నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వేల ఏండ్లుగా దేశంలో కొనసాగుతున్న అన్ని రకాల ఆధిపత్యాలను అంతం చేయడమే భారత సామాజిక ఉద్యమ పితామహుడు పెరియార్ రామస్వామికి అర్పించే నిజమైన నివాళి అని పలువురు వక్తలు తెలిపారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద పెరియార్ రామస్వామి నాయకర్ 50వ వర్ధంతి సభను నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి ఎస్వీకే ట్రస్ట్ కార్యదర్శి ఎస్ వినయకుమార్, టీపీఎస్‌కే రాష్ట్ర కన్వీనర్ జి రాములు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు అధ్యక్షతన జరిగిన సభలో పలువురు ప్రజాసంఘాల రాష్ట్ర నాయకులు మాట్లాడారు. పెరియార్ స్ఫూర్తితోనే భౌతిక వాద దృక్పథం దక్షిణ భారతదేశమంతటా వ్యాపించిందన్నారు. విగ్రహారాధన, దేవుడు, మూఢనమ్మకాలు, బ్రాహ్మణాధిపత్యంపై ఆనాడే ఆయన తిరుగుబాటు బావుట ఎగరేశారని గుర్తు చేశారు. వేదాలను బ్రాహ్మణిజాన్ని ప్రశ్నించడం ద్వారా ప్రజలు చైతన్యవంతులు కావాలనీ, ప్రతి దాన్ని పాదార్థికంగా పరిశీలించటం నేర్చుకోవాలని సూచించారన్నారు. రష్యాకెళ్లొచీ, అక్కడి కమ్యూనిజం భావాజాలాన్ని వంటపట్టించుకున్నారని వివరించారు. ప్రశ్నించడం నేరమైతే ఆ నేరాన్ని పదేపదే చేస్తానని ఆయన చెప్పడంగొప్ప విషయమని గుర్తుచేశారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌క, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేష్, టీపీటీఎల్‌ఎఫ్‌్ రాష్ట్ర కార్యదర్శి ఐత విజరు, సోషల్ మీడియా ఇంచార్జి జగదీష్, టీపీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, టీటెన్‌సీఈవో సుందర్,కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్ బాల పీరు తదితరులు పాల్గొన్నారు.
పెరియార్ స్ఫూర్తితో సామాజికోద్యమాలు : కేవీపీఎస్
2:53 am