– తన భర్త, మాజీ సీఎం హేమంత్ అరెస్ట్‌తో అనూహ్యంగా పొలిటికల్ ఎంట్రీ
– గాండే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ
– అక్రమ కేసులపై బీజేపీ, మోడీకి పదునైన విమర్శనాస్త్రాలు
జె.జగదీష్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్ (48) లోక్‌సభ ఎన్నికల వేళ అనూహ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఉన్నత విద్యావంతురాలైన కల్పన, బీజేపీకి, ప్రధాని మోడీకి సంధిస్తున్న ప్రశ్నలు, హెచ్చరికలు జార్ఖండ్‌నే కాదు యావత్ జాతినే ఆలోచింపజేస్తున్నాయి. కచ్చితంగా జార్ఖండ్ రాజకీయాల్లో కల్పన మార్క్ కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తన భర్త హేమంత్ సోరెన్‌ను అక్రమంగా జైలుకు పంపిన తరువాత కల్పన ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చారు. తన భర్త ఆశయాలను, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకే రాజకీయాల్లోకొచ్చానంటున్నారు. గాండే అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు జేఎంఎం అభ్యర్థిగా కల్పన సోరెన్ నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఈ స్థానానికి కూడా మే 20న పోలింగ్ జరగనుంది. జెఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా చేయడంతో గిరిది జిల్లాలోని గాండే స్థానం ఖాళీ అయింది. ఎంటెక్, ఎంబీఏ వంటి ఉన్నత విద్యను పూర్తి చేసిన కల్పన మొన్నటి వరకు గృహిణిగా ఉన్నారు. ఒడిషాలోని మయూర్‌భంజ్ జిల్లాలో బరిపడలో పాఠశాల విద్యను పూర్తి చేసి, భువనేశ్వర్‌లో ఇంజనీరింగ్, ఎంబిఎ డిగ్రీలను పొందారు.
హేమంత్ లేని లోటు పూడ్చేందుకే..
‘నా భర్త అరెస్ట్ ఊహించని విధంగా జరిగింది. ఈ ఘటనతో జేఎంఎం పార్టీ, కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. హేమంత్ అరెస్టు తరువాత పార్టీ కార్యకర్తలు ముందుకు రావాలని కోరారు. వాళ్ల నాయకుడిపై ఉన్న ప్రేమ చూసి, హేమంత్ జీ తిరిగి వచ్చే వరకు ఈ లోటును పూడ్చడం నా నైతిక బాధ్యత అని అనుకున్నాను. అందుకే నేను రాజకీయాల్లోకి ప్రవేశించాను. వంగి నమస్కరించడం గిరిజనుల డీఎన్‌ఏలో లేదు. హేమంత్ సోరెన్ మరింత బలపడతారు. హేమంత్ సోరెన్ అమాయకుడు, నిర్దోషి. బీజేపీ ప్రభుత్వం ముందస్తుగా ప్లాన్ చేసిన కుట్రలో బాధితుడయ్యారు. బీజేపీపై జార్ఖండ్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలోని అపార ఖనిజ సంపదను దోచుకుంటున్న ఈ నిరంకుశ, కార్పొరేట్ శక్తులను వారు నిర్మూలిస్తారు” అని కల్పన అన్నారు.
ఎన్‌డీఏలో చేరనందుకే అరెస్ట్
”న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన బెయిల్‌పై బయటకు వచ్చి లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఎదురుచూస్తున్నాం.
పేదలు, గిరిజనులు, దళితుల కోసం పనిచేసే ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తే రాజ్యాంగం ఎలా పరిరక్షించబడుతుంది. బీజేపీ అబద్ధాలు మాత్రమే చెబుతుంది. నా భర్త 90 రోజులకు పైగా జైలులో ఉన్నారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో మాత్రమే ఈడీ ఎందుకు చర్యలు తీసుకుంటుందో నాకు ఒక ప్రశ్న ఉంది” అని కల్పన అన్నారు. ”నేను అన్యాయానికి, నియంతత్వ శక్తులకు వ్యతిరేకిని. నేను నా భర్త అడుగుజాడల్లో నడుస్తాను. ఆయన తన విలువలతో రాజీ పడలేదు. బదులుగా జైలు మార్గాన్ని ఎంచుకున్నారు. నా భర్త అరెస్టు రాజకీయ ప్రేరేపితం. మమ్మల్ని బిజెపి కూటమిలో చేరమని బలవంతం చేశారు. అందుకు నిరాకరించడంతో ఆయనను కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేసింది” అని కల్పన సోరెన్ విమర్శించారు.
ఆది నుంచీ కమలం కుట్రలు
2019లో హేమంత్ సోరెన్ నేతృత్వంలో జార్ఖండ్‌లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ కుట్ర పన్నింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో మార్చి 4న జరిగిన జెఎంఎం 51వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో కల్పన రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. తన భర్త జైలుకు వెళ్లిన తరువాత పార్టీకి కొత్త ముఖంగా అవతరించిన కల్పన.. బీజేపీని నిరంకుశ శక్తిగా అభివర్ణిస్తూ.. ప్రతిపక్షాలను అణిచివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు ఎప్పుడూ తను ఎంచుకోలేదని, పరిస్థితులు తనను వాటిల్లోకి నెట్టాయని అన్నారు.