కవితతో కేటీఆర్‌ ములాఖాత్‌

KTR Mulakat with Kavitha– రెండు నెలల తర్వాత తీహార్‌ జైల్లో చెల్లిని కలిసిన అన్న
– ధైర్యంగా ఉండాలని సూచన
– కవితను కలిసిన మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్టై తీహార్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ ములాఖాత్‌ అయ్యారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఆయన తీహార్‌ జైలుకు చేరుకున్నారు. అనంతరం జైలు నిబంధనల ప్రకారం దాదాపు 20 నిమిషాల పాటు కవితతో ముచ్చటించారు. ఈ సందర్భంగా న్యాయపర అంశాలపై చర్చించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనో ధైర్యం వీడొద్దని, తాము తోడుగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఇప్పటికే హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ అయినందున, ఆ తీర్పు ప్రతికూలంగా వస్తే చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అయితే ఈ సందర్భంగా కవిత పూర్తి ధీమాగా కన్పించారని తెలిసింది. ధైర్యంగా ఉన్నానని, తన గురించి ఆందోళన వద్దని చెప్పినట్టు సమాచారం. అయితే ఈ అక్రమ కేసును ఎదుర్కొనే దిశలో న్యాయ సలహాలు, సూచనలు అందించాలని అన్న కేటీఆర్‌ను కోరినట్లు తెలిసింది.
రెండు నెలల తర్వాత..
దాదాపు రెండు నెలల తర్వాత కేటీఆర్‌ కవితను కలిశారు. ఏప్రిల్‌ 14 న చివరిసారి బావ అనిల్‌తో కలిసి ములాఖాత్‌ అయ్యారు. అంతకు 21 రోజులకు ముందు (మార్చి 21) చివరిసారి తల్లి శోభరావు, కవిత ఆడపడుచు సౌమ్య (సంతోష్‌ సోదరి)తో వెళ్లి కలిసారు. మార్చి 15 న కవితను ఈడీ అరెస్ట్‌ చేసిన తర్వాత … కేటీఆర్‌, హరీశ్‌రావులు హుటాహుటిన ఢిల్లీ వచ్చారు. ఈడీ కస్టడీలో మొదటి ఐదు రోజులు కేటీఆర్‌ కవితను కలిసి మనోధైర్యం నింపారు. న్యాయపరంగా ఈ కేసును ఎదుర్కోవడంలో పూర్తి మద్దతుని చ్చారు. తీహార్‌ జైలుకు వెళ్లిన తర్వాత కవితను కలవడం ఇదే తొలిసారి.
మార్చి 15న సోదాల పేరుతో హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి ఈడీ అధికారులు వెళ్లి అరెస్ట్‌ చేశారు. అదే రోజు రాత్రి ఢిల్లీకి తరలించారు. మార్చి 15న రౌస్‌ ఎవెన్యూ కోర్టులో హాజరుపరుచగా, ఈడీ కస్టడీకి అనుమతించింది. ఇలా రెండు దఫాలుగా ఈడీ కస్టడీని పొడగిం చిన కోర్టు, మార్చి 26న జ్యూడీషియల్‌ కస్టడీ విధిందించింది. దీంతో ఆమెను పోలీసులు తీహార్‌ జైలుకు తరలించారు. జ్యూడీషియల్‌ కస్టడీలో ఉండగానే, ఏప్రిల్‌ 11న తీహార్‌ జైల్‌లోనే సీబీఐ ఆమెను అదుపులోకి తీసుకుంది.

Spread the love