ఇంకెన్ని వింతలు చూడాలో..

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో మనం రోజుకో వింతను చూస్తున్నాం. ఓ పది పదిహేనేండ్ల క్రితం రోబోల గురించి చెబుతుంటే విచిత్రంగా అనిపించేది. ఇప్పుడా దశను దాటి…కృత్రిమ మేథ (ఏఐ)ను కూడా అందిపుచ్చుకున్నాం. అది చేసే వింతలూ, విడ్డూరాలూ అన్నీ ఇన్నీ కావు. ఇప్పటిదాకా ముహూర్తాలు చూసుకుని బిడ్డలను కంటున్న జంటలనే చూశాం. కానీ పాశ్చాత్య దేశాల్లో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో మనకు ఏ పోలికలతో ఉన్న బిడ్డ కావాలో, వాడి ముక్కూ, మూతి ఎలా ఉండాలనే విషయాన్ని నిర్ణీత, నిర్దిష్టమైన సమయంలో చెబితే… ఏఐ ద్వారా అచ్చు గుద్దినట్టు అదే పోలికలతో బిడ్డను కనే సౌకర్యం అందుబాటులోకి వచ్చిందట. ప్రస్తుతానికి సరోగసీ విధానంలోనే ఇలాంటి బిడ్డలను కనే వెసులుబాటు ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పిచ్చాపాటిగా మాట్లాడు కుంటున్న సందర్భంలో మాజీ ఐపీఎస్‌, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ… మన తరంలో ఇంకా ఇలాంటి వింతలెన్నింటిని చూడాల్సి వస్తుందోనంటూ వ్యాఖ్యానించారు. ‘అవును సార్‌.. నిజమే…’ అనుకుంటూ అక్కడి నుంచి మెల్లగా కదిలారు విలేకర్లు…
– కె నరహరి

Spread the love