సాహిత్యము – సైన్స్‌!

Literature - Science!ఫిబ్రవరి నెలలో అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం ఉంటుంది. ఫిబ్రవరి నెలలోనే వారంరోజుల వ్యవధిలో జాతీయ సైన్స్‌ దినోత్సవం కూడా ఉంటుంది. భాషలోనే సాహిత్యం కూడా కలిసే ఉంటుంది కదా! ఈ నేపథ్యంలో మానవాళి పురోగమనంలో అత్యంత ప్రాధాన్యత వహించిన సాహిత్యానికీ, సైన్సుకూ ఏమైనా సంబంధం ఉంటుందా? అనే ఆలోచనతో నేను చేసిన చిన్న పరిశీలన ఇది. నిజానికి ఇది లోతుగా పరిశోధించాల్సిన విషయం. భిన్న అభిప్రాయాలకూ అవకాశం ఉండే విషయం కూడా. ప్రస్తుతానికి నేను దీన్ని కొంత క్లుప్తంగా ఓ విహంగ వీక్షణంలా చూసే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను.
ఇది శాస్త్ర సాంకేతిక యుగం. మానవ చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా నేడు శాస్త్ర సాంకేతిక రంగాలు పురోగమిస్తున్నాయి. సాహిత్య రంగంలో కూడా గతంతో పోల్చి చూసుకుంటే ఆధునిక మార్పులు అనేకం చోటుచేసుకుంటున్నాయి.
సాహిత్యానికీ, సైన్స్‌కూ ఉన్న సంబంధాన్ని చూడాలంటే మనం మానవ చరిత్ర మూలాల్లోకి చూడాలి. మనుషులు ఇంకా అడవుల్లో పాతరాతి యుగాల్లో, బహుశా అంతకు ముందే కావచ్చు, రోజూ తమ ఆహారంకోసం చావు బతుకుల వేటలకు వెళ్ళి, రాత్రుళ్ళు వచ్చింతరువాత అందరూ నెగడుల ముందో, గుహల ముందో, ప్రకృతి ఒడిలోనో కలిసి కూర్చుని, ఆనాటి తమ భాషల్లో ఆనాటి తమ అనుభవాలను, తమ భావావేషాలను, ఊహలను కలిపి చెప్పుకునే క్రమంలో తొలి సాహిత్యానికి రూపకల్పన జరిగింది. అది మరునాటి తమ వేటలకూ, జీవిత పోరాటాలకూ అవసరమైన ఉత్సాహాన్ని, ధైర్యాన్నీ ఇచ్చింది.
అలాగే తమ చుట్టూ ఉన్న ప్రకృతిని పరిశీలించడం, తమ అనుభవాలను ఆధారంగా చేసుకుని ఊహించడం, దాన్ని ఉపయోగించి చూడ్డం, ఫలితాలను బట్టి నిర్దారించుకోవడం వంటి వాటితోే ఆ దశలో రాళ్ళు, కర్రలు వంటివి ఆనాటి తొలి సాంకేతిక పరికరాలుగా మారి వాళ్ళకు ఉపయోగపడ్డాయి. పరిశీలనలు, ఊహలూ, ఆలోచనలూ, ఉపయోగించి, ప్రయోగించి చూడ్డం వంటి వాటినుంచే వాళ్ళు నిప్పు చేయడం, చక్రం, వ్యవసాయం, బాణాలు వంటివెన్నో వాళ్ళు ఆవిష్కరించుకోగలిగారు. వేల సంవత్సరాల ఆనాటి మానవుల శాస్త్ర, సాంకేతికలు అవి.
