లెక్క తీస్తాం…

Let's count...– రాజకీయాలకు అతీతంగా విద్యుత్‌ సంస్థలపై విచారణ
– అవసరమైతే మాజీ సీఎం, మంత్రులనూ పిలుస్తాం
– మొదట రిక్వెస్ట్‌…కాదంటే సమన్లు
– బాధ్యులందరికీ నోటీసులు
– త్వరలో ప్రజాభిప్రాయసేకరణ
– వంద రోజుల్లో నివేదిక
– భద్రాద్రి, యాదాద్రి విద్యుత్కేంద్రాలు, ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందంపై జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి న్యాయ విచారణ షురూ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భద్రాద్రి, యాదాద్రి విద్యుత్కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందంతో సంబంధం ఉన్నవారందరినీ విచారిస్తామని జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. వంద రోజుల్లో దీనిపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి ఇస్తామని చెప్పారు. పై విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌కు వెళ్లకుండా నామినేషన్ల ప్రాతిపదికన పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం, ఛత్తీస్‌గఢ్‌ డిస్కంల నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంపై న్యాయ విచారణ జరిపేందుకు పాట్నా హైకోర్టు రిటైర్డ్‌ చీఫ్‌ జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డిని ‘కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ’గా నియమిస్తూ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోని 7వ అంతస్తులో కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీకి కేటాయించిన కార్యాలయంలో ఆదివారం జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి న్యాయ విచారణ ప్రక్రియను ప్రారంభించారు. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి, ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల సీఎమ్‌డీ ఎస్‌ఏఎం రిజ్వీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం అక్కడే నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిషన్‌ లక్ష్యాలు వివరించారు. పై అంశాలకు సంబంధించిన సమాచారం, సాక్ష్యాలు, ఆధారాలను ఎవరైనా కమిషన్‌ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ అంశాలతో సంబంధం ఉందని కమిషన్‌ భావిస్తే మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులను కూడా విచారణకు పిలుస్తామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మొదట రిక్వెస్ట్‌ లెటర్స్‌ రాస్తామనీ, వాటికి స్పందించకుంటే సమన్లు పంపుతామన్నారు. కమిషన్‌కు ఆ అధికారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. మూడు ఒప్పందాలకు సంబంధించిన ఫైళ్లు తమ కార్యాలయానికి చేరాయని ఆయన తెలిపారు. వాటి ప్రాథమిక పరిశీలన కూడా పూర్తయ్యిందనీ, అవసరమైతే మిగిలిన ఫైళ్లను అడుగుతామన్నారు. దీనిపై త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామనీ, దీనికోసం త్వరలో బహిరంగ ప్రకటన విడుదల చేస్తామన్నారు. తమ వద్ద ఉన్నసమాచారాన్ని ఎవ్వరైనా ఈ-మెయిల్‌ లేదా లేఖల తమ కార్యాలయానికి పంపొచ్చన్నారు. సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కొద్ది మంది వ్యక్తుల నుంచి సమాచార సేకరణ కోసం బహిరంగ విచారణ కూడా నిర్వహిస్తామన్నారు. విద్యుత్‌ ఉద్యోగులు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) బహిరంగ విచారణలకు హాజరు కావద్దని గతంలో ఆంక్షలు విధించారనే విషయాన్ని విలేకరులు కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. దానిపై విద్యుత్‌ సంస్థల అభిప్రాయం తీసుకుంటామనీ, దూషణలు, రాజకీయ విమర్శలకు తావులేకుండా విచారణకు సహకరించాలని ఆయన కోరారు.

Spread the love