నేటి యువతరం ప్రేమకున్న అర్ధాన్ని మార్చేస్తున్నారు. తమ అవసరాలు తీర్చుకునే ఓ సంబంధంగా ప్రేమను వాడుకుంటున్నారు. ఇలాంటి వారి వల్ల ప్రేమ విలువ దిగజారిపోతోంది. ప్రేమంటే కొందరికైతే మ్యూచవల్ బెనిఫిట్స్ స్కీమ్‌లా మారిపోయింది. అమ్మాయి ఓ అబ్బాయి కావాలని, అబ్బాయి ఓ అమ్మాయి కావాలని కోరుకుంటున్నారే తప్ప, ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాంతం కలిసి బతకాలనే ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది. మరికొందరు తమ మానసిక, సామాజిక, ఆర్థిక అవసరాలు తీర్చుకోడానికి ప్రేమ అనే పదాన్ని ఉపయోగించుకుంటున్నారు. అలాంటి కథనమే ఈ వారం ఐద్వా అదాలత్…
రాహుల్‌కు 28 ఏండ్లు ఉంటాయి. మంచి ఉద్యోగం. అమ్మ, నాన్న, అక్క ఉన్నారు. కాలేజీ రోజుల్లోనే పల్లవితో ప్రేమలో పడ్డాడు. పల్లవి కూడా రాహుల్‌ను ప్రేమిస్తున్నాననే చెప్పింది. ఇద్దరు కాలేజ్ చదువు పూర్తి చేశారు. పల్లవి ఒక్కతే కూతురు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులే. పిల్లవికి ఎలాంటి లోటు లేకుండా పెంచారు. పల్లవి, రాహుల్ ప్రేమ గురించి కాలేజ్‌లో అందరూ మాట్లాడుకునేవారు. ప్రేమికులంటే వారిలా ఉండాలి అనుకునే వారు. ఒకరి ఇంటికి ఒకరు వచ్చి వెళ్ళేవారు. రాహుల్ వాళ్ళ కుటుంబ సభ్యులకు పల్లవి బాగా నచ్చింది. ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చిన తర్వాత పెండ్లి చేద్దామనుకున్నారు. పల్లవి తనకు ఏ చిన్న అవసరం వచ్చినా రాహుల్‌కు ఫోన్ చేసేది. అది ఏ సమయం అయినా సరే క్షణాల్లో వచ్చి చూసుకునేవాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు షాపింగ్‌కి తీసుకెళ్ళేవాడు. ఐస్ క్రీమ్‌లు తినడానికి అర్ధరాత్రి ఇద్దరూ కలిసి వెళ్ళేవారు. ఇలా ఎక్కడికంటే అక్కడకు రాహుల్‌ను తీసుకొని వెళ్ళేది. ప్రేమించే అమ్మాయిని ఎవరైనా రాహుల్‌లా చూసుకోవాలి అనుకునే వారు అందరూ. అయితే కాలేజీలో చదువుకునే వరకు ఇద్దరూ ఇలా ప్రేమగానే ఉన్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాత పల్లవి పిలిచిన ప్రతి సారి బయటకు వెళ్లడానికి రాహుల్‌కి కుదిరేది కాదు. కొన్ని సార్లు పై అధికారుల నుండి నోటీసులు కూడా అందుకున్నాడు. ఆ విషయం పల్లవికి చెప్పినా ఆమె అర్థం చేసుకునేది కాదు. ‘నీకు నా కంటే ఉద్యోగం ఎక్కువై పోయింది’ అనేది. ఇలా వీరి ప్రేమకు ఐదేండ్లు నిండాయి. ఇద్దరూ బాగా దగ్గరయ్యారు. రాహుల్ ఒక మంచి రోజు చూసుకుని పల్లవి దగ్గర పెండ్లి ప్రస్తావన తెచ్చాడు. దానికి పల్లవి ఒప్పుకోలేదు. పైగా ‘రాహుల్ నేను నిన్ను పెండ్లి చేసుకోవడం ఏమిటి, నాకు అలాంటి ఉద్దేశం లేదు. నీవు వేరే అమ్మాయిని చూసి పెండ్లి చేసుకో’ అని చెప్పింది. పల్లవి సమాధానం విని రాహుల్‌కి ఏం చేయాలో తోచలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చాడు. మేము పల్లవిని పిలిపించి మాట్లాడితే ‘నేను గతంలో రాహుల్‌ని ప్రేమించిన మాట నిజమే. కానీ అతన్ని పెండ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అతనికి అలాంటి ఫీలింగ్ ఉంటే దానికి నేనేం చేయలేను. అతను, అతని కుటుంబ సభ్యులు నాతో మామూలుగా ఉంటూనే సడన్‌గా పెండ్లి అంటే ఎలా..? నేను ఎప్పుడూ రాహుల్‌ను అలా ఊహించుకోలేదు. కాలేజీలో కలిసి తిరగడానికి ఒకరు కావాలి కాబట్టి రాహుల్‌తో క్లోజ్‌గా ఉన్నాను. