జమ్ము : రెండు రోజులుగా కురుస్తన్న వర్షాల కారణంగా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై వివిధ ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. కాశ్మీర్‌ను మిగిలిన భారత దేశంతో ఈ జాతీయ రహదారే అనుసంధానం చేస్తుంది. రాంబాన్ జిల్లాలోని కిస్తావరి పథేర్, మామ్ పాసి, గుంగ్రూ, మెహార్ వంటి ప్రాంతాల్లో రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఆదివారం నుంచి నిరంతరాయంగా వర్షాలు కురుస్తుండటంతో పునరుద్దరణ, సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. శిథిలాలను తొలగించే వరకూ జాతీయ రహదారిపై ప్రయాణించవద్దని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు.అలాగే, పూంచ్, రాజౌరి జిల్లాలను షోపియాన్ జిల్లాతో అనుసంధానం చేసే ప్రత్యామ్నాయ మార్గమైన మొఘల్ రహదారిని కూడా వరసగా మూడో రోజైన సోమవారం కూడా అధికారులు మూసివేశారు. నిరంతర వర్షాల కారణంగా కిష్త్వార్ జిల్లాలో సోమవారం పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఆదివారం వర్షాల కారణంగా నైగాడ్ నీటి సరఫరా పైపులకు నష్టం కలగడంతో కిష్త్వార్ పట్టణానికి మంచి నీటి సరఫరా నిలిచిపోయింది. నీటి సరఫరా పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు చెప్పారు. జిల్లాలోని బాషా-సింబూల్ గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డంతో రెండు ధ్వంసమయ్యాయి. రాంబాన్, సాంబా జిల్లాలో ఆకస్మిక వరదలతో పదుల సంఖ్యలో పశువులు మరణించాయని అధికారులు చెప్పారు. సోమవారం కూడా జమ్ముకాశ్మీర్‌లో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.