అలా వేలాది ఏళ్ళ కిందట మానవజాతికి సిద్ధించిన శాస్త్ర సాంకేతిక సాహిత్య రంగాలు ఆనాడు పరస్పర పూరకాలే కానీ విరోధాలు కావు. ప్రకృతిలో ఏ ఇతర జీవులకూ లేని ప్రత్యేకత మానవ జాతికి ఉంది. అది ఊహించే, పరిశీలించే, ఆలోచించే శక్తి ఉన్న మెదడు. ప్రకృతి నడుమ జీవించిన ఆదిమానవులు తమ చుట్టూ ఉన్న సూర్యుడూ, చంద్రుడూ, చుక్కలూ, ఆకాశం, వర్షాలూ, ఎండలూ, దావానలాలూ, జనన మరణాలూ ఇలా ప్రతిదాన్నీ చూసి, పరిశీలించి, అర్థంచేసుకునే ప్రయత్నం చేశారు. ఇదేమిటీ? ఇలా ఎందుకు? అని ప్రశ్నించుకుంటూ, జవాబులు వెదుక్కునే ప్రయత్నం చేశారు. ప్రశ్నే జ్ఞానానికి బీజం కదా. అయితే దానికి జవాబులు చెప్పడానికి కేవలం వాళ్ళ దగ్గర ఆనాడున్నది అనుభవాలూ, పరిశీలనలూ, ఊహలు మాత్రమే. వాటికి మూలమైన మెదడు మాత్రమే. తమ అనుభవాలకూ, పరిశీలనలకూ ఊహలు జోడించి, వాళ్ళు తమకు తోచిన జవాబులు వెతుక్కునే ప్రయత్నాలు చేశారు. అలా దైవ భావనలూ, ఆత్మలూ, జన్మలూ, భూత ప్రేత పిశాచాల్లాంటి భావనలూ కలిసిన సాహిత్యం కాల్పనికతతో ఊపిరి పోసుకుని కథల రూపంలో బయటకు వచ్చాయి. ఐతే అవి ఆనాటి తొలి దశల సాహిత్య రూపాలు. అమూల్యమైన గిరిజన సాహిత్య బాండాగారాలు.
మానవులు అడవుల్లోంచి ఊళ్ళలోకి, వ్యవసాయ నాగరికథల్లోకి మారిన తరువాత అవి, జానపద సాహిత్య ప్రక్రియలుగా రూపాంతరం చెందాయి. నూతనంగా ఎన్నో పురుడుపోసుకున్నాయి. అలా వేల సంవత్సరాలు మౌఖికంగానే ఆ సాహిత్యం వివిధ ప్రక్రియల్లో తరంనుంచి తరానికి అందుతూ వచ్చింది. వాటిలో మానవుల తీరని ఆకాంక్షలన్నీ అద్భుత కల్పనలై చోటుచేసుకున్నాయి. మాంత్రికులూ, మంత్రాలూ, మానవాతీత శక్తులూ, ఎగిరే రెక్కల గుర్రాలూ, చెద్దర్లూ, అద్భుత దీపాలూ, ద్వీపాల వంటివెన్నో చేరి మనుషులు చేయాలనుకునే పనులన్నీ చేసి పెట్టాయి. అలా కల్పనల్లో అసాధ్యాలను సాధించిన కథలు మనుషులకు ఓ మానసిక సంతృప్తినీ, ఓదార్పునూ, సంతోషాన్నీ చేకూర్చాయి. ఆత్మ స్థయిర్యాన్నీ, విశ్వాసాన్నీ ఇచ్చాయి.
ఇదంతా సాహిత్య విషయంగా చెప్పుకుంటున్నాం. కానీ దీనిలో సైన్సుకు సంబంధించిన ప్రశ్న, పరిశీలన, ఊహ, సృజనాత్మక కల్పన వంటివి కూడా చోటుచేసుకున్నాయి. సాహిత్యానికైనా, సైన్స్‌ పరిశోధనలకైనా కావలసిన అంశాలు ఇవే కదా! వీటికి తోడు పరిశోధన, నిరూపణ, ఆవిష్కరణలు చేరితే అది శాస్త్రీయ ఆవిష్కరణ ఔతుంది.
