దేశ రక్షణకు పోరాడుదాం

దేశ రక్షణకు పోరాడుదాం– సంపదను అంబానీ, అదానీకి కట్టబెడుతున్న బీజేపీ
– క్రికెట్‌ చూసే మోడీకి మణిపూర్‌ వెళ్లే సమయం లేదా?
– ప్రభుత్వరంగ సంస్థలు ప్రయివేటుపరమైతే యువతకు ఉద్యోగాలెలా
– సమస్యలు పరిష్కారం కావాలంటే దశరథ్‌ను అసెంబ్లీకి పంపాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు సుభాషిణీఅలీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని శ్రీకృష్ణ కాలనీ పార్క్‌ కోసం స్థానిక ప్రజలతో కలిసి సీపీఐ(ఎం) సుదీర్ఘ కాలంగా పోరాటం చేసింది. గూండాల బెదిరింపులను ఎదుర్కొని ఎర్రజెండా అక్కడ ప్రజల కోసం నిలబడింది. భూకబ్జాదారుల నుంచి ఆ పార్క్‌ను కాపాడింది. అది ప్రజలకు చెందేలా కృషి చేసింది. ఆ పార్క్‌ను సుందరంగా అభివృద్ధి చేసింది. అదే తరహాలో దేశాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఎర్రజెండాను చేతిలో పట్టుకుని పోరాడాలి.’అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు సుభాషిణీఅలీ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి ఎం దశరథ్‌ను గెలిపించాలని కోరుతూ శుక్రవారం శ్రీకష్ణ కాలనీలో బహిరంగ సభను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సుభాషిణీఅలీ మాట్లాడుతూ హైదరాబాద్‌లో మతం, కులం, ప్రాంతం అని కాకుండా ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటారని చెప్పారు. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని 1949, నవంబర్‌ 26న రాజ్యాంగ సభ ఆమోదించిందని గుర్తు చేశారు. మహిళలు, పురుషులు, పేదలు, సంపన్నులు ఇలా అన్నివర్గాల వారూ రాజ్యాంగం ప్రకారం సమానమేనని అన్నారు. ఆ రాజ్యాంగాన్ని ఆమోదించబోమనీ, మనుస్మృతి తమ రాజ్యాంగమంటూ ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటించిందని గుర్తు చేశారు. దాని ప్రకారం మనుషులంతా సమానం కాదనీ, స్త్రీలకు స్వేచ్ఛగా జీవించే హక్కు లేదని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి మనుస్మృతిని అమలు చేయాలని చూస్తున్నదని విమర్శించారు. దేశంలోని సహజ సంపదను అంబానీ, అదానీకి కట్టబెడుతున్నదని వివరించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌, సింగరేణి గనులు, ఎయిర్‌పోర్టులు, రైల్వేలు ఇలా ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తే యువతకు ఉద్యోగాలెలా?వస్తాయని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కూడా కమీషన్ల కోసం మద్దతు ఇస్తున్నాయని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని చెప్పారు.
కార్పొరేట్‌ అనుకూల విధానాలను అవలంభిస్తున్న బీజేపీని ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. కల్వకుంట్ల కవిత ఢిల్లీ వచ్చినపుడు మహిళల సమస్యలపై పోరాడ దామంటూ ప్రకటించారని అన్నారు. ఈడీ నోటీసులు రాగానే బీజేపీ మీద పోరాటాన్ని ఆమె మర్చిపోయారని చెప్పారు. క్రికెట్‌ మ్యాచ్‌ చూసే తీరిక ఉన్న ప్రధాని మోడీకి మణిపూర్‌ వెళ్లి మహిళల బాధను వినడానికి సమయం లేదా?అని ప్రశ్నిం చారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు వాషింగ్‌ మెషిన్‌లాగా తయారయ్యాయని అన్నారు.
బీజేపీలో టికెట్‌ రాని వారు కాంగ్రెస్‌లోకి, అక్కడ టికెట్‌ రాని వారు బీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారని వివరించారు. వారు వాషింగ్‌మెషిన్‌లోకి వెళ్లి వారి మరకలను శుద్ధి చేసుకుని మంచివారిలా మారుతున్నట్టు కనిపిస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో డబ్బు పంచి గెలవాలని చూస్తున్నారని అన్నారు. గెలిచాక ఖర్చు చేసిన దానికంటే ఎక్కువ సంపాదించే దానిపైనే దృష్టిపెడతారని చెప్పారు. డబ్బు సంపాదించే లక్ష్యంతో ఉండే వారు సమస్యల పరిష్కారం కోసం ఎందుకు పనిచేస్తారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే నిజాయితీగా పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థి ఎం దశరథ్‌ను గెలిపించాలనీ, అసెంబ్లీకి పంపించాలని ఆమె కోరారు.
ప్రభుత్వాలను ప్రశ్నించాలంటే సీపీఐ(ఎం)ను గెలిపించాలి : డిజి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించాలంటే సీపీఐ(ఎం) అభ్యర్థులు గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నరసింహారావు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని విమర్శించారు. సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం శ్రీనివాస్‌ మాట్లాడుతూ మత రాజకీయాలు చేస్తున్న బీజేపీ, ఎంఐఎంను ఓడించాలని పిలుపునిచ్చారు.
లౌకిక పార్టీలను గెలిపిస్తేనే హైదరాబాద్‌ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ముషీరాబాద్‌ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎం దశరథ్‌ మాట్లాడుతూ అభివృద్ధి చేయని ముఠా గోపాల్‌కు మళ్లీ ఓటెందుకెయ్యాలని ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌, బీజేపీ ఏనాడూ పనిచేయలేదని విమర్శించారు. సీపీఐ(ఎం)కు అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. సీపీఐ(ఎం) నాయకులు ఏఏకే పాషా అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌ అరుణజ్యోతి, నగర కార్యదర్శివర్గ సభ్యులు కె నాగలక్ష్మి, నగర కమిటీ సభ్యులు పద్మ, నాయకులు కృష్ణస్వామి, శ్రీకృష్ణ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు యాదగిరి, ప్రధాన కార్యదర్శి మహమూద్‌అలీ, హైకోర్టు న్యాయవాది అతుల్‌ అగర్వాల్‌, స్థానిక నాయకులు రఫత్‌ అంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love