జీవన్ దాస్ పథకం ద్వారా ఓ వృద్ధుడికి ప్రాణదానం

– మూత్రపిండ మార్పిడి చేయించుకొని ఏండ్లపాటు ఆరోగ్యంగా జీవించవచ్చు
– యశోద ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశికిరణ్
నవతెలంగాణ-సూర్యాపేట : జీవన్ దాస్ పథకం ద్వారా మూత్రపిండ మార్పిడి చేయించుకున్న వృద్ధుడు ఏండ్లపాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నట్లు మలక్ పెట్ యశోద ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశికిరణ్, యూనిట్ హెడ్ శ్రీనివాస్ చిదుర లు తెలిపారు. మూత్రపిండ మార్పిడి చేయించుకున్న రోగి భద్రారెడ్డి తో గురువారం స్థానిక తిరుమల గ్రాండ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.హుజూర్నగర్ మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన భద్రారెడ్డి 2014 లో యశోద ఆసుపత్రికి మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతూ వచ్చినట్లు తెలిపారు.భద్రారెడ్డిని పరీక్షించిన యశోద వైద్యులు ఆయనకు ఏమో డయాలసిస్ చేశారు. ఆయన ఎక్కాట్ పలమనేరి ఎడిమాకు సంబంధించిన సమస్యతో బాధపడుతూ ఇన్ పేషంట్ కేర్ అవసరముండడంతో మూత్రపిండం మార్పిడి చేయించుకోమని యశోద వైద్య బృందం ఆయనకు సూచించగా జీవన్ దాస్ కార్యక్రమం ద్వారా మూత్రపిండాలను దానం చేసే దాతల కోసం ఆయన రిజిస్టర్ చేసుకున్నారు. 2015లో ఆయనకు ఓ దాత ద్వారా మూత్రపిండం లభించగా యశోద వైద్య బృందం అత్యాధునిక విధానాల్లో శస్త్ర చికిత్స చేసి ఆయనకు మూత్రపిండం మార్పిడి చేశారు.నాటి నుంచి నేటి వరకు ఆయన తన దైనందిన కార్యక్రమాలతో పాటు వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా ఎంతో మెరుగుపడ్డారనీ వారు వివరించారు. డయాలసిస్ ద్వారా అనేక రకాల ఇబ్బందులు ఉండడంతో ఇలాంటి స్థితిలో ఉన్న రోగులకు కిడ్నీ మార్పిడి చేయడం చాలా మంచి చికిత్స అని దీంతో రోగులు పునర్జన్మ పొంది పూర్వంలా సాధారణమైన ఆరోగ్యకరమైన జీవనాన్ని పొందుతారని అందుకు ఉదాహరణ భద్రారెడ్డి అని వారు స్పష్టంచేశారు. యశోద ఆసుపత్రి ఇలాంటి రోగులకు ఇప్పుడు అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన చికిత్స తక్కువ ఖర్చులో అందుబాటులో ఉంచిందన్నారు. యశోద ఆసుపత్రి వైద్య బృందం సాధిస్తున్న అద్భుతమైన విజయాలకు యశోద ఆసుపత్రి అందిస్తున్న అంతర్జాతీయ స్థాయి అత్యధికమైన వైద్య సేవలకు ఈ కేసు చక్కటి ఉదాహరణ అన్నారు. హైదరాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రిలో మాత్రమే కాకుండా యశోద ఆసుపత్రి అన్ని శాఖల్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యధిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నిపుణులైన యశోద వైద్య బృందం ద్వారా అత్యంత క్లిష్ట తరమైన జబ్బులు, వ్యాధులకు కూడా చికిత్స చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు .ఈ సమావేశంలో రోగి భద్రారెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ ఏ వాసు కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love