– నిర్బంధం నుంచి తెలంగాణకు స్వేచ్ఛ…
– ఇన్నాళ్లుగా ఎన్నిసార్లు వెళ్లినా కేసీఆర్‌ను కలవలేకపోయా
– పది రోజుల్లో రేవంత్‌రెడ్డిని నాలుగుసార్లు కలిశాను
– భవిష్యత్‌లోనూ ఇదే తరహా పాలన కొనసాగాలి
– అవినీతి, అక్రమాలపై విచారణ జరపాల్సిందే : మండలిలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘ఇది ప్రజాస్వామ్యం… రాచరికం కాదు’అని శాసనమండలిలో స్వతంత్ర సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు. మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం ఆయన మాట్లాడుతూ నిర్బంధం నుంచి తెలంగాణకు స్వేచ్ఛావాయువులు వచ్చాయంటూ ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. తాను ఆర్టీసీ బస్సు, మెట్రోలో ప్రయాణిస్తాననీ, ప్రజల మాటలను గమనిస్తానని అన్నారు. తన ప్రసంగంలో దాశరథి పాట, కాళోజీ, రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్రహం లింకన్ మాటలను ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. ఈ పది రోజుల్లో కాంగ్రెస్ పాలనలో ఉన్న స్వేచ్ఛ చివరి రోజుల వరకు కొనసాగాలని ఆకాంక్షించారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళల స్వతంత్రతకు, స్వేచ్ఛగా సంపాదించే హక్కుకు దోహదపడుతుందని చెప్పారు. అయితే ఆర్టీసీకి ప్రతినెలా ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ చేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం అభినందనీయమని అన్నారు. ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపర్చాలనీ, పీహెచ్‌సీలు, యూహెచ్‌సీలు, సీహెచ్‌సీలను పటిష్టం చేయాలని కోరారు. కౌలు రైతులకూ రైతుబంధు వర్తింపచేస్తామనే హామీ ఇవ్వడాన్ని అభినందించారు. ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. అసైన్డ్ భూములను కబ్జా చేసిన వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. ప్రతిపక్షం, పాలకపక్షం అని కాకుండా అందరం ప్రజలపక్షం ఉండాలని చెప్పారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలు వాడడం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ను అరికట్టాలని డిమాండ్ చేశారు. అన్ని శాఖలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితి, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయడం అభినందనీయమన్నారు. గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు నాలుగుసార్లు ప్రగతి భవన్‌కు వెళ్లినా కలవలేదని చెప్పారు. 160 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా కలిసే సమయం లేదా?అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. అపాయింట్‌మెంట్ కావాలని 30 సార్లు లేఖ రాశాననీ, చివరికి శాసనమండలి చైర్మెన్ దృష్టికి కూడా తెచ్చానని గుర్తు చేశారు. అయినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. ఇది ప్రజాస్వామ్యం, రాచరికం కాదన్నారు. కానీ ఈ పది రోజుల్లోనే సీఎం రేవంత్‌రెడ్డిని నాలుగు సార్లు కలిశానని అన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను తేవాలని కోరారు. రాష్ట్రంలో మిగిలిన కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని చెప్పారు. ప్రభుత్వ బడుల బాగుకోసం చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామపంచాయతీలు, మున్సిపల్ కార్మికులతో పాఠశాలల పరిశుభ్రత పనులకు స్వస్తి పలకాలనీ, స్వచ్ఛ కార్మికులను నియమించాలని కోరారు. విద్యార్థులు ప్రయివేటు బడులకు ఎందుకు వెళ్తున్నారో పరిశీలించాలని చెప్పారు. హైదరాబాద్‌లో 80 శాతం, మేడ్చల్‌లో 82 శాతం, సంగారెడ్డిలో 72 శాతం మంది పిల్లలు ప్రయివేటు బడుల్లో చదువుతున్నారని వివరించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన యోధులను స్మరిస్తూ గవర్నర్ ప్రసంగాన్ని బలపరుస్తున్నానని చెప్పారు.