– 41.5 కిలోలకే ధాన్యం సేకరించాలి
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
– రైతులకు అండగా ఉంటామని భరోసా
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
రైతు కష్టాన్ని మిల్లర్ల పాలు చేయనీయబోమని, 41.5 కిలోలకే ధాన్యం సేకరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం మండలంలోని కోన సముందర్ లో కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. మిల్లర్ల అదనపు కోతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వానలు వచ్చేలోపే ధాన్యం తరలించాలని, లారీల సంఖ్య పెంచాలన్నారు.యుద్ధ ప్రాతిపదికన ధాన్యం సేకరణ పూర్తి చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ తో ఫోన్‌లో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన స్వయంగా కల్లాల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడి, ధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుండే ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పలు సూచనలు చేశారు. కోనసముందర్ కేంద్రంలో ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని, ప్రస్తుతం వస్తున్న రెండు లారీలు సరిపోవని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ధాన్యం తడవకుండా ఉండాలంటే లారీల సంఖ్యను పెంచి, కలెక్టర్ మాట ఇచ్చిన విధంగా ఈ రోజు నుండి 8 రోజుల్లోగా సేకరణ పూర్తి చేయాలన్నారు.
నిజామాబాద్‌లోని భువనేశ్వర్ రైస్ మిల్లు యాజమాన్యం క్వింటాలుకు 43 కిలోల చొప్పున అడుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇది నిబంధనలకు విరుద్ధమని 41.5 కిలోల చొప్పున మాత్రమే ధాన్యం తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.
బషీరాబాద్ కేంద్రంలో ఇప్పటివరకు కేవలం 20 శాతం ధాన్యం మాత్రమే లిఫ్ట్ అయిందని, మిగిలిన 80 శాతం ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ కూడా లారీల రాకను పెంచాలని జేసీ కి సూచించారు.ధాన్యం లారీలకు ఆటంకం కలగకుండా చూడాలని, అవసరమైతే మట్టి లేదా పెండ తరలించే వాహనాల ను కుడా ధాన్యం రవాణాకే వాడాలన్నారు. ట్రాన్స్‌పోర్టర్ల నిర్లక్ష్యంపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.రైతులు పండించిన ప్రతి గింజను తరుగు లేకుండా ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయాలని, వర్షాల ముప్పు పొంచి ఉన్నందున యుద్ధ ప్రాతిపదికన ధాన్యం తరలింపు చేపట్టాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.



