జయహో..ప్రజ్ఞానంద…

– చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతం
చెన్నై: అజర్‌ బైజాన్‌లో జరిగిన ఫిడే ప్రపంచకప్‌ రన్నరప్‌గా నిలిచిన 18ఏళ్ల ప్రజ్ఞానందకు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. తమిళనాడు ప్రభుత్వ అధికారులు, కళాకారులు, విద్యార్థులు, అభిమానులు పూలు చల్లుతూ, అభినందనలు తెలుపుతూ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞానందను చూసేందుకు అభిమానులు, మీడియా సభ్యులు అత్యధిక సంఖ్యలో విచ్చేశారు. అలాగే ప్రజ్ఞానందకు స్వీట్లు, బొకేలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. తనను ఆహ్వానించడానికి ఇంతమంది రావడం చాలా సంతోషంగా ఉందని, ఇది నిజంగా నమ్మశక్యం కావడం లేదన్నాడు. క్రికెట్‌ స్టార్లకు మాత్రమే ఇంతటి గౌరవం దక్కుతుందని, తనకు ఆ విధమైన ప్రశంసలు, అభిమానులు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. తాను పాల్గొనే ప్రతి టోర్నమెంట్‌కు తన తల్లి నాగలక్ష్మి హాజరయ్యేదని, ఎక్కడ బసచేసినా భోజనాన్ని తయారుచేసే బాధ్యతను ఆమె తీసుకొనేదని అన్నాడు. జర్మనీలోని డ్యూసెల్‌డార్ఫ్‌లో జరిగిన ఫిడే ప్రపంచ ర్యాపిడ్‌ టీమ్‌ ఛాంపియన్‌కు, అజర్‌బైజాన్‌లోని బాకు వేదికగా జరిగిన ప్రపంచకప్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లకు ఆమె చేతి వంట సాంబారు అన్నం మాత్రమే తిన్నానని అన్నాడు.
ర్యాంకింగ్స్‌లోనూ పైపైకి..
ప్రపంచకప్‌ చెస్‌ రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద కెరీర్‌లోనే అత్యధిక రేటింగ్స్‌ సాధించాడు. రన్నరప్‌గా నిలవడంతో 2727.2 పాయింట్లు సొంతం చేసుకున్నాడు. అంతేకాదు లైవ్‌ రేటింగ్స్‌లో టాప్‌ 20 ర్యాంక్‌లో నిలిచాడు. టైటిల్‌ నెగ్గిన కార్ల్‌సన్‌ టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ప్రజ్ఞానంద భారత సీనియర్‌ గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌, చదరంగం లెజెండ్‌ గ్యారీ కాస్పరోవ్‌ల నుండి ప్రశంసలు పొందాడు. ట్విటర్‌ వేదికగా కాస్పరోవ్‌ ‘కష్టమైన ఎత్తులతో ప్రత్యర్ధి ముందు దృఢంగా ఉంటాడు’ అని పేర్కొన్నాడు.
తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రశంసలు..
రూ.30 లక్షల చెక్కు అందజేత
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ప్రజ్ఞానంద తన కుటుంబసభ్యులతో కలిసి కలిశాడు. ఈ సందర్భంగా స్టాలిన్‌ ప్రజ్ఞానందను ప్రశంసలతో ముంచెత్తారు. తమిళనాడుతోపాటు యావత్‌ దేశం గర్వించేలా గొప్ప ప్రదర్శన కనబర్చావంటూ కొనియాడారు. అలాగే ప్రోత్సాహకంగా రూ.30 లక్షల చెక్కును అందించి మెమెంటోను బహుకరించారు. తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడాశాఖ ఉదయనిధి స్టాలిన్‌ కూడా ప్రజ్ఞానందను శాలువాతో సత్కరించారు.

Spread the love