ఉద్యమ నాయకుడు కేకే ను మోసం చేసి టికెట్ తీసుకున్న కేటీఆర్

– కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్
నవతెలంగాణ – సిరిసిల్ల
అడ్డదారులకు కేరాఫ్ బిఆర్ఎస్ పార్టీయేనని, ఉద్యమ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి ని మోసం చేసి కేటీఆర్ టికెట్ తీసుకున్నాడని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ అన్నారు. బుదవారం ఆయన సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో చొప్పదండి ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం కలిసి పోటీ చేద్దామని హామీ ఇచ్చి, కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కెసిఆర్ మోసం చేసి అడ్డదారిలో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. సమగ్ర కుటుంబ సర్వే పేరిట చేసిన సర్వే రిపోర్ట్ 10 ఏళ్లుగా కేసీఆర్ బయట పెట్టలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణనపై విమర్శలు చేసే హక్కు బిఆర్ఎస్ నేతలకు లేదని సూచించారు. పదేళ్లలో అప్పుల కుప్పగా తయారైన తెలంగాణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శనంలో అభివృద్ధి, సంక్షేమం వైపు పరుగులు పెడుతుందని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు పోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, నేతలపై మాట్లాడే నైతిక హక్కు బిఆర్ఎస్ నేతలకు లేదని, ఇకపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో  ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి చందన, నాయకులు రాగులజగన్, నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్, భీమారపు శ్రీనివాస్, చేన్నమనేని కమలాకర్ రావు, గుండ్లపల్లి గౌతమ్, గడ్డం కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love