ఒత్తిడిని ఇలా తగ్గించుకుందాం…

మనం ఒత్తిడికి గురైనప్పుడు శరీరం ఫైట్‌ ఆర్‌ ఫ్లైట్‌ వ్యవస్థను సిద్ధం చేస్తుంది. అడ్రినలిన్‌ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. మనం ఆపదలో ఉన్నాం కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలన్న సందేశం ఇస్తూ ఇది రక్త ప్రసరణ వేగాన్ని పెంచి, మెదడుకు రక్త సరఫరాను అధికం చేస్తుంది. శరీరానికి ఎక్కువ శక్తి అవసరమని రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను పెంచుతుంది. ఊపిరితిత్తులు ఎక్కువ గాలిని తీసుకునేలా చేస్తుంది. ఇలా మొత్తంగా శరీర వ్యవస్థను ఉన్నట్టుండి మార్చేస్తుంది. ఇలా మళ్లీ మళ్లీ జరగడం అంటే, శరీరంలో ఎన్నో జబ్బుల్ని పోగుచేసుకోవడమే. ‘పంచేంద్రియాల టెక్నిక్‌’తో ఒత్తిడిని ఇలా తగ్గించుకోవచ్చునని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.
మీ ఎదురుగా కనిపిస్తున్న దృశ్యంలో ఒక ఐదు అంశాల పేర్లు బయటికి చెప్పాలి. ‘నేను ఒక చెట్టును చూశాను. ఒక పండును చూశాను. ఒక పుస్తకాన్ని చూశాను’ ఇలా. లేదా మీకు ఇష్టమైన, సంతోషాన్ని కలిగించే మరి వేటినైనా ప్రస్తావించొచ్చు.
తాకండి
మీ శరీరంలోని భాగాలను లేదా చుట్టూ ఉన్న చెట్లు, ఆకులు, మీరు కూర్చున్న సోఫా, కార్పెట్‌ ఇలా ఏవైనా ఓ నాలుగింటిని రుద్దినట్టుగా కాస్త నొక్కి తాకాలి. ‘నేను ఈ ఆకుల స్పర్శను అనుభూతి చెందగలుగుతున్నా. ఈ మట్టిని ముట్టుకోగలు గుతున్నా. నా గోళ్లు, జుట్టు అన్నిటినీ ప్రేమగా తాకగలుగుతున్నా’ ఇలా అనుకుంటూ వాటిని తాకండి. ఈ సున్నితమైన స్పర్శ మనసుకు సాంత్వనను చేకూరుస్తుంది.
వినండి : మీ చుట్టూ వినిపిస్తున్న ఓ మూడు శబ్దాలను వినండి. వాటిని బయటికి చెప్పండి. గాలికి కదిలే ఆకుల చప్పుడు, పక్షుల అరుపులు, బస్సు హారన్‌, పిల్లల కేరింతలు.. ఇలా మీరు ఏం వింటున్నారు అన్నదాని మీదే పూర్తి ధ్యాస పెట్టి ఆ శబ్దాన్ని గ్రహించండి. ఇలా చేయడం వల్ల ఏడీహెడ్‌, యాంగ్జయిటీ, ట్రామాలాంటి మానసిక సమస్యల నుంచి కోలుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఊపిరి : ముక్కు ద్వారా గట్టిగా ఊపిరి పీల్చండి. మీరు ఆ సమయంలో అనుభూతి చెందుతున్న ఏవైనా రెండు వాసనలను బయటికి పలకండి. ఒకవేళ ఎలాంటి వాసనా రాకపోతే మీకు ఇష్టమైన రెండు మంచి సువాసనలను గుర్తుచేసుకోండి. ఇలా నచ్చిన వాసనల్ని గుర్తు తెచ్చుకోవడం అన్నది మెదడులో మంచి మార్పులు చోటుచేసుకునేందుకు సాయపడుతుంది. ప్రశాంతతను ఇస్తుంది.
రుచి చూడండి : ఓ మంచి మసాలా చారు, తియ్యటి చాక్లెట్‌, నోటిని తాజాగా చేసే పుదీనా.. ఇలా ఏదో ఒకటి ఆస్వాదిస్తూ రుచి చూడండి. ఆ సమయానికి వీలు పడకపోతే నచ్చిన రుచిని గుర్తు తెచ్చుకోండి. దాని గురించి ఆలోచనలు చేయండి. ఇది గుండె, జీర్ణవ్యవస్థ, శ్వాస వ్యవస్థలాంటి వాటిని నియంత్రిస్తుంది. తద్వారా శరీర వ్యవస్థ చక్కబడుతుంది. చివరగా పెదవులపై చిరునవ్వుతో మరోసారి దీర్ఘశ్వాస తీసుకోవాలి. మనసు కుదుటపడ్డ అనుభూతి మీ సొంతమవుతుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి.

Spread the love