వేల సంవత్సరాలు గడిచి, క్రమంగా పరిశోధనలు చేసే పరిస్థితులు, అందుకు అవసరమైన పరిశోధనా శాలలూ, పరిశోధకులూ, పరిశోధనలకు అవసరమైన వస్తువులు, అనుభవ జ్ఞానం వంటివి శాస్త్రీయ జ్ఞానానికి పునాదులు వేశాయి. ఆ పరిశోధనలు అప్పటి వరకు తెలియని అనేక శాస్త్రీయ విషయాలు తెలియజెప్పాయి. వాటి ఆధారంగా సాహిత్యం కూడా వచ్చింది. ఆధునిక శాస్త్రీయ ఆలోచనలతో, ఊహలతో, కల్పనలతో, భవిష్యత్తును ఊహిస్తూ ఎందరో రచయితలు తమ రచనల ద్వారా సైన్సుకు కొత్త కొత్త ఆలోచనలు అందించారు. మానవ వికాసంలో ఈనాడు మానవజాతికి అందిన ఇంతటి సాంకేతిక శాస్త్రీయ అభివృద్ధికీ, సాహిత్యంద్వారా అందిన మానవీయ విలువలకూ, నాగరికత అభివృద్ధికీ, సాంస్కృతిక వికాసాలకూ పరస్పరం ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఒకనాడు సాహిత్యంలో ఊహించిన ఊహలూ, కల్పనలెన్నో తరువాత జరిగిన పరిశోధనలకూ, సాంకేతిక సృష్టికీ బీజాలు వేశాయి.
– ‘పిల్లలు విజ్ఞానవంతులుగా, సృష్టికర్తలుగా మారాలంటే ఊహాశక్తిని, కల్పనా శక్తిని పెంపొందించే కథలను చదవాలి. అనుభూతి పొందాలి. ఆనందించాలి’.
‘కథ మనిషి సృష్టించుకొన్న మరో ప్రపంచం. కథల్లో ఉండేది వట్టి కల్పనలు మాత్రమే కాదు. అవి మానవుడి ఆకాంక్షలు కూడా. కథల్లోని కల్పనలు, ఊహలు, కోరికలుగా మారి మనిషి మరో అధ్భుత ప్రపంచాన్ని సృష్టించుకొన్నాడు. అదే శాస్త్రవిజ్ఞాన ప్రపంచం’.
‘పిల్లలు శాస్త్రవిజ్ఞాన ప్రపంచంలోకి ప్రవేశించడానికి ముందు కథా ప్రపంచంలో విహరించాలి’.
– ‘జ్ఞానం మొదట ఊహల ద్వారా నిర్ధారింపబడుతుంది. అది ప్రత్యక్ష అనుభవాల ద్వారా, రుజువుల ద్వారా నిర్ధారించ బడుతుంది’.
‘ఊహ జ్ఞానానికి తొలి బీజమైతే, కల్పన సృష్టికి (వస్తువుల సృష్టికి) మూలకారణమైంది’.
– (సి.వి. కృష్ణయ్య, కథల లోకంలో పిల్లలు, జనవిజ్ఞాన వేదిక)
సాహిత్యం కూడా శాస్త్ర విజ్ఞాన ప్రపంచాభివృద్ధికే కాదు, మానవ సమాజాభివృద్ధికి కూడా అద్భుతంగా తోడ్పడింది.
మానవులు సృష్టించుకున్న సాహిత్యం మానవుని ఆకాంక్షలను ఊహలూ, కల్పనల రూపంలో రూపొందించుకుంటే, ఆ సాహిత్యంలోని కొన్ని కల్పనలను నిజం చేసుకోవాలనే తపన, ఆలోచన వైజ్ఞానిక ప్రపంచంలో నూతన ఆవిష్కరణలకూ ప్రేరణ ఇచ్చింది. అలాంటి సాహిత్యం హృదయాన్నే కాదు మెదళ్ళనూ మేలుకొలుపుతుంది.
