నవతెలంగాణ-ఆమనగల్ :
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాన్గుల దశరథం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈమేరకు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు లాల్జి దేశాయ్ ద్వారా తనకు ఉత్తర్వులు అందినట్టు దశరథం తెలిపారు. తలకొండపల్లి మండలం వెంకట్ రావుపేట్ గ్రామానికి చెందిన కాన్గుల దశరథం ఓటు హక్కు కల్గిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ వివిధ రూపాల్లో పార్టీ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తూ కల్వకుర్తి నియోజకవర్గంతో పాటు జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. పార్టీకి ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన అధిష్టానం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శిగా నియమించింది. ఈసందర్భంగా సోమవారం ఆమనగల్ పట్టణంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో స్థానిక సీనియర్ నాయకులతో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు డాక్టర్ చల్లా వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు దశరథంను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకంతో రాష్ట్రస్థాయి పదవి అప్పగించిన పార్టీ అధిష్టానంతో పాటు, అందుకు సహకరించిన ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చల్లా వంశీచంద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మరింత బాధ్యతతో వ్రవహరిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.