– అంతర్జాతీయంగా తగ్గినా ఇక్కడ షరా మామూలే
న్యూఢిల్లీ : అంతర్జాతీయ చమురు ధరల్లో నెలకొన్న అస్థిరత, ధరల పెరుగుదల నుంచి సామాన్య ప్రజానీకాన్ని విజయవంతంగా ఒడ్డున పడేశామంటూ కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ గత వారం సీఐఐ నిర్వహించిన సదస్సులో గొప్పగా చెప్పుకున్నారు. అయితే ఆయన మాటలకు, వాస్తవ పరిస్థితికి ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో గత సంవత్సరం ఫిబ్రవరిలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. అప్పుడు ప్రభుత్వ రంగంలోని ఇంధన రిటైలర్లు ధరలు పెంచలేదు. కేంద్ర మంత్రి బహుశా ఈ విషయాన్ని ప్రస్తావించి ఉండవచ్చు. అయితే ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. ఆ సమయంలో ప్రైవేటు రంగంలోని రిటైలర్లు పెట్రోల్, డీజిల్‌ను అమ్మేందుకు సుముఖత చూపలేదు. అప్పుడు నష్టం వచ్చినప్పటికీ ప్రభుత్వ రంగ రిటైలర్లు ధరలు పెంచలేదని మంత్రివర్యులు సెలవిచ్చారు. ప్రైవేటు రిటైలర్లకు బాధ్యతే ఉండదని కూడా చెప్పుకొచ్చారు. అయితే గత సంవత్సరంతో పోలిస్తే అంతర్జాతీయ ఇంధన ధరలు 40శాతం నుంచి 50శాతం వరకూ తగ్గినప్పటికీ మన దేశంలో వినియోగదారులు మాత్రం ఇప్పటికీ అధిక రేట్లు చెల్లిస్తూనే ఉన్నారు. మరింత నష్టంతో పెట్రోల్, డీజిల్ విక్రయించాలని ప్రైవేటు రిటైలర్లను ఒత్తిడి చేయలేమని పూరి చెప్పారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం దేశంలో 87 వేల ఇంధన రిటైల్ ఔట్లెట్లు ఉన్నాయి. వీటిలో 8.300 మాత్రమే ప్రైవేటు రిటైలర్లవి. వీటిలోనూ నయారా ఎనర్జీ, రిలయన్స్ ఇండిస్టీస్ కంపెనీలవే ఎక్కువ. నయారా ఎనర్జీకి 6,400 బంకులు, రిలయన్స్‌కు 1500 బంకులు ఉన్నాయి.