కేవలం కల్పనల మీద, ఊహల మీదా కాకుండా ఆనాటి శాస్త్రీయ పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఆధునిక యుగంలో కొందరు రచయితలు తమ రచనల్లో రాబోయే కాలాన్ని అంచనావేస్తూ, తమ సాహిత్య రచనల్లో రాసిన శాస్త్ర సాంకేతిక విషయాలు కొన్ని తరువాత పరిశోధనలకూ, ఆవిష్కరణలకూ ఎలా ప్రేరణ నిచ్చాయో, తరువాతి కాలంలో ఎలా వాస్తవంలోకి వచ్చాయో చూద్దాం.
మన జాతీయ సైన్స్‌ దినోత్సవానికి కారకులైన సి.వి.రామన్‌ గారికి సన్నిహితులుగా ఉండి, ఆయన దగ్గర కొన్ని పరిశోధనలు చేసిన మన తెలుగు వ్యక్తి గురించి, ఆయన రాసిన ఓ కథ గురించీ ఈ సందర్భంలో చెప్పాలనుకుంటున్నాను. 1927లో సి.వి.రామన్‌గారి దగ్గర రిసెర్చ్‌ చేయడానికి సిరిగూరి జయరావు అనే తెలుగు యువ శాస్త్ర పరిశోధకులు ఉండేవారు. ఆయన ఆ సంవత్సరమే ‘పరమాణువులో మేజువాణి’ అనే సైన్స్‌ ఫిక్షన్‌ కథ రాశారు. తెలుగులో వచ్చిన తొలి సైన్స్‌ ఫిక్షన్‌ కథ అది. ఆయన ఆ కథలో రాసిన విషయాలు ఇప్పుడు క్వాంటమ్‌ మెకానిక్స్‌ చెప్పడం మనకు అద్భుతంగా అనిపిస్తుంది. సైంటిస్టులకూ, సాహిత్య వేత్తలకూ ఆలోచనల్లో, ఊహల్లో, లాజిక్‌లలో ఉండే దగ్గరితనం చెప్పడానికి మన తెలుగు వాళ్ళకు ఇదో మంచి ఉదాహరణ అనుకుంటున్నాను.
జనవరి నెల రెండవ తేదీని ప్రపంచంలో చాలా దేశాల్లో ‘సైన్స్‌ ఫిక్షన్‌ డే’ గా జరుపుకుంటారు. ఆరోజు సైన్స్‌ ఫిక్షన్‌ రచయితల్లో ప్రముఖుడైన అయిజాక్‌ అసిమోవ్‌ పుట్టిన రోజు. వైజ్ఞానిక వాస్తవాల వెలుగులో జరుగబోయే విషయాల ఊహలు, కల్పనలతో వచ్చే సాహిత్యం సైన్స్‌ ఫిక్షన్‌. అలా సైన్స్‌ ఫిక్షన్‌ రచయితలు తమ రచనల్లో రాసిన విషయాలు తరువాత శాస్త్ర పరిశోధనలకు భూమికలయ్యాయని చెప్పడానికి ఎందరో రచయితలను పేర్కొనవచ్చు. అలాంటి వారిలో ముందువరుసలో ఉండే వారిలో అయిజాక్‌ అసిమోవ్‌ ఒకరు. భవిష్యత్తులో మానవులు అంతరిక్షంలో నివాసాలు ఏర్పరచుకుంటారని, గ్రహాంతర యానాలు చేస్తారని, ఆయన తన రచనలల్లో రాశారు. ముఖ్యంగా ఆయన రోబోల గురించి రాసిన అనేక విషయాలు, వాటి నియమాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక ఆవిష్కరణలకు అవకాశం కల్పించాయి. ఆ దిశగా ఇంకా ఎన్నో ప్రయోగాలూ పరిశోధనలూ జరుగుతున్నాయి. ఆయనను రోబోటిక్‌ స్ఫూర్తి ప్రదాతగా భావిస్తున్నారు. ఆయన తన సాహిత్యం ద్వారా శాస్త్రీయ దృక్పథం అందించే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంలోనే మనం ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఒకటి ఉంది. 1957లో ఆంధ్ర విశ్వ విద్యాలయం సైన్స్‌ ఫిక్షన్‌ నవలల పోటీ నిర్వహించింది. అప్పుడు ఆ విశ్వ విద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌గా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గారి నిర్వహణలో ఆ పోటీ జరిగింది. ఆ పోటీలో కొడవంటి నరసింహం రాసిన ‘ఇక్కడనుండి… ఎక్కడకు?’ అనే నవలకు మొదటి బహుమతి లభించింది.
