లో స్కోర్లు లోడింగ్‌?

Loading scores in?– భారత్‌, పాక్‌ మ్యాచ్‌పై మార్కెట్‌ ఆందోళన
– ఐసీసీ తీరుపై ప్రసారదారు అసంతృప్తి
– ఆదివారం దాయాదుల మెగా మ్యాచ్‌
భారత్‌, పాకిస్థాన్‌ టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌. ఇరు దేశాల్లోనూ టెలివిజన్‌కు ప్రైమ్‌ టైమ్‌. వినోదం కోసం అభిమానులు, ఆదాయం కోసం ప్రసారదారు, అమెరికాలో క్రికెట్‌ బ్రాండ్‌ నిలబడేందుకు ఐసీసీ… ఇలా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత కీలక మ్యాచ్‌. టీ20 క్రికెట్‌ అంటేనే పరుగుల పండుగ. కానీ న్యూయార్క్‌ పిచ్‌పై వికెట్ల జాతర సాగుతున్న తరుణంలో భారత్‌, పాక్‌లోనూ స్వల్ప స్కోర్లు నమోదు కానున్నాయి!. ప్రపంచ కమర్షియల్‌ మార్కెట్‌ రాజధాని అమెరికాలో క్రికెట్‌ను బ్రాండ్‌ను పెంచగల మ్యాచ్‌లో లో స్కోర్లు ఐసీసీ లక్ష్యానికి గండి కొట్టే ప్రమాదం నెలకొంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
దాయాదుల పోరుకు కొత్త పిచ్‌! :
నాసా కౌంటీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఆరు డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లు సిద్ధం చేశారు. ఇందులో 2, 4 పిచ్‌లను ఇప్పటివరకు వినియోగించారు. నేడు నెదర్లాండ్స్‌, దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు 1, 3 పిచ్‌లలో ఒకటి వాడతారు. ఆదివారం జరిగే భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు మిగిలిన పిచ్‌లను వినియోగించనున్నారు. ఇప్పటికే కొత్త పిచ్‌లపై పేసర్లకు అనూహ్య బౌన్స్‌, పేస్‌ లభిస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో ఆ ప్రభావం రెట్టింపు అవుతుంది. శ్రీలంక 77, ఐర్లాండ్‌ 96 పరుగులకు ఆలౌటయ్యాయి. నేడు సఫారీ, డచ్‌ మ్యాచ్‌లోనూ వంద పరుగుల మార్క్‌ గగనమే కానుంది.
పేసర్లకు పండుగ :
భారత్‌, పాకిస్థాన్‌ జట్లలో నాణ్యమైన పేసర్లకు కొదవ లేదు. అర్షదీప్‌ సింగ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌లు పదునైన స్వింగ్‌, బౌన్స్‌తో రాణించారు. పాక్‌ శిబిరంలో షహీన్‌ అఫ్రిది, మహ్మద్‌ ఆమీర్‌, నషీం షా, హరీశ్‌ రవూఫ్‌లు స్వింగ్‌కు పెట్టింది పేరు. టాస్‌తో సంబంధం లేకుండా ఎవరు బ్యాటింగ్‌కు వచ్చినా పరుగుల వేటలో చుక్కలు కనిపించనున్నాయి. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ, రిషబ్‌ పంత్‌లు అనూహ్య బౌన్స్‌కు గాయపడే పరిస్థితి!. అర్షదీప్‌ సింగ్‌ వరుస వైడ్ల అనంతరం క్రాస్‌ సీమ్‌తో బంతి సంధించినా.. బంతి గింగిరాలు తిరుగుతూ దూసుకెళ్లింది. ఇరు జట్ల పేసర్లు వికెట్ల పండుగ చేసుకోనుండగా.. భారత్‌, పాక్‌ బ్యాటర్లకు డ్రాప్‌ ఇన్‌ పిచ్‌పై పరుగుల వేట కఠిన సవాల్‌గా మారనుంది.
ప్రసారదారు ఆందోళన :
టీ20 క్రికెట్‌లో పరుగుల వేట ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది. పేసర్లు ఎంత గొప్పగా బంతులేసినా, కండ్లుచెదిరే రీతిలో వికెట్లను గిరాటేసినా ఇటు అభిమానుల్లో, అటు ప్రసారదారుకు సంతృప్తి ఉండదు!. పరుగుల వేట తటస్థ అభిమానులను క్రికెట్‌కు ఆకర్షితులను చేయగలదు. ప్రసారదారుకు రికార్డు వీక్షణలతో పాటు వాణిజ్య ప్రకటనల టారీఫ్‌ అమాంతం పెంచుకునేందుకు సులువైన మార్గం వేయగలదు. భారత్‌, పాక్‌ మ్యాచ్‌తో ఇటు ఐసీసీ, అటు ప్రసారదారు అత్యధిక ఆదాయం ఆర్జించేందుకు లక్ష్యం పెట్టుకున్నాయి. టికెట్ల కొనుగోలు రూపంలో ఐసీసీకి ఇప్పటికే గట్టి దెబ్బ పడింది. భారత్‌, పాక్‌ మ్యాచ్‌ డైమండ్‌ క్లబ్‌ టికెట్‌ ధర రూ.8.4 లక్షలతో ఐసీసీ గణనీయంగా ఆర్జించనుంది. సాధారణ స్టాండ్‌ టికెట్‌కు సైతం రూ.25 వేలు వసూలు చేస్తోంది. స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌తో అభిమానుల్లో క్రేజ్‌, మార్కెట్‌ హైప్‌ తగ్గే ప్రమాదం ఉంది.
ఐసీసీ కింకర్తవ్యం :
భారత్‌, పాక్‌ మ్యాచ్‌ను న్యూయార్క్‌లో నిర్వహించి.. ప్రపంచ కార్పోరేట్‌ మార్కెట్‌ రాజధాని అమెరికాకు క్రికెట్‌ను పరిచయం చేయాలని లక్ష్యం పెట్టుకున్న ఐసీసీ ఆ దిశగా సరైన ఆచరణ చేపట్టలేదు. డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లు సాధారణంగా స్పందించేందుకు మైదానంలో కుదురుకునేందుకు కాస్త సమయం పడుతుంది. కనీసం 10-12 ఫస్ల్‌ క్లాస్‌ మ్యాచులు ఆడాలి. అప్పుడే పిచ్‌ సహజంగా స్పందిస్తుంది. ఆస్ట్రేలియా నుంచి డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లను తీసుకొచ్చి కొన్నాండ్లు ఫ్లోరిడాలో ఉంచిన ఐసీసీ.. టీ20 ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు మాత్రమే న్యూయార్క్‌కు తీసుకొచ్చింది. బంగ్లాదేశ్‌, భారత్‌ వార్మప్‌ మ్యాచ్‌ కొత్త డ్రాప్‌ ఇన్‌ పిచ్‌పై తొలి మ్యాచ్‌. డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లపై ఐసీసీ కొన్ని ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచులు ఆడేందుకు ఏర్పాటు చేయగలిగితే.. ఇప్పుడు ప్రపంచకప్‌లో స్వల్ప స్కోర్లు చూసేవాళ్లం కాదు. ఇవే పిచ్‌లు రెగ్యులర్‌ స్టేడియాల్లో ఎదురైతే ఇప్పటికే ఐసీసీ భారీ జరిమానాలతో కొరఢా ఝులిపించి ఉండేది!.

Spread the love