జర్నలిస్టుల ఇండ్లస్థలాల

– విషయమై క్యాబినెట్‌లో చర్చించాలి
– సర్కారుకు టీడబ్ల్యూజేఎఫ్‌ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌
హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్నీ జిల్లాల్లో జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇచ్చే విషయమై ఈనెల 31న జరిగే రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో చర్చించి సమస్యను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌)రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. గత 40 ఏండ్లుగా జర్నలిస్టులు ఇండ్లస్థలాల కోసం ఎదురుచూస్తున్నారని గుర్తు చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రి కేటీఆర్‌ సైతం ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరారు. రాష్ట్ర రాజధాని హైదరా బాద్‌తోపాటు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లోని అర్హులైన జర్నలిస్టుందరికీ ఇండ్లస్థలాలు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కొత్త విధానం ప్రకటించాలని సూచించారు. అసెంబ్లీలో సీఎం ఇచ్చిన హామీని వెంటనే అమలుచేయాలని అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కానుక ఇండ్లస్థలాలే అవుతాయని అభిప్రాయపడ్డారు. వెంటనే ఆమేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Spread the love