‘రచయితలు ఊహించే శాస్త్ర సాంకేతిక భవిష్యద్దర్శనమే సైన్స్‌ ఫిక్షన్‌’ అంటారు. ఒక విధంగా సైన్స్‌ ఎటువైపు ప్రయాణించాలో సూచించే వాళ్ళే సైన్స్‌ ఆధారంగా సాహిత్య సృష్టి చేసే రచయితలు. చరిత్రలో అలాంటి వాళ్ళు ఎందరో కనిపిస్తారు. ఉదాహరణకు కొందరిని చూద్దాం.
పాశ్యాత్య సాహిత్యంలో జూల్స్‌వెర్న్‌ 1865లోనే రాసిన ‘ఫ్రం ఎర్త్‌ టు ద మూన్‌’ నవలలో చంద్రయానం గురించి రాశారు. ఆ నవలలో ఆయన రాసిన అనేక సాంకేతిక విషయాలు నాసా వారి అపోలో ప్రయోగాలకు చాలా దగ్గరగా ఉన్నాయట. ఆయన రాసిన ‘ట్వంటీ థౌజండ్‌ లీగ్స్‌ ఇన్‌ అండర్‌ వాటర్‌’ నవలలో అణుశక్తి జలాంతర్గామిని గురించి రాశారు. అదీ తరువాత వాస్తవ రూపంలోకి వచ్చింది. అమెరికా 2006లో తమ న్లూక్లియర్‌ సబ్‌మెరైన్‌కు ఆయన తన నవలలో పెట్టిన పేరే పెట్టింది – నాటిలస్‌ అని. ఆయన రాసిన స్టౌవ్వులు, ఇంజన్లు, దక్షిణ దృవ యాత్ర, వంటి ఎన్నో ఊహలూ కల్పనలూ చాలా వరకు తరువాత కాలంలో ఫలించాయి. 1884లో ఆయన మిస్టీరియస్‌ ఐలాండ్‌ నవలలో భవిష్యత్‌ ఇంధనాలుగా హైడ్రోజన్‌ను ఊహించాడు. అది సాకారమౌతున్నది. భూగర్భంలో నదీ నదాలూ, అరతర్వాహినులూ, సరస్సులూ, అల్పజీవాలూ, జలచరాలూ ఉంటాయని రాశాడు. అదికూడా నిజమని ఈనాడు తెలిసింది. యూరోపియన్‌ స్పేస్‌ ఎజెన్సీ వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళే తమ వాహనాకికి జూల్స్‌వెర్న్‌ పేరు పెట్టారు. దానిలో ఆయన రాసిన ‘ఫ్రం ఎర్త్‌ టు ద మూన్‌, ఎరౌండ్‌ దమూన్‌, జర్నీ టుది సెంటర్‌ ఆఫ్‌ది ఎర్త్‌’ నవలలను ఉంచారు. అదీ ఓ సైన్స్‌ ఫిక్షన్‌ నవలా రచయితకు వాళ్ళు ఇచ్చిన గౌరవం.
