ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్. గతంలో స్వేచ్ఛాయుతంగా, సమయానికి ఎన్నికలు సక్రమంగా జరిగేవి. రాను రానూ ఎన్నికల వ్యవస్థ ఒక తంతుగా మారి నవ్వుల పాలైంది. ఈవీఎంల ట్యాంపరింగ్ నుంచి మొదలుకుంటే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజ కీయ పార్టీలకు అందుతున్న విరాళాలు, దానిమీద పార్లమెంట్ ఎన్నికల ముందు రేగిన దుమారం, ఓటుకు నోటు, ఎన్నికల వేళ పంచుతున్న డబ్బులు, పాలకవర్గాలు చేస్తున్న అధికార దుర్వినియోగం అంతా ఇంతా కాదు. పైగా కులం, మతం, దేవుడు, ప్రాంతం, భాష అంశాలతో ప్రజలను మభ్య పెట్టడం, విద్వేషాలు రెచ్చగొట్టడం మామూలై పోయింది. ఇలా అన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా పతనమైపోయాయి. వామ పక్షాలొక్కటే ప్రజలకు సరైన దారిదీపంగా వెలుగొందుతున్నాయి. అయితే సరైన ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయాలను గుర్తించని ప్రజలు కార్పొ రేట్ శక్తులకు కొమ్ముకాసే పార్టీలనే మారుస్తూ ఎన్ను కుంటూ వస్తున్నాయి. కానీ, రేపటి రోజుల్లో దాని క్కూడా అవకాశం లేకుండా ఏకఛత్రాధిపత్య పాలన సాగే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి నియంతృ త్వ విధానాలకు అడ్డుకట్ట వేయలేమా?
నేడు దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. దేశంలో ప్రతిపక్షమే లేకుండా చేసే వ్యవస్థను సృష్టించటం కోసం బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నది. ఇందుకు తాజా ఉదాహరణే జమిలీ ఎన్నికలు. కిందపడ్డా నాదే పై చేయి అన్నట్టుగా ఉంది మోడీ ప్రభుత్వ తీరు. ఏకపక్ష, నిరంకుశ విధానాలు ఇక చెల్లవంటూ 2019 గెలిచిన 303 స్థానాల నుంచి 63 స్థానాలు కోతపెట్టి 240 స్థానాలకు పరిమితం చేసినా, ప్రాంతీయ పార్టీలపై ఆధార పడి ప్రభుత్వం ఏర్పాటు చేసినా పాలనా పరమైన నిరంకుశ విధానాలు ఈ పార్టీ అనుసరిస్తూనే ఉంది. ప్రజల మౌలిక అవసరాలైన ధరలు, పేదరికం, నిరుద్యోగం, నాణ్యమైన విద్య, వైద్యం అందించే విషయంలో ఏంచేయకుండా ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు మిగిల్చింది. ఈ ప్రజల ప్రధాన సమస్యల నుంచి పక్కదారి పట్టించటానికి జిమ్మిక్కులు, ఎత్తులు వేయడం చేస్తూనే ఉంది. భిన్న సంస్కృతులు, బహుళత్వం గల ఈ దేశంలో ఒకే మతం, ఒకే రకమైన పన్ను, ఒకే రకమైన తిండి తినాలని, ఒకే భాష (హిందీ) ఉండాలని మొత్తం ప్రజల సంస్కృతిపైనే దాడిచేస్తోంది. ఇప్పుడు ఆచరణా సాధ్యం కాని, అవసరం లేని ఒకే దేశం, ఒకే ఎన్నిక అంటూ జమిలీ ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ వేయడం, ఆ కమిటీ కొద్దికాలంలోనే ‘బాగా కష్టపడి’ 18వేల పేజీల నివేదిక సమర్పించడం, దీనికి కేబినేట్ ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయాయి.
దేశంలో 47రాజకీయ పార్టీలలో 32 పార్టీలు జమిలీ ఎన్నికలకు అనుకూలత తెలిపాయని, 21వేల సూచనలు అందాయని, అందులో 81శాతం మంది జమిలీ ఎన్నికలను సమర్ధించాయని కమిటీ చెబుతున్నది. దేశంలో ఉన్న ఓటర్ల సంఖ్యతో పోలిస్తే ఈ సూచనలు చేసిన 21వేల మంది అభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఉంటుందో కమిటీయే చెప్పాలి. ఏడు దేశాల్లో జమిలీ ఎన్నికల గురించి ఆధ్యయనం చేశామని చెప్పింది. తొలిదశలో లోక్‌సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరిపి, రెండో దశలో పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు వంద రోజుల వ్యవధిలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పింది. ఈ జమిలీ ఎన్నికల అమలుకు కనీసం ఆరు రాజ్యాంగ సవరణలు చేయ వలసి ఉంటుందని చెప్పింది. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయడంతో పాటు, లోకసభ, రాజ్యసభ కాలపరిమితిని నిర్ణయించే 83వ ఆర్టికల్, రాష్ట్రాల శాసనసభల కాలపరిమితి నిర్ణయించే 172వ ఆర్టికల్, ఎన్నికల సంఘం అధికారులకు సంబంధించిన 324వ ఆర్టికల్, స్థానిక పంచాయతీరాజ్‌కు సంబంధించిన ఆర్టికల్స్ 243 కె, 243జెడ్, ఏలను కూడా సవరించాలని సూచించింది. ఈ రాజ్యాంగ సవరణలు జరగాలంటే లోక్‌సభ, రాజ్యసభలలో రెండు బై మూడోవంతు మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉభయ సభల్లో బీజేపీకి ఉన్నబలం సరిపోదు. స్థానిక సంస్థల రాజ్యాంగ సవరణలకు సగం రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాల్సి ఉంటుంది. ఇదంతా సాధ్యమయ్యే పనేనా?
