ఢిల్లీ ఘటనకు లిబరేషన్‌ ఖండన

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఢిల్లీలోని ఇందర్‌లోక్‌ ప్రాంతంలో శుక్రవారం నమాజ్‌ చేస్తున్న ముస్లిం యువకులను పోలీసు అధికారి కాలితో తన్నటం అత్యంత హేయమైన చర్య అని సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్‌రాజా విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దురహంకారంగా ప్రవర్తించిన పోలిస్‌ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మసీదు బయట నమాజ్‌ చేయడం సాధారణ విషయమేనని తెలిపారు. ఈ కారణంతో ముస్లిం యువకులను ఓ పోలీసు అధికారి కాలితో తన్ని లేపి అవమానకరంగా వ్యవహరించాడని పేర్కొన్నారు. మతోన్మాద బీజేపీ పాలనలో పోలిస్‌ యంత్రాంగంలో నిండిన విద్వేషానికి ఇది నిదర్శనమని తెలిపారు. ఏ మతానికి చెందిన వారైనా పండుగలు, ఉత్సవాలు, ప్రత్యేక సందర్భాల్లో రోడ్డుపై గుమిగూడటం సహజమని పేర్కొన్నారు. కనీస మానవత్వం ఉన్న వారు ఎవరూ అలా చేయరని తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే దుర్బుద్ది ఇలాంటి చర్యలకు ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు.

Spread the love