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రాహుల్ వస్తాడు. నేను ఎక్కడికి తీసుకెళ్లమంటే అక్కడికి తీసుకెళతాడు. నాకు రాహుల్‌పై పూర్తి నమ్మకం వుంది కాబట్టి ఏమాత్రం ఆలోచించకుండా అతనితో ఎక్కడికైనా వెళ్ళేదాన్ని’ అంది. ‘మరి ఇద్దరూ శరీరకంగా ఒక్కటయ్యారు, మరి దాని గురించి ఏమంటావు’ అన్నాము. ‘అది అనుకోకుండా జరిగిపోయింది. దాని కోసం ఇప్పుడు రాహుల్ నన్ను పెండ్లి చేసుకోవాలి అనుకోవడం ఎంత వరకు సరైనది. ఎన్ని చెప్పినా నేను మాత్రం అతన్ని పెండ్లి చేసుకోవడం జరిగే పని కాదు. ప్రేమ పేరు చెబితే ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా నా వెనక తిరిగే ఒక అబ్బాయి కోసం నేను చూశాను. అది రాహుల్ అయ్యాడు. ఇప్పటికీ నేనే కావాలంటే నేను చెప్పినట్టు విని నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎలాంటి రీజన్ చెప్పకుండా వస్తే కనీసం అతనితో మాట్లాడతాను. అలా కాకుండా ప్రేమ, పెండ్లి అంటూ వేదిస్తే మాత్రం బాగుండదు’ అంది. మొత్తం విన్న తర్వాత కూడా రాహుల్ ‘పల్లవి లేకుండా నేను ఉండలేను. ఆమె నాకు కావాలి. నేను ఆమె కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను’ అన్నాడు. దానికి మేము ‘నువ్వు ప్రేమించాను, తను లేకపోతే ఉండలేను అంటున్నావు. తనేమో పెండ్లి చేసుకోనంటుంది. అనసరంగా ఆమె వెనకబడి నువ్వు ఇబ్బంది పడకు. తను అంత ఓపెన్‌గా తన అవసరాల కోసమే నిన్ను ప్రేమించానని చెబుతుంది. ఇంకా నువ్వు అర్థం చేసుకోకుండా తననే పెండ్లి చేసుకుంటాను అంటున్నావు. ఆమెకు నీపైన ప్రేమ లేదు. బలవంతంగా పెండ్లి ఎలా చేసుకుంటావు. ఇకపై ఆమెకు దూరంగా ఉంటే నీకే మంచిది. ఆమెకు కేటాయించే సమయం నీ కుటుంబానికి, స్నేహితులకు కేటాయించు. మెల్లమెల్లగా ఆమెను మర్చిపోవడానికి ప్రయత్నించు. లేదంటే నష్టపోయేది నువ్వే. నీలాంటి మంచి వ్యక్తిని పల్లవి మిస్ చేసుకుంటుంది. కచ్చితంగా నీ జీవితంలోకి ఓ మంచి అమ్మాయి వస్తుంది’ అంటూ సుమారు నాలుగు వారాలపాటు అతనికి ఎంతో సర్ధి చెప్పారు. చివరకు రాహుల్ మేము చెప్పిన దానికి అంగీకరించి ‘సరే మేడమ్, మీరు నా గురించి, నా భవిష్యత్ గురించి ఇంతగా ఆలోచించి చెబుతున్నారు. మీ మాట వింటాను. మీరు చెప్పినట్టే చేస్తాను. పల్లవిని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. నా ఉద్యోగం, కెరీర్‌పై దృష్టిపెడతాను. ఇన్ని రోజులు పల్లవి వెంట తిరుగుతూ నా కుటుంబాన్ని, స్నేహితులను దూరం పెట్టాను. ఇకపై వాళ్ళతో గడపుతాను’ అని చెప్పి వెళ్ళిపోయాడు.