ప్రసిద్ధ సైన్స్‌ ఫిక్షన్‌ రచయిత ఐజాక్‌ అసిమోవ్‌ ఏనాడో చంద్రమండల యాత్ర, రోబోలు, అంతరిక్ష నివాసం వంటివి తన రచనల్లో రాశాడు. వాటిని ఈ రోజు మనం వాస్తవాలుగా చూస్తున్నాం. చార్లెస్‌ క్లార్క్‌ 1945లోనే తన రచనలో కృత్రిమ ఉపగ్రహం సాటిలైట్‌ గురించి రాశాడు. పదేళ్ళలోనే అది వాస్తవంగా వచ్చింది. 1962లో గ్లోబల్‌ లైబ్రరీ గురించి రాశాడు. అదిప్పుడు నెట్టింట్లో చూస్తున్నాం. స్పేస్‌ టూరిజం, స్పేస్‌ ట్రావెల్‌ గురించి సైన్స్‌ ఫిక్షన్‌లుగా చెప్పినవి ఇప్పుడు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ద ఫౌంటేన్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌లో రోదసీలోకి లిఫ్ట్‌ ను ఊహించారు. జాక్‌ లండన్‌ రెడ్‌ అనే అంటువ్యాధి భూమిని నాశనం చేస్తుందని రాశాడు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా కాలాన్ని మనం చూశాం. ఎరిక్‌ బ్రౌన్‌ 1960లో వీడియో గేమ్స్‌ గురించి రాశాడు. ఇప్పుడు వీడియో గేమ్స్‌ గురించి తెలియని వాళ్ళు లేరు. ఆడని పిల్లలూ లేరు.
శాస్త్రీయ పునాదుల మీద సృష్టించిన సాహిత్యంలో చాలా విషయాలు సైన్స్‌ పరిశోధనలకు ప్రేరణలూ, ఆలోచనలూ ఇచ్చాయనడానికి ఇలా అనేక ఉదాహరణలు ఉన్నాయి. పరిశీలనలు, ప్రశ్నలు, ఊహలు, కల్పనలూ, పరిశోధనలూ వంటివి సృజనాత్మకతకు ప్రాణం పోస్తాయని చెప్తారు. వాటి ఆధారంగా, శాస్త్రీయ పునాదులపై వచ్చే సాహిత్యానికీ, తదనంతర శాస్త్ర సాంకేతిక పురోగమనానికీ సంబంధం ఉంటుంది. అవి పరస్పరం సంబంధంలో ఉంటాయి. ఒకదాని అభివృద్ధికి ఒకటి సహకరించుకుంటాయి.
సైన్స్‌ ఫిక్షన్‌ ఈ ఇరవై ఒకటో శతాబ్దంలోని ఆధునిక తరానికి ఆసక్తినీ, ఆలోచననీ రేకెత్తించగల సాహిత్యం. దీని ద్వారా ఈ తరానికి శాస్త్రీయ దృక్పథానికి సన్నిహితం చేయవచ్చు. సాహిత్యం వైపు మళ్ళించవచ్చు. మానవాళికి పనికివచ్చే నూతన పరిశోధనల పట్ల ఆసక్తి కలిగించవచ్చు. ప్రకృతికి సన్నిహితం చేయవచ్చు. ప్రకృతి సూత్రాలను తెలుసుకునేలా నడిపించవచ్చు. మానవాళికి ఏది మంచో, ఏది అవసరమో అలాంటి పరిశోధనలు చేసేలా మార్చవచ్చు.
అలాంటి దృష్టినీ, అవగాహననూ ఈ-తరానికి అందించాల్సిన అవసరాన్ని గుర్తించి, బాల సాహిత్య రంగంలో పనిచేస్తున్న కొందరు ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్‌ దినోత్సవ సందర్బంగా సైన్స్‌ ఫిక్షన్‌ కథల పోటీలను కొంతకాలంగా నిర్వహిస్తున్నారు. కౌమార వయసు పిల్లలు ఇలాంటి రచనలు తమ స్థాయిలో చేస్తున్నారు. ఉపాధ్యాయులూ, పాఠశాలలూ, బాలసాహితీ వేత్తలూ సహకరిస్తున్నారు. ఈ-తరం వారికి మరింత శాస్త్రీయ దృష్టినీ, మంచి సాహిత్యాభిలాషనూ పెంచుతూ, సైన్సునూ, సాహిత్యాన్నీ ఈ నాటి పిల్లలకు దగ్గర చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో విస్తరించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
– డా. వి. ఆర్‌. శర్మ.
9177887749

Spread the love