విమానంలో కుదుపులు..భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు

నవతెలంగాణ – హైదరాబాద్: ఇటీవలి కాలంలో ఎయిర్ టర్బులెన్స్ (విమానంలో కుదుపులు) ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా ఓ ప్రయాణిస్తోన్న విమానంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ కుదుపుల తీవ్రతకు కొందరు సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో 30 మందికి పైగా గాయపడ్డట్లు సమాచారం. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. విమానయాన సంస్థ ఎయిర్‌ యురోపాకు చెందిన బోయింగ్‌ 787-9 విమానం 325 మంది ప్రయాణికులతో స్పెయిన్‌ నుంచి ఉరుగ్వేకు బయల్దేరింది. ఆ సమయంలో ఒక్కసారిగా కుదుపులకు లోనయింది. ప్రయాణికులు ఎగిరిపడటమే గాకుండా సీలింగ్ ప్యానెల్, సీట్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీనిపై ఎయిర్ యురోపా సంస్థ స్పందించింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపింది. మార్గమధ్యలో ఉండగా కుదుపుల గురించి కెప్టెన్ సీట్‌బెల్ట్‌ బిగించి పెట్టుకోవాలని సూచించారు. సీట్‌బెల్ట్‌ సరిగా పెట్టుకోనివారు గాల్లోకి ఎగిరిపడ్డారని వివరించారు. అయితే ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసినట్లు విమానయాన సంస్థ వెల్లడించింది.

Spread the love