నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహ రాజకీయానికి నిరసనగా మంగళవారం బీఆర్‌ఎస్ పలు శాంతియుత నిరసన కార్యక్రమాలు చేయనున్నట్టు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ తల్లి పేరు చెప్పి కాంగ్రెస్ తల్లి పేరుతో ఈ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలతో పాటు పంచామృత అభిషేకాలు చేస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ చరిత్ర తెలియదని తెలంగాణ తల్లిని వేడుకుందాం… క్షమించమని అడుగుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమ కారుడు, బీఆర్‌ఎస్ కార్యకర్త ప్రతి ఒక్కరు తమ వాట్సప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ తల్లి చిత్రాన్ని ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకోవాలని సూచించారు.