- హైడ్రా కమిషనర్ రంగనాథ్
నవతెలంగాణ-హైదరాబాద్: ఎంఐఎం అయినా, అధికార కాంగ్రెస్ అయినా మాకు ఒకటే. ఫాతిమా కాలేజీ లాంటి విద్యాసంస్థలు భాగ్యనగరంలో చాలా ఉన్నాయి. చట్టం అందరికీ సమానమే. హైడ్రా ఎప్పుడూ సైలెంట్‌గా ఉండదు. అలాగని రాత్రికి రాత్రి వచ్చి ఇళ్లను కూల్చేస్తుందనేది అవాస్తవం” అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన హైడ్రా యాక్షన్ ప్లాన్, ఇప్పటివరకు సాధించిన విజయాలపై పక్కా లెక్కలతో క్లారిటీ ఇచ్చారు.
హైడ్రా కేవలం కూల్చివేతలకే పరిమితం కాలేదని, ఇప్పటివరకు సిటీలో దాదాపు 600 ఆపరేషన్స్ పూర్తి చేసి, ఆక్రమణదారుల గుప్పిట్లో ఉన్న సుమారు లక్షా పదివేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను, చెరువులను, పార్కులను కాపాడామని రంగనాథ్ వెల్లడించారు. అలాంటిది కొందరు పనిగట్టుకుని తమ సంస్థను బద్నాం చేయడానికి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలం అయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆక్రమణల వల్లే నాలాలు పూడిపోయి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. “లక్ష మంది ప్రజలకు మంచి చేయాలన్నప్పుడు.. కొంతమంది ఆక్రమణదారులకు చెడు జరగక తప్పదు. ఒకవేళ హైడ్రా వైపు ఏమైనా తప్పు ఉంటే క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధమే. తప్పులు జరిగితే సరిదిద్దుకుంటూ ముందుకెళతాం. హైడ్రా పొలిటికల్ సెటిల్‌మెంట్లకు అడ్డాగా మాత్రం మారదు” అని తేల్చిచెప్పారు.