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అంటే 1952, 1957, 1962లలో జమిలీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు కేంద్ర, రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కొనసాగింది. 1967 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది రాష్ట్రాలలో ఓటమి చెందింది. తదుపరి చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. 1989 నుంచి 2014 వరకు కేంద్రంలో, రాష్ట్రాలలో ప్రస్తుతం ఇప్పుడు కూడా సంకీర్ణ (కూటమి) ప్రభుత్వాలు నడుస్తున్నాయి. దేశంలోని భిన్న సంస్కృతులు, చారిత్రక పరిస్థితుల రిత్యా బహుళ పార్టీలు మనుగడలో ఉన్నాయి. ఈ తరుణంలో జమిలీ ఎన్నికలు ఆచరణలో సాధ్యం కాదు. గతంలో 1989, 1996, 1998లలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడి కీచులాడుకుని ముందే రద్దయ్యాయి. జమిలీ ఎన్నికల వ్యవస్థలో దీనికి సమాధానం లేదు. ఎన్నికల తదనంతరం లోక్‌సభ, శాసనసభలు ముందే రద్దయితే పరిస్థితి ఏమిటి? రాజ్యాంగంలో 83వ ఆర్టికల్ లోక్‌సభ, 172వ ఆర్టికల్ శాసనసభలు ముందే రద్దు కావటానికి అవకాశమిచ్చాయి కదా? ఏదైనా జమిలీ ఎన్నికల ప్రక్రియ మొత్తం రాజ్యాంగ సమఖ్య స్పూర్తికి పూర్తి విరుద్ధంగా ఉంది. రాజ్యాంగంలో ఒకటవ నిబంధన భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్‌గా పేర్కొంది. కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా బలంగా సమఖ్య స్ఫూర్తితో మెలగాలని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సూచించారు. ఈ జమిలీ ఎన్నికల ద్వారా బీజేపీ సమాఖ్య విధానాన్ని దెబ్బకొట్టి ఏకపార్టీ (బీజేపీ) నియంతృత్వం కోసం పాకులాడుతోంది. అన్ని రాష్ట్రాలలో బీజేపీ మాత్రమే అధికారంలో ఉండాలని కలలు కంటూ నిరంకుశ పోకడలు పోతున్నది. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని పథకం పన్నుతున్నది.
ఆది నుంచి బీజీపీ మాతృసంస్థ ఆరెస్సెస్ ప్రజాస్వామిక, లౌకిక విలువలకు, రాజ్యాంగానికి విరుద్ధంగా నడుస్తున్నది. దీని పుట్టుకలోనే ఆ స్వభావం ఉంది. 1947 ఆగస్టులో త్రివర్ణ జాతీయ జెండాను గౌరవించబోమని ఆరెస్సెస్ ప్రకటించింది. నాగపూర్‌లోని తమ కేంద్ర కార్యాలయంపై 2002 వరకు జాతీయ జెండాను కూడా ఎగురవేయలేదు. ఇప్పుడు ఈ ‘అపరదేశభక్తులే’ మొన్న ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగ’ అంటూ ప్రతి ఇంటిపై జాతీయజెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అలాగే 1949 నవంబర్‌లో మనుస్మృతి తప్పితే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అంగీకరించమని ప్రకటించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటిస్తూనేవున్నారు. ఇలా చాపకింద నీరులా భిన్నత్వంలో ఏకత్వంగా కలిసిమెలిసి ఉండే ప్రజల్ని మొత్తంగా హిందూ దేశంగా విభజించాలని చూస్తున్నారు. ఏదైనా ప్రజలేచరిత్ర నిర్మాతలు. వీరి నియంతృత్వ విధానాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రగతిశీల, లౌకికవాద శక్తులు, ప్రజలపై ఉంది. ఈ ఆగడాలపై పౌరసమాజంలో చర్చ జరగాలి. వీరి నిరంకు శతత్వాన్ని తిప్పికొట్టాలి. రాజ్యాంగాన్ని, లౌకిక ప్రజాస్వామ్య విలువలను రక్షించుకోవాలి.
షేక్ కరిముల్లా
9705450705