కమలంలో లొల్లి

కమలంలో లొల్లి– రాజస్థాన్‌లో వసుంధర రాజే ‘బల ప్రదర్శన’…
– సచిన్‌పైలట్‌గా మార్చొదంటూ ఎమ్మెల్యేల ఆగ్రహం
జైపూర్‌ : ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించ కుండానే.. బీజేపీ మూడు చోట్లా గెలిచింది. మార్పునకు పట్టం కట్టిన రాజస్థాన్‌లో ముఖ్య మంత్రి ఎన్నిక రగడగా మారుతోంది. యూపీలో యోగిని సీఎం చేసినట్టు.. రాజస్థాన్‌లోనూ ప్రయోగం చేయాలని బీజేపీ భావిస్తోంది. దీనికి వ్యతిరేకంగా వసుంధర రాజే తన ఇంట్లో ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేయటంతో.. కమలంలో లొల్లి పరాకాష్టకు చేరింది. బీజేపీ అంటే.. క్రమశిక్షణ ఉన్న పార్టీ అని, ఇలాంటి సంస్కృతిని ఎక్కువ కాలం సహించలేమని అధిష్టానం హెచ్చరికలు చేస్తోంది.
మరోవైపు అమాంతంగా 20 మంది ఎమ్మెల్యేలు వసుంధర రాజే ఇంటికి చేరుకోవటం హైకమాండ్‌ను కలవరపరుస్తోంది. వసుంధరకు సీఎంగా పట్టం కట్టేందుకు హైకమాండ్‌ నుంచి గ్రీన్‌ సిగల్‌ వచ్చిందా.. లేక రాజస్థాన్‌ మాజీ సీఎం.. నిప్పులు చెరిగేందు కు సిద్ధమయ్యారా అనే చర్చ హాట్‌ హాట్‌గా సాగుతోంది. ఎందుకంటే కేంద్ర నాయకత్వం నుంచి గ్రీన్‌ సిగల్‌ లేకుండా తన ఇంటి వద్ద ఎమ్మెల్యేల కవాతు నిర్వహించే దమ్ము, ధైర్యం బీజేపీలో ఏ నాయకుడికి లేదు. మరోవైపు సీఎం పదవికి మరో పోటీదారుగా భావిస్తున్న బాల్కనాథ్‌ ఢిల్లీ చేరుకున్నారు. ఇదిలా ఉంటే వసుంధర బీజేపీలో సచిన్‌ పైలట్‌ బాటలో పయనిస్తున్నారా? సచిన్‌ పైలట్‌ తన నాయకత్వంలోనే ఎన్నికలు జరిగాయని, కాంగ్రెస్‌ విజయానికి తానే కారణమని భావించారు. అయితే, ఆయనకు ఎప్పుడూ 20 మందికి పైగా ఎమ్మెల్యేల బహిరంగ మద్దతు లభించలేదు. సచిన్‌ పైలట్‌ కాంగ్రెస్‌లో అసమ్మతి గా మారి తన కెరీర్‌లో ఐదేండ్లు ఎలా గడిపారో ఆయనకు మాత్రమే తెలుసు.
వసుంధరకి ఎలాంటి ఆప్షన్స్‌ ఉన్నాయి?
పార్టీపై ఒత్తిడి తెచ్చే స్థాయికి వసుంధర తనను తాను తీసుకెళ్తే.. ఫలితం ఆమెకు అనుకూలంగా వస్తుందన్న ఆశ లేకపోలేదు. ప్రస్తుతం ఆమె ఇంటికి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు వచ్చినట్టు సమాచారం. ఆమె ఇంటికి చేరుకోవడానికి ధైర్యం చూపించిన ఎమ్మెల్యేలు వసుంధరకు గట్టి మద్దతుదారులేనన్నది నిజం. అయితే కాంగ్రెస్‌కు చెందిన 69 మంది ఎమ్మెల్యేలు కలిసి కూడా ఆమెకు మేలు చేయలేరు.
2024 లోక్‌సభ ఎన్నికలపై వసుంధర ఆశ
రాజస్థాన్‌లో వసుంధరకు ఇప్పటికీ విపరీతమైన ప్రజా మద్దతు ఉందనడంలో సందేహం లేదు. రాజస్థాన్‌లోని స్థానిక నాయకులలో ఆమె అత్యంత ప్రజాదరణ పొందిన మహిళా నేతగా రాణిస్తున్నారు. ర్యాలీలలో తమ సత్తా ఏంటో చూపారు. రాజ్‌పుత్‌ కుమార్తె, జాట్‌ కోడలు, గుర్జార్‌ల సమన్‌ల ఇమేజ్‌ కారణంగా, ఆమె ప్రతి తరగతిలోకి చొచ్చుకుపోయారు. ఈ కారణంగానే బీజేపీ హైకమాండ్‌ ఆమెకు పగ్గాలు ఇవ్వకపోగా, ఒంటరిగా ఉండేందుకు కూడా అనుమతించటం లేదు. అయితే ఈ ఎన్నికల్లో వసుంధరలో తన సొంత జిల్లాలో ఏమీ చేయలేకపోయానన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ధోల్‌పూర్‌ జిల్లాలోని నాలుగు సీట్లలో ఒక్కటి కూడా బీజేపీ గెలవలేకపోయింది. అలా వసుంధర టీమ్‌లోని చాలా మంది ముఖ్యమైన నేతలు ఈ ఎన్నికలలో విజయం సాధించలేకపోయారు. వసుంధర ఒత్తిడి తెస్తే 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల వరకు రాజస్థాన్‌ అధికార బాధ్యతలను పార్టీ ఆమెకు అప్పగించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం బీజేపీ దృష్టి పూర్తిగా 2024 లోక్‌సభ ఎన్నికలపైనే ఉంది. అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌ మధ్య జరిగిన పోరుతో రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ఎలా చీలిపోయిందో, అదే విధంగా వసుంధర రాజే వల్ల బీజేపీ కూడా బలహీనపడాలని ఆ పార్టీ కోరుకోవడం లేదన్నట్టు సంకేతాలిస్తోంది.
వసుంధర బలప్రదర్శన ఎందుకు?
ఎమ్మెల్యేలు వసుంధర ఇంటికి చేరుకుని, ప్రెస్‌ ముందుకు వచ్చి వసుంధరను సీఎం చేయాలంటూ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆమె ఒత్తిడి రాజకీయాలు మొదలుపెట్టారని చెప్పొచ్చు. బీజేపీ నుంచి కొత్తగా ఎన్నికైన జహజ్‌పూర్‌ ఎమ్మెల్యే గోపీచంద్‌ మీనా వసుంధర రాజేతో సమావేశమై.. ప్రజలు వసుంధర రాజేను ముఖ్యమంత్రిగా చూడాలను కుంటున్నారని అన్నారు. వసుంధర రాజేను కలిసేందుకు బీవర్‌ ఎమ్మెల్యే సురేష్‌ రావత్‌ కూడా వచ్చారు. వసుంధర ఇంతకుముందు చాలా బాగా పని చేశారని చెప్పుకొచ్చారు. అంతకుముందు జైపూర్‌లోని వసుంధర రాజే నివాసంలోకి అడుగుపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే బహదూర్‌ సింగ్‌ కోలీ.. వసుంధర రాజే సీఎం కావాలని అంటూనే తాను కూడా పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని , హైకమాండ్‌ తమ మాట వింటుందని చెప్పడం చర్చ నీయాంశమైంది.

Spread the love