నా రాజీనామాతో మునుగోడు అభివృద్ధి చెందింది.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

– ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవ్వని నిధులు.. నా రాజీనామా ద్వారా 600 కోట్లు నిధులు వచ్చాయి
– దండు మల్కాపురం భూములను జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దొంగ పత్రాలు సృష్టించి కాజేయాలని చూశారు
– బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిమయమైందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధ్వజం
– తూప్రాన్ పేట నుండి ప్రారంభమైనా రాజగోపాల్ రెడ్డి ప్రచారం
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట నుండి మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవ్వని నిధులు నా రాజీనామా అస్త్రాన్ని  సంధిస్తే 600 కోట్లుతో మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. దండు మల్కాపురం గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కులో గ్రామ అవసరాల కోసం 150 ఎకరాలు తీస్తే ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆక్రమించుకున్నారని మండిపడ్డారు. నా రాజీనామా ద్వారా మునుగోడు ఉప ఎన్నిక దేశ చరిత్రలో నిలిచిపోయిందని ఆయన అన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను 12 మందిని కేసీఆర్ కొన్నాడని అన్నారు. కానీ నేను కెసిఆర్ కు అమ్ముడుపోయానా…? అని  రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ ను విమర్శించారు. బీజేపీ వాళ్లయితే కేసీఆర్ అవినీతిని బయటకు తీస్తాం ఆయనను జైల్లో పెడతాం అంటేనే నేను బీజేపీ పార్టీలోకి వెళ్లానని ఆయన చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని తెలిసి మళ్ళీ సొంత గూటికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని ఆయన అన్నారు. దండు మల్కాపురంలో భూములను జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కాజేయాలని కుట్రపన్నారని ఆయన అన్నారు. ఇద్దరు దొంగలు కలిసి మా పేరు మీద మార్పిడి చేయలేదని జిల్లా కలెక్టర్ ను ఆర్డిఓ, తాహాసిల్దార్ లను బదిలీ చేయించారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ భూములన్ని మునుగోడు నియోజకవర్గంలో పేద ప్రజలకు పంచుతానని ఆయన అన్నారు.2012లో నా సొంత నిధులతో పిలాయిపల్లి కాల్వ పనులు చేయించానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 80 సీట్లతో అధికారంలోకి రాబోతుంది అధికారంలోకి వచ్చాక ఇక్కడి పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కాలుష్యకారక పరిశ్రమలను మునుగోడు నియోజకవర్గం నుంచి పంపివేస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 6 గ్యారెంటీ పథకాలను 90 రోజుల్లో అమలు చేస్తామని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని కోరారు. చేతి గుర్తుపై ఓటు వేసి మరొకసారి మునుగోడును రాష్ట్ర చరిత్రలో నిలపాలని రాజగోపాల్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మండల అధ్యక్షులు బోయ దేవేందర్, Cpi మండల కార్యదర్శి పల్లె శేఖర్ రెడ్డి, పట్టణ కార్యదర్శి మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పబ్బు రాజుగౌడ్, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love