అక్రమాలు వెలుగులోకి రావడం హర్షణీయం

అక్రమాలు వెలుగులోకి రావడం హర్షణీయం– ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
గత ప్రభుత్వం చేసిన అక్రమాలెన్నో తాజాగా వెలుగులోకి రావడం హర్షణీయమని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత ప్రభుత్వ పాలన సమైక్యాంధ్ర పాలన కంటే అధ్వాన్నంగా సాగిందన్నారు. రాష్ట్ర అప్పు ఆరు లక్షల కోట్లకు దాటిందని తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక, నిర్మాణ లోపాలు ఉన్నట్టు కేంద్ర జలశక్తి శాఖనే చెప్పిందని వివరించారు. ఆ ప్రాజెక్టుకు అనుమతి కూడా లేదనీ, లక్షా 20 వేల కోట్ల ఆర్థిక భారం పడిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో అన్ని రకాలుగా కేసీఆర్‌ బాధ్యుడని ఆరోపించారు. ఆ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి కూడా లేదని కేంద్రం చెబుతున్నదని గుర్తు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు అక్రమాలపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. బాధ్యలైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై వాస్తవాలను ప్రభుత్వం వెలికి తీయడంపై హర్షం వ్యక్తం చేశారు. వాస్తవాలను ప్రజలకు తెలియ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం ఉన్నందున తుమ్మడి హట్టి దగ్గర బ్యారేజ్‌ నిర్మాణం చేయాలని కోరారు. అక్కడ బ్యారేజ్‌ని నిర్మించాలని చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణాన్ని సోనియా గాంధీ పుట్టిన రోజు నుంచి అమలుకు నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు.

Spread the love