రాయిల్‌ బాంబుదాడుల్లో ఆస్పత్రులు నేలమట్టం అవటంతో రోగాలు ప్రబలుతున్నాయి. కరువు తాండవిస్తున్నది. ప్రపంచంలో ఆకలికి అలమటించే ప్రతి ఐదుగురిలో నలుగురు గాజాలో నివసిస్తున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. రఫాపైన జరుగుతున్న దాడితో గాజాలో సంభవించే మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. గత నాలుగు నెలలుగా ఇజ్రాయిల్‌ చేస్తున్న క్రూర వైమానిక బాంబు దాడులలో ఇప్పటికే 35000మందికి పైగా పాలస్తీనా ప్రజలు చనిపోయారు.
రఫాలో జరుగుతున్న మానవ హననం అమెరికా అధ్యక్షుడి అనుమతి తీసుకున్నాకే మొదలైంది. పాలస్తీనా ప్రజలపైన దాడులు ఆపాలి అన్న బైడెన్‌ తన మాటను మార్చి అవి ‘ఒక పథకం’ ప్రకారం సాగాలని చెబుతున్నారు. ఇజ్రాయిలీ ప్రజల భద్రత కోసం పాలస్తీనా ప్రజలను చంపటం అవసరం అన్నట్టుగా ఉంది అమెరికా వైఖరి. అమెరికా, ఇజ్రాయిల్‌ రూపొందించిన ‘పథకం’ ప్రకారం 15క్యాంపు ప్రదేశాలనుంచి 25,000 టెంట్లలో నివసించే ప్రజలను రఫా నుంచి తరలించాలనే ప్రయత్నం జరుగుతున్నట్టు ఒక ఈజిప్ట్‌ అధికారి చెప్పాడని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ రాసింది. ఈ టెంట్‌ నగరాలకు అమెరికా, మధ్యప్రాచ్చంలోని దాని మిత్ర దేశాలు నిధులను సమకూరుస్తాయి. వీటి నిర్మాణం ఈజిప్ట్‌ నియంత ఎల్‌ – సీసీ నేతృత్వంలో సాగుతుంది.
ఈ విషయాన్ని మరోవిధంగా చెప్పాలంటే అమెరికా ప్రత్యక్ష ప్రమేయంతోను, నిధులతోను ఆకలితో అలమటించే, ఆరోగ్యం సరిగాలేని, నిస్సత్తువ ఆవహించిన 10 లక్షల మంది ప్రజలను ఎడారికి ఆవల టెంట్ల నగరాల్లో కుక్కనున్నారు. రఫా నుంచి ప్రజలను తరలించే పనిలో తాము పాల్గొనబోమని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ అంటోనియో గుటర్రెస్‌ అధికార ప్రతినిధి స్టిఫానే డుజర్రిక్‌ చెప్పింది. ఇలా రఫాలో తలదాచుకుంటున్న పాలస్తీనా ప్రజలను బలవంతంగా తరలించే కిరాతక చర్యలో అమెరికా భాగస్వామిగా ఉంది. గత 48గంటలుగా జరుగుతున్న ఘటనలను చూశాక అమెరికా సామ్రాజ్యవాదం గాజా మానవ హననంలో ప్రత్యక్షంగా పాలుపంచుకుంటోందని ఎవరికైనా తెలుస్తుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆమోదంలేకుండా ఇజ్రాయిల్‌ ఏ పనీ చేయటం లేదు. గాజాలో ఇజ్రాయిల్‌ చేస్తున్న మానవ హననానికి కావలసిన నిధులను, ఆయుధాలను అమెరికా సరఫరా చేస్తోంది.
గాజాలో జరుగుతున్న మానవ హననానికి బైడెన్‌ ఇస్తున్న షరతులులేని మద్దతువల్ల అమెరికాలో ఆయనకున్న ప్రజామోదం బాగా క్షీణించింది. అమెరికా ఇజ్రాయిల్‌కు ఇస్తున్న మద్దతు అత్యంత హేయంగా ఉందని ఉప జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ ఫైనర్‌ గతవారం అరబ్‌ అమెరికన్‌ రాజకీయ నాయకులతో మిచిగన్‌లోని డియర్‌బోర్న్‌లో జరిగిన సమావేశంలో చెప్పాడని గతవారం న్యూయార్క్‌ టైమ్స్‌ రాసింది. పాలస్తీనా ప్రజల ప్రాణాలకు అమెరికా అధ్యక్షుడు, ఆయన పాలనా యంత్రాంగం అసలేమాత్రం విలువ ఇవ్వటంలేదని కూడా ఆయన చెప్పాడని టైమ్స్‌ రాసింది. ఇజ్రాయిల్‌ గాజాలో నివసిస్తున్న పాలస్తీనా ప్రజలను జంతువులతో పోలుస్తుంటే అమెరికన్‌ అధికారులు నోరు మెదపటం లేదని కూడా ఫైనర్‌ చెప్పాడు. అయితే బైడెన్‌ చర్యల ప్రభావం ఫైనర్‌ చెప్పినదానికంటే చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు ఐరోపాలోని అమెరికా కూటమి దేశాలు ఇజ్రాయిల్‌ను విమర్శిస్తున్నట్టుగా నటిస్తూనే ఆర్థిక సహాయం చేస్తూ గాజాలో ఇజ్రాయిల్‌ పాల్పడుతున్న మానవ హననానికి తమ మద్దతును కొనసాగిస్తున్నాయి.
అమెరికా మధ్య ప్రాచ్చ వ్యూహంలో గాజాలో ఇజ్రాయిల్‌ చేస్తున్న మానవ హననం ఒక ప్రధాన అంశంగా ఉంది. ఇప్పటికే ఇరాక్‌, సిరియా, యెమెన్‌ల మీద అమెరికా వైమానిక దాడులు చేసింది. ఈ పరిస్థితి అమెరికా ఇరాన్‌తో ప్రత్యక్షంగా తలపడటానికి దారితీసేలా ఉంది. ఆధిపత్యం కోసం చైనా, రష్యాలపైన అమెరికా చేస్తున్న పోరులో ఇరాన్‌తో ఘర్షణకు దిగటం కూడా ఒక భాగం. ప్రపంచంపై అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి ఈ దశాబ్దం ”నిర్ణయాత్మక దశాబ్దం” అవుతుందని బైడెన్‌ పాలన పేర్కొంటోంది. ప్రపంచం పైన అమెరికా ఆధిపత్యాన్ని చెలాయించటానికి, మారకపు మీడియంగా డాలర్‌ను నిలబెట్టటానికి అమెరికా సామ్రాజ్యవాదం యుద్ధాన్ని ప్రధాన సాధనంగా ఎంచుకుంటోంది. గాజాలో పాలస్తీనా ప్రజల పైన జరుగుతున్న మానవ హననం అమెరికా సామ్రాజ్యవాదం క్రూరచర్యల పర్యవసానం ఎలావుంటుందో మానవాళికి అర్థమయ్యేలా చేస్తోంది. గత నాలుగు నెలలుగా పాలస్తీనా ప్రజలపైన నిర్విరామంగా జరుగుతున్న అమానుష దాడులను ఐక్యరాజ్య సమితి ఖండిస్తున్నప్పటికీ, ఆ దాడులను ఆపలేని దాని నిష్క్రియాపరత్వం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అది సామ్రాజ్యవాద దేశాల ఆధీనంలో పనిచేస్తున్న విషయం కూడా సుస్పష్టమే.

Spread the love