నవతెలంగాణ-ఆలేరు టౌన్
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పరిశ్రమలలో స్థానికులకే అవకాశం కల్పించాలని, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎండి నయీమ్ అన్నారు. ఆలేర్ పట్టణంలో ఆదివారం అంబేద్కర్ విగ్రహం వద్ద సెప్టెంబర్ 8 ,9,10 తేదీలలో యాదగిరిగుట్టలో జరిగే ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎండి నయీమ్ ఆయన మాట్లాడుతూ.. దేశ జనాభాలో యువత శాతం అధికంగా ఉన్నప్పటికీ వారికి నాణ్యమైన విద్య, శాశ్వత ఉపాధి, అందుబాటు వైద్యం, నైపుణ్యాభివృద్ధి, సామాజిక భద్రత కల్పించడంలో పాలకులు విఫలమవుతున్నారని విమర్శించారు.
జిల్లాలోని పరిశ్రమలలో స్థానికులకే ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి స్పష్టమైన వార్షిక క్యాలెండర్, పెండింగ్ నియామకాల పూర్తి, జిల్లాల వారీగా పరిశ్రమల ఏర్పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రైవేట్, కాంట్రాక్ట్, గిగ్ రంగాల్లో పనిచేస్తున్న యువతకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలని కోరారు.
యువత, విద్యార్థులపై పెరుగుతున్న ఆర్థిక భారం, ఫీజుల సమస్యలు, పరీక్షల నిర్వహణలో జాప్యం, పేపర్ లీకులు, నిరుద్యోగ పోటీ పరీక్షల కోసం ఖరీదైన కోచింగ్‌పై ఆధారపడాల్సిన పరిస్థితిని ప్రభుత్వం ముగించాలని ధర్మేంద్ర అన్నారు. ప్రతి జిల్లాలో ఉచిత పోటీ పరీక్షల కోచింగ్ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, విద్యార్థి హాస్టళ్లు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులను బలోపేతం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సుద్దాల సాయికుమార్, ఆలేరు మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య, మండల కన్వీనర్ బర్ల ప్రశాంత్, పోతు ప్రవీణ్, చౌడబోయిన పరశురాములు,గిరబోయిన స్వామి, దూడల లింగం, పొన్నబోయిన రవి, మాటూరి జానమ్మ,బొట్టు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.



